
బ్రహ్మపుత్ర నది ఒడ్డున సేదతీరుతున్న కవిత
రివర్ రాఫ్టింగ్‌లో ప్రతిరోజూ నేను కోరుకున్నది ఇదే..
ఎన్ని ఆటంకాలు ఎదురైనా ప్రయాణం ఆపలేదు
28 రోజుల్లో 1040 కి.మీ. రివర్ రాఫ్టింగ్ పూర్తి చేశాం
12 మంది బృందంలో నేనొక్కదాన్నే మహిళను..
‘సాక్షి’తో ఆర్మీ వైద్యాధికారి వాసుపల్లి కవిత
సాక్షి, విశాఖపట్నం: ‘బ్రహ్మపుత్ర నదిలో రాఫ్టింగ్ మొదలుపెట్టిన రెండు గంటల్లోనే ప్రవాహం పెరిగింది. పెద్ద అలలా నీరు రావడం, అదే సమయంలో రాళ్లు ఎక్కువగా ఉండటంతో రాఫ్ట్ అదుపు తప్పి కిందపడిపోయాను. బ్రహ్మపుత్ర ప్రయాణమే ఆఖరుదని అనుకున్నాను. ఆ క్షణంలో దేవుడ్ని, దేశాన్ని ప్రారి్థంచుకున్నాను. కష్టమ్మీద మళ్లీ రాఫ్ట్‌లోకి ఎక్కాను. ఇక అక్కడి నుంచి వెనుదిరగలేదు. ప్రపంచ రికార్డు సాధించే దిశగా సాగిన మా ప్రయాణం విజయవంతమైంది. బ్రహ్మపుత్రలో రివర్ రాఫ్టింగ్ చేసిన తొలి మహిళగా గుర్తింపు పొందాను’అని వెల్లడించారు ఆర్మీ మేజర్, వైద్యాధికారి వాసుపల్లి కవిత. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరుకు చెందిన మేజర్ కవిత.. ఈ ఘనత సాధించిన తొలి మహిళగా ప్రపంచ రికార్డు నెలకొల్పారు. విశాఖలోని తూర్పు నౌకాదళానికి ఇటీవల వచ్చిన ఆమె తన అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు.
దేవుడికి, దేశానికి ప్రారి్థంచి..
1,040 కిలోమీటర్ల బ్రహ్మపుత్ర నదిని 28 రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇండో–టిబెటెన్ బోర్డర్ నుంచి బంగ్లాదేశ్ సరిహద్దు వరకు మా ప్రయాణం సాగింది. ప్రతిరోజూ ఉదయం అల్పాహారం చేసి, దేవుడికి, దేశానికి ప్రారి్థంచి మా ప్రయాణం మొదలుపెట్టేవాళ్లం. 28 రోజుల్లో పూర్తి చేయాలంటే సమయం వృథా చేయకూడదు. అందుకే ఆహారం కూడా మితంగా, బోట్‌లోనే తీసుకునేవాళ్లం. ఒక్కోసారి 12 గంటలపాటు ఏకధాటిగా రాఫ్టింగ్ చేశాం. అనుకున్నది సాధించాం.
సాహస క్రీడలకు స్వర్గధామం
‘అడ్వెంచర్ స్పోర్ట్స్‌లో భారత్ వెనుకబడి ఉంది.. మన దేశంలో వీటికి ప్రాధాన్యం లేదు’అని చాలా మంది అంటారు. మేం దానిపైనే దృష్టి సారించాం. ఈ రాఫ్టింగ్‌తో ఒక మెట్టు ఎక్కాం. ఇకపై బ్రహ్మపుత్ర రివర్ రాఫ్టింగ్ పేరు చెబితే మొదట మా పేరే వినిపిస్తుంది. ఈశాన్య, ఉత్తరాది రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక పర్యాటకానికి ఉన్న ప్రాధాన్యం సాహస పర్యాటకానికి లేదు. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు, జీవ వైవిధ్యంతో కూడిన సాహస పర్యాటకానికి ప్రపంచ గుర్తింపు తీసుకురావాలన్నదే
మా ప్రయత్నం.
