సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖ.. రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు

Rajnath Singh Attends INS Sandhayak Commissioning Ceremony Visaka - Sakshi

సాక్షి, విశాఖ: ఐఎన్‌ఎస్‌ సంధాయక్‌ సర్వే నౌకను భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ జాతికి అంకితం ఇచ్చారు. ఈరోజు విశాఖలోని నేవల్‌ డాక్‌యార్డులో తూర్పు నౌకాదళ ముఖ్య కార్యాలయం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఐఎన్‌ఎస్‌ సంధాయక్‌ నౌకను జాతికి అంకితమిచ్చారు. 

హైడ్రోగ్రాఫిక్‌ సర్వే జరిపేందుకు కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ ఆదేశాలతో.. కోల్‌కతాలోని గార్డెన్‌రీచ్‌ షిప్‌ బిల్డింగ్‌ ఇంజినీర్స్‌ (జీఆర్‌ఎస్‌ఈ) సంస్థ ‘ఐఎన్‌ఎస్‌ సంధాయక్‌’ను నిర్మించింది. ఇది 3,800 టన్నుల సామర్థ్యంతో 110 మీటర్ల పొడవుంది. హెలిపాడ్‌, సర్వే సాంకేతిక పరికరాలు, రెండు డీజిల్‌ యంత్రాలు అమర్చారు. తాజాగా దీన్ని జాతికి అంకితమిచ్చారు. ఈ కార్యక్రమంలో నౌకాదళ అధిపతి అడ్మిరల్‌ ఆర్‌.హరికుమార్‌, తూర్పు నౌకాదళ ప్రధాన అధికారి వైస్‌ అడ్మిరల్‌ రాజేశ్‌ పెందార్క పాల్గొన్నారు. సంధాయక్‌ నౌకకు కమాండింగ్‌ అధికారిగా కెప్టెన్‌ ఆర్.ఎం.థామస్‌ వ్యవహరించనున్నారు.

ఈ సందర్బంగా రాజ్‌నాథ్‌సింగ్‌ మాట్లాడుతూ..‘భారత నౌకాదళ అమ్ములుపొదిలో ఐఎన్ఎస్ సంధాయక్ జలప్రవేశం సంతోషకరం. భారత నౌకాదళం స్వయం సమృద్ధి వైపు అడుగులు వేస్తోంది. ప్రపంచ సముద్ర జలాల్లో కూడా భారత నౌకాదళం కీలక భద్రత చర్యలు చేపడుతోంది. భారత్‌కు ఎనిమిది వేల నాటికల్‌ మైళ్ల దూరంలో సముద్రపు దొంగలను కూడా నౌకాదళం అదుపు చేసింది. సముద్ర జలాల్లో శాంతి సామరస్యం పరిరక్షించడమే ఇండియన్ నేవీ లక్ష్యం. సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖ నగరం. తూర్పు నౌకాదళం విశాఖ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. విశాఖ గణనీయంగా అభివృద్ధి చెందుతోంది. ఇండియన్ నేవీ విస్తరణలో విశాఖ నగర పాత్ర మరువ లేనిది’ అని కామెంట్స్‌ చేశారు. 

 

whatsapp channel

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top