రబీలో భీకర కరువు | Rabi drought worsens in five states including Andhra Pradesh | Sakshi
Sakshi News home page

రబీలో భీకర కరువు

Nov 14 2026 5:52 AM | Updated on Nov 14 2026 5:52 AM

Rabi drought worsens in five states including Andhra Pradesh

ఏపీ సహా ఐదు రాష్ట్రాల్లో తీవ్ర దుర్భిక్షం  

గుంటూరు, బాపట్ల, పశ్చిమగోదావరి, నెల్లూరు జిల్లాలకు ప్రమాద ఘంటికలు 

ఈ జిల్లాల్లో రబీలో 90 శాతం లోటు వర్షపాతం 

రూ.20,256 కోట్ల వ్యవసాయ రుణాలపై తీవ్రప్రభావం

కరువుపై ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక అంచనా    

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌తో సహా ఐదు రాష్ట్రాల్లో రబీలో కరువు భీకరరూపం దాలుస్తుందని ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక వెల్లడించింది. ఈ రాష్ట్రాల్లో వ్యవసాయ రుణాలతోపాటు పంట ఉత్పత్తులకు అత్యధిక ముప్పు వాటిల్లుతుందని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లో వ్యవసాయ దుర్బలత్వం అత్యధికంగా ఉంటుందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు, బాపట్ల, పశ్చిమగోదావరి, నెల్లూరు జిల్లాల్లో కరువు తీవ్రంగా ఉంటుందని అంచనా వేసింది. ఈ నాలుగు జిల్లాల్లో రబీలో దాదాపు 90 శాతం లోటు వర్షపాతం ఉంటుందని వెల్లడించింది. 

అంతే కాకుండా ఈ నాలుగు జిల్లాల్లో వ్యవసాయ రుణాలపై తీవ్ర ప్రభావం పడుతుందని, రబీలో రూ.20,256 కోట్ల వ్యవసాయ రుణాలపై ప్రభావం ఉంటుందని నివేదిక పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌తోపాటు మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కరువు ఎదుర్కోవడానికి సుమారు రూ.13,776 కోట్లు అవసరం అవుతాయని, అలాగే ఈ ఐదు రాష్ట్రాలపై రూ.33,000 కోట్ల ఆర్థిక భారం పడుతుందని నివేదిక అంచనా వేసింది. రబీ సీజన్‌లో పంట నష్టం ఎక్కువగా 20 జిల్లాల్లో ఉంటుందని, ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు, బాపట్ల, పశ్చిమగోదావరి, నెల్లూరు జిల్లాల్లో పంట నష్టం అధికంగా ఉంటుందని పేర్కొంది. 

తెలంగాణలో నల్గొండ, నిజామాబాద్‌ జిల్లాల్లో కరువు ముప్పు అత్యధికంగా ఉంటుందని వివరించింది. తమిళనాడులో సుమారు రూ.43,548 కోట్లు, మహారాష్ట్రలో రూ.12,115 కోట్ల వ్యవసాయ రుణాలపై ప్రభావం ఉంటుందని అంచనా వేసింది.  కరువు కారణంగా ఖరీఫ్, రబీలో కలిపి దేశంలో సుమారు 3.86 కోట్ల టన్నుల వ్యవసాయ పంటల ఉత్పత్తికి నష్టం వాటిల్లుతుందని, ఇందులో ఖరీఫ్‌లో 0.89 కోట్ల టన్నులు, రబీలో 2.97 కోట్ల టన్నులు నష్టం ఉంటుందని నివేదిక పేర్కొంది. ఈ వ్యవసాయ ఉత్పత్తుల విలువ  సుమారు రూ. లక్ష కోట్లు ఉండొచ్చని అభిప్రాయపడింది. ఖరీఫ్,  రబీ సీజన్లలో కలిపి సుమారు 1.35 కోట్ల హెక్టార్ల సాగు విస్తీర్ణంలో పంట ఉత్పత్తులపై ప్రభావం పడే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.

ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదికలో ప్రధానాంశాలు 
» ఐదు రాష్ట్రాల్లో కరువు ఎదుర్కొనేందుకు కావాల్సిన నిధులు : రూ.13,776 కోట్లు 
»  ఐదు రాష్ట్రాలపై దుర్భిక్షం వల్ల పడే ఆర్థిక భారం రూ.33,000 కోట్లు
»  ఖరీఫ్, రబీ సీజన్లలో కలిపి కరువు ప్రభావ సాగు విస్తీర్ణం : 1.35 కోట్ల హెక్టార్లు 
» ఖరీఫ్, రబీలో ఉత్పత్తుల నష్టం :  3.86 కోట్ల టన్నులు
» వ్యవసాయ ఉత్పత్తుల నష్టం విలువ : రూ.లక్ష కోట్లు    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement