సత్యసాయి జిల్లా: ఆటో ప్రమాదానికి కారణం ఇదే.. మరో 5 లక్షలు సాయం

Reason Behind The Auto Accident In Sri Sathya Sai District - Sakshi

సాక్షి, సత్యసాయి జిల్లా: తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లిలో విషాద ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆటోలో వెళ్తున్న కూలీలపై హై టెన్షన్‌ కరెంట్‌ వైర్లు తెగిపడటంతో మంటలు చెలరేగి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు మృతిచెందగా.. ఆరుగురు గాయపడ్డారు.

ఈ ఘటనపై డీఎస్పీ రమాకాంత్‌ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కుటుంబ సభ్యులు వ్యవసాయ పనుల కోసం ఆటోపై ఇనుప మంచం తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఇనుప మంచానికి తెగిపడిన విద్యుత్‌ తీగ తగలడంతో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో కొందరు ఆటో నుంచి దూకి బయటపడ్డారు. ఆటోలో ఉన్న ఐదుగురు మహిళలు మాత్రం మంటల్లో సజీవ దహనమయ్యారు. మృతులను గుడ్డంపల్లి వాసులుగా గుర్తించాము అని తెలిపారు. 

ఇదిలా ఉండగా.. విద్యుత్‌ ప్రమాద ఘటనపై ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ హరినాధ రావు తీవ్ర  దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాద ఘటనలో వెలుగు చూసిన దాని ప్రకారం ఒక ఉడుత కారణంగా ఈ ప్రమాదం జరిగిందని నిర్ధారించారు. కరెంట్‌ వైర్‌ను ఎర్త్‌ను ఉడుత క్రాస్ చేయడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ప్రమాద ఘటనపై శాఖ పరమైన విచారణకు ఆదేశించనట్టు వెల్లడించారు.  అనంతపురం ఎస్.ఈతో పూర్తి విచారణకు ఆదేశించామని, ప్రమాదంలో మృతి చెందిన వారికి రూ. 5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 2 లక్షల తక్షణ సహాయం అందిచనున్నట్టు తెలిపారు. 

ఇక, ఈ ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. పారిస్‌ పర్యటనలో ఉన్న ఆయన.. సీఎంవో ద్వారా ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలకు పది లక్షల రూపాయాల చొప్పున పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే.. ఈ ప్రమాదంలో గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు. బాధితుల కుటుంబాలకు అండగా నిలవాలని సీఎం జగన్‌ ఈ సందర్భంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చదవండి: సీఎం జగన్‌ దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియాకు, మెరుగైన చికిత్సకు ఆదేశం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top