
8 క్యూబిట్ క్వాంటం కంప్యూటర్ ఏర్పాటు చేయనున్న సంస్థ
సీఎం చంద్రబాబుతో ఆ సంస్థ వ్యవస్థాపకులు నాగేంద్ర నాగరాజన్ భేటీ
రేపటి నుంచి ఈ నెల 31 వరకు ముఖ్యమంత్రి సింగపూర్ పర్యటన
సాక్షి, అమరావతి : నేషనల్ క్వాంటం మిషన్‌లో భాగంగా అమరావతిలో ఏర్పాటుచేస్తున్న క్వాంటం వ్యాలీలో క్యూపైఏఐ సంస్థ కూడా భాగస్వామ్యం కానుంది. అధునాతన 8 క్యూబిట్ క్వాంటం కంప్యూటర్ ఏర్పాటుకు ఈ సంస్థ ముందుకొచ్చింది. దీనిపై సీఎం చంద్రబాబు ఆ సంస్థ వ్యవస్థాపకులు నాగేంద్ర నాగరాజన్‌తో గురువారం చర్చించారు. దీంతోపాటు.. అమరావతిలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కేంద్రాన్ని కూడా ఏర్పాటుచేయాలని సీఎం కోరారు.
తద్వారా విద్యార్థులు, పరిశోధకులు, స్టార్టప్‌లు క్వాంటం అల్గారిథంలు, అప్లికేషన్లను రూపొందించుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో వివిధ పంటల సాగులో కచ్చితత్వం, తెగుళ్లకు సంబంధించిన అంశాలను అంచనా వేసేందుకు క్వాంటం కంప్యూటింగ్ ఉపకరించాలని ఆకాంక్షించారు.
నీటి వనరుల సమర్థ నిర్వహణకు..
అలాగే, రాష్ట్రంలో నీటి వనరులను సమర్థంగా నిర్వహించేలా వ్యాధుల నిర్ధారణ, మెడికల్ లాజిస్టిక్స్ తదితర అంశాల్లోనూ క్వాంటం సిమ్యులేషన్‌ను సమర్థంగా వినియోగించవచ్చని అన్నారు. విద్య, పరిశోధన, ఇన్నోవేషన్ రంగాల్లో డీప్‌టెక్ ద్వారా సమాజానికి విస్తృత ప్రయోజనాలు కల్పించటమే లక్ష్యంగా క్యూపైఏఐ, నేషనల్ క్వాంటం మిషన్, అమరావతి క్వాంటం వ్యాలీ పనిచేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
పీపీపీ విధానంలోనే రోడ్ల నిర్మాణం
పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్య(పీపీపీ) విధానంలోనే రహదారుల అభివృద్ధికి చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మొత్తం 10,200 కి.మీ. మేర 260 రహదారులను పీపీపీ విధానంలోనే అభివృద్ధి చేస్తామన్నారు.
వెలగపూడిలోని సచివాలయంలో గురువారం నిర్వహించిన ఆర్ అండ్ బీ శాఖ సమీక్షా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. రూ.వెయ్యి కోట్లతో 2 వేల కి.మీ. రహదారులు నిర్మించాలని ఆదేశించారు. మొదటి దశలో 1,332 కి.మీ., వర్షాకాలం ముగియగానే మిగిలిన రహదారులు నిర్మించాలన్నారు. రద్దీ అధికంగా ఉండే రహదారులపై ప్రతి 50 కి.మీ.కు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
రేపటి నుంచి చంద్రబాబు సింగపూర్ పర్యటన..
పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం చంద్రబాబు శనివారం నుంచి 31 వరకు సింగపూర్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వివిధ సంస్థల ప్రతినిధులు, యాజమాన్యాలు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు. మొదటి రోజు.. సింగపూర్ సహా సమీప దేశాల్లో నివసిస్తున్న ప్రవాసాంధ్రుల సంఘం నిర్వహించే ‘తెలుగు డయాస్పోరా’ సమావేశంలో పాల్గొంటారు.
నవంబరులో విశాఖలో నిర్వహించే పెట్టుబడుల సదస్సుకు సింగపూర్ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించేందుకు ఆ దేశానికి చెందిన ప్రముఖులతో భేటీ అవుతారు. డిజిటల్ ఎకానమీ, ఫిన్‌టెక్‌పై నిర్వహించే బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశాల్లో కూడా చంద్రబాబు పాల్గొంటారు. సింగపూర్‌లో బిజినెస్ రోడ్ షోకూ హాజరవుతారు. అక్కడి మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్ కేంద్రాలను కూడా సీఎం సందర్శిస్తారు.