వెలుగు వెనుక..చీకటి చరిత్ర! | Sakshi
Sakshi News home page

వెలుగు వెనుక..చీకటి చరిత్ర!

Published Sat, Sep 9 2023 5:07 AM

Ramoji stories about power in AP - Sakshi

సాక్షి, అమరావతి: తనకు నచ్చిన అంశాలను మాత్రమే ఇతరులతో పోల్చే ఈనాడు రామోజీకి పొరుగింటి పుల్లకూర బాగా నచ్చినట్లుంది!! విద్యుత్తు సంస్థల మెడకు అప్పుల గుదిబండ వేలాడదీసి రూ.30 వేల కోట్ల అప్పులను ఐదేళ్లలో దాదాపు రూ.70 వేల కోట్లకు చేర్చిన చంద్రబాబు నిర్వాకాలను మాత్రం పొరపాటున కూడా పోల్చే సాహసాన్ని చేయరు! ఆయన ఈనాడూ, ఏనాడూ దీని గురించి ప్రస్తావనే తీసుకురారు.

అడ్డగోలు పీపీఏలు, పాతికేళ్ల ఒప్పందాలతో గత సర్కారు ప్రజాధనాన్ని పీల్చి పిప్పి చేసినా అబ్బే అదే బాగుందంటారు!! విద్యుత్‌ పంపిణీ సంస్థలు, డిస్కంల నికర విలువ 2014లో మైనస్‌ రూ.4,315 కోట్లు ఉంటే గత ప్రభుత్వం దిగిపోయేనాటికి దారుణంగా క్షీణించి మైనస్‌ రూ.20 వేల కోట్లకు చేరింది. ఇక సబ్సిడీ, రాయితీలు, ప్రభుత్వ విభాగాల విద్యుత్‌ బిల్లుల కింద గత సర్కారు పంపిణీ సంస్థలకు రూ.20,167 కోట్లు చెల్లిస్తే ఇప్పుడు నాలుగేళ్లలోనే రూ 48,090 కోట్లు చెల్లించారు. టీడీపీ సర్కారు చెల్లింపులతో పోలిస్తే ఇది దాదాపు రెండున్నర రెట్లు ఎక్కువ.

మరి ఈ విషయాలన్నీ చెబుతుంటే ఈనాడుకు షాక్‌ కొడుతుందేమో!! ఇక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ చీకట్లో కూరుకుపోతుందని ప్రచారం చేసిందెవరో సూటిగా చెప్పకుండా ఎందుకీ డొంక తిరుగుడు? విభజన అనంతరం వాడుకున్న విద్యుత్తుకు సంబంధించి దాదాపు రూ.7 వేల కోట్ల బకాయిలను మన రాష్ట్రానికి ఇంతవరకు చెల్లించని తెలంగాణతో ఏపీని పోల్చుతూ ఈనాడు ప్రచురించిన కథనాలు పూర్తిగా అవాస్తవమని విద్యుత్‌ పంపిణీ సంస్థలు స్పష్టం చేశాయి. విద్యుదుత్పత్తి కేంద్రాలు, పవర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్లను (పీపీఏ) ఏ రాష్ట్రానివి ఆ రాష్ట్రానికే వదిలేసి ఉంటే తెలంగాణ రాష్ట్రం కరెంట్‌ కోతలతో చీకట్లో ఉండేదని డిస్కంలు పేర్కొన్నాయి.
 
