చినబాబు గ్యాంగ్‌కు ‘స్పాట్‌’ రిజిస్ట్రేషన్‌ | DISCOMs are giving spot billing contracts to coalition leaders | Sakshi
Sakshi News home page

చినబాబు గ్యాంగ్‌కు ‘స్పాట్‌’ రిజిస్ట్రేషన్‌

Nov 6 2025 4:51 AM | Updated on Nov 6 2025 4:51 AM

DISCOMs are giving spot billing contracts to coalition leaders

కూటమి నేతలకు స్పాట్‌ బిల్లింగ్‌ కాంట్రాక్టులు కట్టబెడుతున్న డిస్కంలు

చినబాబు చెబితే చాలు... క్లాస్‌–1 కాంట్రాక్టర్‌ కాకపోయినా టెండర్లు 

ఈ విషయం వెలుగులోకి రావడంతో టెండర్లలో కొన్నింటి రద్దు 

హడావుడిగా కొత్త కాంట్రాక్టర్లకు క్లాస్‌–1 హోదా 

అసలు ఏ గుర్తింపూ లేకపోయినా కాంట్రాక్టు ఇవ్వాలంటూ ఒత్తిళ్లు 

మంత్రి పేషీ నుంచి ఫోన్‌ చేస్తున్నామంటూ అధికారులకు బెదిరింపులు 

‘సాక్షి’ కథనంతో ఉలిక్కిపడి కొత్త ఎత్తులు వేస్తున్న అక్రమార్కులు

సాక్షి, అమరావతి: ఉద్యోగుల బదిలీలు, విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు, సబ్‌ స్టేషన్ల నిర్మాణం, లైన్ల ఏర్పాటు, బూడిద, బొగ్గు టెండర్లన్నీ అక్రమాలే. వీటికితోడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి న తర్వాత విద్యుత్‌ సంస్థల్లో ఈ దారుణాల పరంపరలో మరో అధ్యాయం ఇది..! అన్నిటినీ చెరబట్టిన అధికార పార్టీ వారు ఇప్పుడు ‘‘స్పాట్‌ బిల్లింగ్‌ కాంట్రాక్టు’’లపై పడ్డారు. 

ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్‌), ఆంధ్రప్రదేశ్‌ మధ్య ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్‌)ల్లో పాత కాంట్రాక్టర్ల కాల పరిమితి ముగియడంతో కొత్త టెండర్లు పిలవడం కూటమి నేతలకు వరంగా మారింది. ముఖ్యంగా చినబాబు, మరో మంత్రి కనుసన్నల్లో టెండర్ల ప్రక్రియ మొత్తం నడుస్తున్నదనే ఆరోపణలు వస్తున్నాయి. 

ఈ విషయాన్ని ‘చినబాబు చెబితే అర్హత ఉండక్కర్లేదు’ శీర్షికన ఇటీవల ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. కంగుతిన్న అక్రమార్కులు వెనకడుగు వేశారు. కానీ, ఆశను వదులుకోలేక కొత్త ఎత్తులు వేస్తున్నారు. 

‘సాక్షి’ కథనంలో బట్టబయలు 
రాష్ట్రంలోని మూడు డిస్కంల పరిధిలో అన్ని జిల్లాల్లో కలిపి 1.95 కోట్ల విద్యుత్‌ సర్వీసులున్నాయి. వీటిలో 30 శాతం వరకు పారిశ్రామిక, వాణిజ్య, వ్యవసాయ సర్వీసులు. మిగతావాటికి ప్రతి నెల బిల్లులను స్పాట్‌ బిల్లింగ్‌ రీడర్ల ద్వారా ఇస్తున్నారు. విద్యుత్‌ పంపిణీ సంస్థలు స్పాట్‌ బిల్లింగ్‌ కాంట్రాక్టులను ఇస్తుంటాయి. గ్రామీణ, ఏజెన్సీ, పట్టణ కేటగిరీల వారీగా తీసిన బిల్లులకు కమీషన్‌ నిర్ణయిస్తారు. 

