
సాక్షి, విశాఖపట్నం/విజయవాడ: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈ ఉదయానికి తీరం దాటింది. గోపాల్‌పూర్ వద్ద తీరం దాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో.. ఏపీలో కొన్నిచోట్ల వర్షాలు పడుతున్నాయి. అదే సమయంలో.. గడిచిన 24 గంటల్లో కురిసిన వర్షాలతో కృష్ణా నదికి వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది.
కృష్ణానదికి ప్రవాహం పెరగడంతో.. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుత ఇన్ ఫ్లో , అవుట్ ఫ్లో 4,01,087 క్యూసెక్కులుగా ఉంది. మొత్తం 70 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉండడంతో.. ప్రభావిత జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ‘‘కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వాగులు.. కాలువలు దాటే ప్రయత్నం చేయరాదు’’ అని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో ప్రజలను హెచ్చరించారు.
వాయుగుండం ప్రభావంతో గడచిన 24 గంటల్లో.. పాడేరులో 16 సెంమీ వర్షపాతం నమోదైంది. రాష్ట్రమంతటా ఇవాళ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు, అలాగే కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ భారీ వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. తీరం వెంబడి ఈదురు గాలులు కొనసాగుతాయని పేర్కొంది.
చేపల వేటకు వెళ్ళి..
భారీ వర్షంలో.. చేపల వేటకు వెళ్లిన ఓ యువకుడు సముద్రంలో గల్లంతయ్యాడు. పెద్ద అల ఒక్కసారిగా రావడంతో యువకుడు తమ కళ్ల ముందే కొట్టుకుపోయాడని, రక్షించే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని కొందరు మత్స్యకారులు తెలిపారు. సదరు యువకుడిని ఎంవీపీ కాలనీకి చెందిన సతీష్‌గా గుర్తించారు. విషయం తెలిసిన వెంటనే అతని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.