మొండి బాకీ వసూలు కాక..
రాష్ట్ర విభజన నాటికి ఆంధ్రప్రదేశ్‌లోనే విద్యుత్‌ స్థాపక సామర్ధ్యం అధికం. అయితే అప్పటికే ఉన్న విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు రెండు రాష్ట్రాలకు వర్తిస్తాయని, పీపీఏ నిష్పత్తి ప్రకారం విద్యుత్‌ను పంచుకోవాలని విభజన చట్టంలో పేర్కొన్నారు. దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్‌)కు అనంతపురం, కర్నూలు జిల్లాలను కలపడం వల్ల ఎంత లోడ్‌ వాటా పెరుగుతుందో దానికి సరిపడా నిష్పత్తి పెంచారు. దాని ప్రకారం పీపీఏలలో  తెలంగాణకు 53.89 శాతం, ఏపీకి 49.11 శాతం వాటాగా నిర్దేశించారు. విభజన తేదీకి లోడ్‌ ప్రకారం ఏపీకి రోజుకి 22 మిలియన్‌ యూనిట్లు అంటే దాదాపు 1,000 మెగావాట్లు బేస్‌ లోడ్‌ కొరత ఉంది. విద్యుత్‌ కేంద్రాల ఉత్పత్తి ఎక్కడిది అక్కడి రాష్ట్రానికే అని చట్టంలో పొందుపరచి ఉంటే ఆంధ్రప్రదేశ్‌కు మిగులు, తెలంగాణకు కొరత ఉండేది.  

అదనపు విద్యుత్‌ కోసం తీసుకున్న చర్యలు..
కృష్ణపట్నం మూడో యూనిట్‌ పనులు  2014–19 మధ్య 90 శాతం పూర్తైనట్లు ఈనాడు ప్రచురించిన కథనంలో నిజం లేదు. రెండేళ్ల పాటు కోవిడ్‌ పరిస్థితుల్లోనూ వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో గత ఆర్థిక సంవత్సరం మార్చిలో మూడో యూనిట్‌లో వాణిజ్య ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. గ్రిడ్‌ అనుసంధానం (సింక్రనైజేషన్‌)– వాణిజ్య కార్యకలాపాల ప్రారంభం (సీవోడీ) మధ్య ఏడెనిమిది నెలల నుంచి ఏడాది వరకూ సమయం పట్టడం సాధారణం. కృష్ణపట్నం మొదటి దశ ప్రాజెక్టులను 2014లో సింక్రనైజేషన్‌ చేయగా దాదాపు ఏడాది తర్వాత 2015లో సీవోడీ చేశారు.  సుప్రీం కోర్టు తీర్పు మేరకు హిందుజా విద్యుత్‌ కేంద్రం నుంచి 1,040 మెగావాట్ల పీపీఏను పునరుద్ధరించారు.

సెంబ్‌కార్ప్‌ నుంచి 625 మెగావాట్లను అతి తక్కువ ధర (యూనిట్‌ రూ.3.84)కు కొనుగోలు చేసేలా 2021 డిసెంబర్‌లో ఒప్పందం జరిగింది. 2023 డిసెంబర్‌ నుంచి అది అందుబాటులోకి రావాల్సి ఉన్నా అనూహ్య కొరత కారణంగా ముందస్తుగా ఫిబ్రవరి నుంచే విద్యుత్‌ సేకరణ ప్రారంభమైంది. వీటీపీఎస్‌ స్టేజ్‌ 5లో 800 మెగావాట్ల  ఉత్పత్తి యూనిట్‌కు సంబంధించి ట్రయల్‌ రన్‌  పనులు జరుగుతున్నాయి. వీటీపీఎస్‌ ఎనిమిదో యూనిట్‌ను గ్రిడ్‌కు అనుసంధానించడంతో డిసెంబర్‌ కల్లా ఈ కేంద్రం పూర్తి స్థాయిలో అందుబాటులోకి  వస్తుంది. 

కొనుగోలు వ్యయాన్ని తగ్గిస్తూ..
దాదాపు 20 కేంద్ర విద్యుత్‌ కేంద్రాల్లో 625 మెగావాట్ల అధిక ధర థర్మల్‌ విద్యుత్‌ సామర్థ్యాన్ని కేంద్ర ప్రభుత్వానికి వెనక్కి ఇవ్వడం వల్ల ఏటా రూ.625 కోట్లు స్థిర చార్జీల రూపంలో మిగులుతున్నాయి. కేంద్ర విద్యుత్‌ శాఖ ప్రకటించిన ఆలస్య చెల్లింపుల సర్‌ చార్జీ స్కీములో చేరడంతో తక్కువ వడ్డీ రుణంతో విద్యుత్‌ ఉత్పత్తి సంస్థల బకాయిలన్నీ  తీర్చారు. దీంతో సర్‌ చార్జీ నుంచి డిస్కంలకు విముక్తి లభించింది.

