
సాక్షి, అనకాపల్లి: కృష్ణాష్టమి వేడుకల ముసుగులో యలమంచిలి మండలం ఏటికొప్పాకలో టీడీపీ నేత ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి అశ్లీల నృత్యాలు ప్రదర్శించారు. ముగ్గురు యువతులను బాడుగకు తీసుకొచ్చి అశ్లీల నృత్యాలు వేయించారు. ఈ ప్రదర్శన వద్ద మద్యం మత్తులో ఉన్న యువకుల ఆగడాలు శ్రుతి మించి రెండు వర్గాలుగా విడిపోయి గొడవపడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో అక్కడున్న యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్, హోం గార్డు ప్రేక్షక పాత్రకే పరిమితమవాల్సి వచ్చింది. హరే రామ హరే కృష్ణ, గీతా పారాయణంతో ఆధ్యాత్మికత ఉండాల్సిన ఆలయం పక్కనే అశ్లీల నృత్య ప్రదర్శన నిర్వహించడం గమనార్హం. వివరాలివి.
ఏటికొప్పాక గ్రామంలో ప్రతి ఏటా కృష్ణాష్టమిని పురస్కరించుకుని రెండ్రోజులు వేడుకలు నిర్వహించడం ఆనవాయితీ. దీనిలో భాగంగా ఆదివారం శ్రీకృష్ణుని ఆలయం వద్ద భారీ అన్నసంతర్పణ నిర్వహించారు. అనంతరం రాత్రి 9 గంటల సమయంలో అశ్లీల నృత్యాలకు తెరలేపారు. శివాలయం, శ్రీకృష్ణుని ఆలయాల మధ్య ట్రాక్టర్‌పై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టేజీపై ముగ్గురు యువతులు బూతు పాటలకు అశ్లీల నృత్యాలను ప్రదర్శించారు. స్టేజీపై ఉన్న యువకులు యువతులతో అసభ్యకరంగా ప్రవర్తించారు. మీడియా కంట పడకుండా ఉండేందుకు గ్రామానికి ప్రవేశించే అన్ని దారుల్లో సమాచారం అందించడానికి వీలుగా కొందరు యువకులను ఉంచారు. వీరు ఎవరైనా ద్విచక్ర వాహనాలపై గ్రామంలోకి వస్తే యువకులు నిర్వాహకులకు ఫోన్ చేసి సమాచారం అందజేశారు.
రాత్రి 11.30 గంటల సమయంలో యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఇద్దరు అక్కడకు చేరుకోవడంతో అశ్లీల ప్రదర్శన నిలిపివేశారు. అనంతరం అక్కడున్న కొందరు యువకులు రెండు వర్గాలుగా గొడవకు దిగారు. పోలీసులు వారిస్తున్నా యువకులు ఒకరిపై ఒకరు అరుపులు, కేకలతో దుర్భాషలాడుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. యువకుల మధ్య వివాదాన్ని అక్కడకు వచ్చిన పోలీసు సిబ్బంది తమ మొబైల్ ఫోన్లతో చిత్రీకరించారు. అయితే ఈ తతంగమంతా గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడి సమక్షంలోనే చోటుచేసుకోవడం గమనార్హం.