మహిళలు ఎందులోనూ తక్కువ కాదు!
వైద్యులకు మానసిక స్థైర్యం ఉంటుంది కానీ, శారీరకంగా దృఢంగా ఉండరని చాలా మంది అంటుంటారు. అది తప్పని నిరూపించాలని ఎప్పుడూ అనుకునేదాన్ని. చిన్నప్పటి నుంచి నా ఆలోచనలు ఇలాగే ఉండేవి. పాఠశాల రోజుల్లో క్రీడలపై ఎక్కువ దృష్టి పెట్టాను. మగవాళ్లతో పోలిస్తే మహిళలు ఎందులోనూ తక్కువ కాదని చెప్పాలన్నదే నా ఉద్దేశం. ఇప్పుడు దాన్ని నిరూపించాను.
రాష్ట్రపతి మెడల్‌తో ఆత్మవిశ్వాసం
అరుణాచల్‌ప్రదేశ్‌లో పని చేస్తున్నప్పుడు 18 వేల అడుగుల ఎత్తులో ఉన్న గోరీచెన్ బేస్ క్యాంప్‌కు మెడికల్ ఆఫీసర్‌గా నాలుగైదుసార్లు వెళ్లాను. నన్ను గమనించిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ అండ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ డైరెక్టర్.. ‘మీరు కూడా ట్రెక్ చేయవచ్చు కదా’అని సలహా ఇచ్చారు. అప్పుడే రాఫ్టింగ్ కోర్సులో చేరాను. ఆ సమయంలోనే నేనెందుకు గోరీ చెన్ పర్వతాన్ని అధిరోహించకూడదు? అనిపించింది.
నా మీద నాకు నమ్మకం వచ్చాక పర్వతారోహణకు సిద్ధమయ్యాను. ఒక రోజు ట్రెక్‌లో చాలా మంది ఉన్నారు. పైకి వెళ్తున్నప్పుడు పైనుంచి ఒక పెద్ద రాయి దొర్లుకుంటూ వచ్చింది. వెంట్రుకవాసిలో తప్పించుకున్నాను. విజయవంతంగా శిఖరాన్ని చేరి దేశ పతాకాన్ని ఎగురవేశాను. అదే సమయంలో ట్రెక్ చేస్తున్న ఓ మహిళ ఊపిరాడక ఇబ్బంది పడుతోంది. వెంటనే స్పందించి ఆమె ప్రాణాలు కాపాడాను. ఎంబీబీఎస్ చేసినందుకు ఆ రోజు ఎంతో ఆనందం కలిగింది. ఈ సంఘటనకు గానూ రాష్ట్రపతి నుంచి విశిష్ట సేవా పతకం అందుకున్నాను.
నాన్న భరోసా.. అమ్మ ఆత్మవిశ్వాసం!
నాన్న రామారావు రైల్వే క్లర్క్. అమ్మ గృహిణి. నాకు ప్రభుత్వ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు వచ్చినా, నా చదువు పూర్తి చేయడానికి నాన్న ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారు. ఎంబీబీఎస్ అయ్యాక పీజీ చేస్తానని చెప్పాను. అప్పుడు నాన్న ఆర్థిక పరిస్థితిని వివరించారు. వైద్య వృత్తిలో స్థిరపడాలనుకుంటున్న సమయంలో, ఆర్మీలో కూడా మెడికల్ ఆఫీసర్‌గా పనిచేయవచ్చని తెలుసుకున్నాను. ఈ విషయం అమ్మానాన్నలకు చెప్పగా.. రక్షణ రంగం అనగానే వాళ్లు కొంచెం భయపడ్డారు. అక్కడ బాగుంటే కొనసాగుతాను, లేదంటే తిరిగి వచ్చి వైద్య వృత్తిలో స్థిరపడతానని వారికి నచ్చజెప్పాను. నాన్న భరోసా ఇచ్చారు. అమ్మ ఆత్మవిశ్వాసాన్ని నింపింది. అందుకే కెపె్టన్‌గా మొదలై.. మేజర్ స్థాయికి చేరుకున్నాను.