వ్యవసాయానికి పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్‌ పథకాన్ని దీర్ఘకాలం పాటు నిర్విఘ్నంగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ‘సెకీ’ నుంచి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను అత్యంత చౌకగా యూనిట్‌ రూ.2.49 చొప్పున కొనుగోలు చేసేలా ఒప్పందం జరిగింది. 2022–23లో యూనిట్‌ రూ.5.13గా ఉన్న సగటు విద్యుత్‌ సేకరణ ఖర్చుతో పోల్చితే ఇది రూ.2.64 తక్కువకే వస్తుంది. 

విశాఖ, విజయవాడలో..
విశాఖ నగరంలో అత్యాధునిక భూగర్భ విద్యుత్‌ పంపిణీ వ్యవస్థ ఏర్పాటవుతోంది. ఇది ఎలాంటి విపత్తులనైనా తట్టుకుని అంతరాయం లేకుండా సరఫరా చేస్తుంది. విజయవాడలో కూడా విద్యుత్‌ సరఫరా నియంత్రణకు అన్ని 33/11 కేవీ ఉపకేంద్రాలను  అనుసంధానించి ‘స్కేడా’ సిస్టం అభివృద్ధి చేస్తున్నారు. ఆటోమేషన్‌ పనులు   జరుగుతున్నాయి. అన్ని కొత్త సబ్‌ స్టేషన్లను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని  ఉపయోగించి నిర్మిస్తున్నారు. 

స్మార్ట్‌ మీటర్ల ఖర్చు ప్రభుత్వానిదే
రాష్ట్రంలో మొత్తం వినియోగంలో 18 శాతం నుంచి 20 శాతం వరకు వ్యవసాయ రంగంలో నమోదవుతోంది. కచ్చితత్వంతో ఈ విద్యుత్‌ను లెక్కించకపోవడం వల్ల ఇంధన ఆడిట్‌ కష్టం అవుతోంది. కేంద్ర విద్యుత్‌ శాఖ నిబంధనల ప్రకారం వ్యవసాయ వినియో గదారులకు మీటర్లు బిగించాల్సి ఉంది. దీనికయ్యే ఖర్చును మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. విద్యుత్‌ సంస్థలపైన గా>నీ, రైతులపైనగానీ ఒక్క రూపాయి కూడా భారం పడదు. 

వ్యవసాయ కనెక్షన్లలో దేశంలోనే రికార్డు..
రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్‌ కోతలు అమలు జరగడం లేదు. ఖర్చుకు వెనుకాడకుండా (సీలింగ్‌ యూనిట్‌ రూ.10) సేకరించి సరఫరా చేసేందుకు ప్రభుత్వం  అనుమతినిచ్చింది. 2022–23లో రాష్ట్రంలో 25,000 వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు మంజూరు చేయాలన్నది లక్ష్యం కాగా రికార్డు స్థాయిలో 1,27,959 కనెక్షన్లు రైతులకు మంజూరైనట్లు స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. గత నాలుగేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం 3.4 లక్షలకు పైగా వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేసింది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇన్ని కనెక్షన్లు ఇవ్వలేదు. 

అప్పుల నుంచి అభివృద్ధి దిశగా..
రాష్ట్ర విభజన నాటికి విద్యుత్‌ సంస్థల అప్పులు దాదాపు రూ.29,700 కోట్లు కాగా 2019 మార్చి నాటికి గత సర్కారు హయాంలో రూ.68,600 కోట్లకు (131 శాతం పెరుగుదల) చేరుకున్నాయి. 2023 మార్చి నాటికి రూ.97,500 కోట్లకు (42శాతం పెరుగుదల) చేరాయి. గత సర్కారు సబ్సిడీ, రాయితీలు, ప్రభుత్వ విభాగాల విద్యుత్‌ బిల్లుల కింద డిస్కంలకు రూ.20,167 కోట్లు చెల్లిస్తే వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వచ్చాక రూ.48,090 కోట్లు చెల్లించింది. 

 
Advertisement
 
Advertisement