తిరుమలలో వైభవంగా రథ సప్తమి 

Ratha Saptami as grand level At Tirumala Temple - Sakshi

ఏడు వాహనాలపై ఊరేగిన మలయప్ప స్వామి 

విశేషంగా తరలివచ్చిన భక్తులు 

తిరుమల: సూర్య జయంతిని పురస్కరించుకుని తిరుమలలో శనివారం రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉదయం 5.30 నుంచి రా­త్రి 9 గంటల వరకు సూర్యప్రభ, చిన్నశేష, గ­రు­డ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్ర­­భ వా­హనాలపై మలయప్ప స్వామి విహరిస్తూ భక్తుల­ను అనుగ్రహించారు. అందుకే దీన్ని ఒ­కరోజు బ్ర­హ్మో­త్సవంగా భక్తులు భావిస్తారు. మద్యా­హ్నం చ­క్ర­స్నానం నిర్వహించారు.

కోవిడ్‌ త­ర్వాత మొ­దటిసారి ఆలయ మాడవీధుల్లో జరుగుతు­న్న రథసప్తమి, వాహన సేవలకు విశేషంగా భ­క్తు­లు తరలివ­చ్చారు. ఈ వాహన సేవల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి దంపతులు, టీటీడీ బోర్డు సభ్యుడు పోకల అశోక్‌ కుమార్, జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, సీవీఎస్వో  నరసింహ కిషోర్, ఎఫ్‌ఏసీఏవో బాలాజి, చీఫ్‌ ఇంజినీర్‌ నాగేశ్వరరావు, ఆలయ డిప్యూటీ ఈవో రమేష్‌ బాబు తదితరులు పాల్గొన్నారు. నాలుగు మాడ వీధులతోపాటు, క్యూల్లో వేచి ఉన్న భక్తులకు నిరంతరం అన్న పానీయాలను టీటీడీ అందజేసింది. 

సూర్యప్రభ వాహన సేవకు ప్రత్యేకత  
రథసప్తమి వాహన సేవల్లో అత్యంత ప్రధానమైనది సూర్యప్రభ వాహన సేవ. శ్రీమలయప్పస్వామి వారు సూర్యప్రభ వాహనంపై ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. సర్వలోకాలకు చైతన్యాన్ని కలిగిస్తూ ఉదయించే శ్రీసూర్య భగవానుడు తన ఉషారేఖలను ఉదయం 6.50 నిమిషాలకు శ్రీవారి పాదాలపై ప్రసరించి నమస్కరించారు. ఈ వాహన సేవ అపురూప దృశ్యాన్ని తిలకించేందుకు ఎంతో ఆసక్తితో నిరీక్షిస్తున్న లక్షలాదిమంది భక్తిపారవశ్యంతో పులకించారు. గోవింద నామస్మరణ మధ్య స్వామివారి వాహనసేవ వైభవంగా జరిగింది.కాగా, తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 12 గంటల్లో దర్శనం లభిస్తోంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top