2023–25 నాటి రేట్లతోనే తాజాగా టెండర్లు పిలిచారు. ఒక్కో సర్వీసుకు పట్టణాల్లో రూ.6.16, గ్రామాల్లో రూ.6.36 చెల్లించాల్సి ఉంటుంది.  రెండేళ్ల పాటు ఇవే ధరలతో కాంట్రాక్టు కొనసాగనుంది. ఈ కాంట్రాక్టులు దక్కించుకోవడం కోసం చినబాబు గ్యాంగ్‌తో పాటు మరో మంత్రి అనుచరులు రంగంలోకి దిగారు. 

పాతవారు కాదు... మావాళ్లకే ఇవ్వాలి 
ఎన్నో ఏళ్లుగా స్పాట్‌ బిల్లింగ్‌ చేస్తున్నవారిని కాదని, తాము సిఫారసు చేసినవారికే టెండర్లు ఇవ్వాలంటూ విద్యుత్‌ శాఖ అధికారులపై ప్రభుత్వ ముఖ్యుల నుంచి  ఒత్తిళ్లు వస్తున్నాయి. నిబంధనల ప్రకారం క్లాస్‌–1 కాంట్రాక్టర్‌కు మాత్రమే టెండర్లలో పాల్గొనాలి. ఈ అర్హత లేనివారూ టెండర్లు దక్కించుకోవడానికి ప్రయత్నించారు. దీన్ని ‘సాక్షి’ బట్టబయలు చేయడంతో కొన్ని టెండర్లను అధికారులు రద్దు చేశారు. మరికొన్నిటిని గడువు ముగిశాక కూడా తెరవకుండా పెండింగ్‌లోనే ఉంచారు. 

కొత్తగా పుట్టుకొచ్చిన క్లాస్‌ 1 కాంట్రాక్టర్లు 
టెండర్లు రద్దు చేసినప్పటికీ... క్లాస్‌–1 కాంట్రాక్టర్‌ గుర్తింపు విషయంలో చినబాబు, మరో మంత్రి సూచించిన వారి కోసం అధికారులు కొత్త ఎత్తుగడ వేశారు. టెండర్లు రద్దయిన తరువాత కొందరికి క్లాస్‌–1 కాంట్రాక్టరు రిజి్రస్టేషన్‌ చేశారు. నిజానికి డిస్కం పరిధిలో పనులు చేసిన వారికే ఈ గుర్తింపు పత్రం ఇవ్వాలి. కానీ, ఇతర డిస్కంలలో చేసినవారికి కూడా ఇచ్చేస్తున్నారు. 

గతంలో ఎక్కడా ఏ పనీ చేయనివారికి చినబాబు, మంత్రి పేషీల నుంచి ఫోన్లు చేసి ‘వాళ్లు మనవాళ్లే, ఏ సరి్టఫికెట్‌ అవసరం లేదు. కాంట్రాక్టు ఇచ్చేయండి. లేకపోతే ట్రాన్స్‌ఫర్‌ ఖాయం’ అంటూ అధికారులను బెదిరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొందరు ఉన్నతాధికారులు ఈ ఒత్తిళ్లు భరించలేక పలు జిల్లాల్లో వారు చెప్పినవారికి కాంట్రాక్టులు కట్టబెట్టారు. మిగతా జిల్లాల్లో ఒకట్రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నారు.  

‘సాక్షి’ని దూరం పెట్టండి 
విద్యుత్‌ శాఖలో అక్రమాలు, అవినీతిని వెలుగులోకి తెస్తూ నిజాలు నిర్భయంగా రాస్తున్న ‘సాక్షి’పై కూటమి ప్రభుత్వం అక్కసు వెళ్లగక్కుతోంది. సాక్షాత్తు ఇంధన శాఖ మంత్రి అధికారికంగా నిర్వహించే విలేకరుల సమావేశాలకు ‘సాక్షి’ని పిలవద్దని   పేషీ సిబ్బందికి ఆదేశాలిచ్చారు. అలాగే మంత్రి కార్యక్రమాలను తెలియజేసేందుకు మీడియా సంస్థల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన వాట్సప్‌ గ్రూప్‌ల్లోనూ ‘సాక్షి’ ప్రతినిధులు ఉండకూడదని మంత్రి హుకుం జారీ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement