‘పీఎం జన్‌ మన్‌’తో గిరిజనుల అభివృద్ధికి కృషి

Rajeev Gauba to officials: Ensure tribals get PM Janman scheme benefits - Sakshi

పథకం అమలుపై సీఎస్‌లతో కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబ సమీక్ష     

15న అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజనులతో మాట్లాడనున్న ప్రధాని మోదీ

సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఉన్న మారుమూల ప్రాంతాల్లోని గిరిజనుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్‌(పీఎం జన్‌మన్‌ యోజన) పథకం ప్రవేశపెట్టిందని కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబ చెప్పారు. ఈ పథకం అమలుపై వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు(సీఎస్‌లు)తో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. గిరిజన తెగల్లో కూడా బాగా వెనుకబడిన తెగలున్నాయని.. వారిని ఇప్పటివరకు ఎవరూ అంతగా పట్టించుకోలేదన్నారు.

అలాంటి వారందరి అభివృద్ధి కోసమే ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని పేర్కొన్నారు. 2023–24 నుంచి 2025–26 వరకు ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు కేంద్రం వాటాగా రూ.15,336 కోట్లు, రాష్ట్రాల వాటాగా రూ.8,768 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. కేంద్ర, రాష్ట్ర పథకాల ద్వారా పక్కా ఇళ్ల నిర్మాణం, రహదారుల అభివృద్ధి, మొబైల్‌ మెడికల్‌ యూనిట్ల ద్వారా ఆరోగ్య పరిరక్షణ, నిరంతర నీటి సౌకర్యం, ప్రతి ఇంటికీ విద్యుత్, అంగన్‌వాడీ కేంద్రాల ఏర్పాటు, మలీ్టపర్పస్‌ కేంద్రాలు, సోలార్‌ వీధి దీపాలు, మొబైల్‌ టవర్లు, ఒకేషనల్‌ విద్యా కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఎస్‌లకు రాజీవ్‌ గౌబ సూచించారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని పథకాల ద్వారా లబ్ధి కలిగించాలన్నారు.

ఈ నెల 15న ప్రధాని మోదీ వర్చువల్‌గా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కొత్త బల్లుగుడ, పాత బల్లుగుడకు చెందిన ఆదివాసీలతో మాట్లాడతారని చెప్పారు. అనంతరం సీఎస్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి ఈ అంశంపై రాష్ట్ర అధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలోని పీవీటీజీ ఆవాసాల్లోని వారందరికీ వివిధ పథకాలను మిషన్‌ మోడ్‌లో పూర్తి స్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని సీఎస్‌ ఆదేశించారు. ఉన్నతాధికారులు కె.విజయానంద్, బి.రాజశేఖర్, ఎంటీ కృష్ణబాబు, గోపాలకృష్ణ ద్వివేది, ప్రవీణ్‌ ప్రకాశ్, జి.జయలక్షి్మ, కాంతిలాల్‌ దండే, సురేష్‌ కుమార్, లక్ష్మీశా, జె.వెంకట మురళి, బాలూ నాయక్, కృష్ణా రెడ్డి పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top