
ఇప్పటికే మూడుసార్లు రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన రామకృష్ణ
ఆయన స్థానంలో ముప్పాళ్లను నియమిద్దామనుకున్న పార్టీ అధినాయకత్వం
అనూహ్యంగా తెరపైకి గుజ్జుల ఈశ్వరయ్య
కేడర్ కూడా ఈశ్వరయ్య వైపే మొగ్గు చూపడంతో షాక్
ఓటింగ్‌లో ఈశ్వరయ్య గెలిచే అవకాశాన్ని పసిగట్టిన నాయకులు
రాష్ట్ర కార్యదర్శి ఎన్నిక జరపకుండానే మహాసభలు ముగింపు
సాక్షి, అమరావతి: భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) ఆంధ్రప్రదేశ్ విభాగంలో వర్గపోరు తారస్థాయికి చేరింది. దీంతో నూతన రాష్ట్ర కార్యదర్శిని ఎన్నుకోకుండానే మహాసభలను ముగించేశారు. సీపీఐ నాయకులు ప్రతి రెండేళ్లకొకసారి మహాసభలు నిర్వహించి.. రాష్ట్ర కార్యదర్శిని, రాష్ట్ర ముఖ్య నాయకత్వాన్ని ఎన్నుకుంటూ ఉంటారు. మూడు పర్యాయాలుగా కె.రామకృష్ణ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 24, 25 తేదీల్లో ఒంగోలులో రాష్ట్ర మహాçసభలు జరిగాయి. ఈ సభల్లో.. రామకృష్ణ స్థానంలో మరొకరిని నియమించాలని పార్టీ అధినాయకత్వం నిర్ణయించింది.
తొలుత విశాఖకు చెందిన జేవీవీ సత్యనారాయణమూర్తికి పార్టీ పగ్గాలు అప్పగించాలని భావించింది. ఆయన ఇటీవల విశాఖపట్నం అర్బన్ బ్యాంక్ చైర్మన్‌గా ఎన్నికవ్వడంతో.. ఆ ఆలోచనను విరమించుకుంది. గుంటూరు జిల్లాకు చెందిన రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావును రాష్ట్ర కార్యదర్శి పదవిలో కూర్చోబెట్టాలని అధినాయకత్వం నిర్ణయించింది. ఈ ప్రతిపాదనను అత్యధిక శాతం ప్రతినిధులు(డెలిగేట్స్) వ్యతిరేకించారు.
వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గుజ్జుల ఈశ్వరయ్యకు రాష్ట్ర కార్యదర్శి పదవి ఇవ్వాలని పట్టుబట్టారు. అనూహ్యంగా వచ్చిన ఈ ప్రతిపాదనతో అధినాయకత్వం షాక్‌కు గురైంది. ముప్పాళ్లకు మార్గం సుగమం చేసేందుకు.. ఈశ్వరయ్య వర్గానికి నచ్చజెప్పేందుకు ప్రయత్నాలు చేసింది. ఈశ్వరయ్యకు మద్దతుగా నిలిచిన పలువురు ప్రతినిధులు తీవ్రంగా స్పందించారు. కమ్మ సామాజికవర్గానికి చెందిన ముప్పాళ్లకే పార్టీ పగ్గాలు అప్పగించాలనే పంతం ఎందుకని నిలదీశారు. బీసీ వర్గానికి చెందిన ఈశ్వరయ్యకు అవకాశం ఎందుకు ఇవ్వట్లేదని ప్రశి్నంచారు.
ఓటింగ్ నిర్వహించి రాష్ట్ర కార్యదర్శిని నియమించాలని పట్టుబట్టారు. ఓటింగ్ అనివార్యమైతే తమ మద్దతు ఉన్న ముప్పాళ్లకు అవకాశం ఉండదని.. ఈశ్వరయ్యే గెలుస్తారని అధినాయకత్వం గుర్తించింది. అలా జరగకుండా చర్యలు తీసుకుంది. రాష్ట్ర కార్యదర్శి ఎన్నికను జాతీయ మహాసభల తర్వాత చూద్దామంటూ సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, ప్రస్తుత రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తదితర ముఖ్య నేతలు వాయిదా వేశారు. దీంతో సోమవారం రాత్రి 11 గంటలకు రాష్ట్ర కౌన్సిల్‌ను మాత్రమే ఎన్నుకుని.. మహాసభలను ముగించారు. దీంతో సీపీఐ ప్రతినిధులు, కేడర్ మొత్తం విస్తుపోయింది.