ఏపీఎస్‌ఆర్టీసీకే ఆదరణ!

Public transport system in AP is gaining popularity than other states - Sakshi

పొరుగు రాష్ట్రాల కంటే ఆక్యుపెన్సీ ఎక్కువ

ఏపీఎస్‌ఆర్టీసీలో 62కు చేరిన ఆక్యుపెన్సీ శాతం

ఆయా రాష్ట్రాలతో పోలిస్తే టికెట్ల బుకింగ్‌ అధికమే

రాష్ట్ర పరిధిలో డిమాండ్‌ ఉన్న అంతర్గత రూట్లపై సర్వే

వందశాతం సర్వీసులు తిప్పేందుకు సిద్ధం

సాక్షి, అమరావతి: పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోని ప్రజా రవాణా వ్యవస్థకే ఆదరణ దక్కుతోంది. ఆయా రాష్ట్రాల ఆర్టీసీలతో పోలిస్తే ఏపీఎస్‌ఆర్టీసీ ఆక్యుపెన్సీనే ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ఏపీలో 50% మాత్రమే బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. ఆక్యుపెన్సీ 62% వరకు ఉంటోంది. ఏపీఎస్‌ఆర్టీసీ ద్వారా రోజు వారీగా 22 లక్షల మంది ప్రయాణికులు వారి గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌లోనూ ఇతర ఆర్టీసీల కంటే ఏపీఎస్‌ఆర్టీసీ మెరుగ్గా ఉంది. దూర ప్రాంత సర్వీసుల్లో ఏపీఎస్‌ఆర్టీసీలో రోజుకు దాదాపు 70 వేల టికెట్లు బుకింగ్‌ జరుగుతోందని లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. కోవిడ్‌–19 నేపథ్యంలో మే 21 నుంచి ఏపీఎస్‌ఆర్టీసీ సర్వీసుల్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 50% సర్వీసులు తిప్పుతున్న ఏపీఎస్‌ఆర్టీసీ వంద శాతం సర్వీసులు తిప్పేందుకు సిద్ధంగా ఉంది.

► ఏపీఎస్‌ఆర్టీసీ ఆక్యుపెన్సీ శాతం పెంచుకునేందుకు ప్రైవేట్‌ ట్రావెల్స్‌తో పోటీ పడనుంది. ఇందులో భాగంగా రాష్ట్ర పరిధిలోని అంతర్గత రూట్లపై ఇటీవలే ఆర్టీసీ అధికారులు సర్వే చేశారు.
► డిమాండ్‌ ఉన్న విశాఖ–హైదరాబాద్‌ రూట్‌లో ప్రైవేట్‌ బస్సులు పగటి పూట తిప్పుతున్నాయి. అదే ఆర్టీసీ రాత్రి వేళల్లో మాత్రమే తిప్పుతోంది. ఆర్టీసీ కూడా పగటి పూట బస్సుల్ని నడిపేందుకు యోచిస్తోంది.

ఏపీఎస్‌ ఆర్టీసీలోనే కోవిడ్‌ వ్యాప్తి తక్కువ
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో కోవిడ్‌ వ్యాప్తి అతి తక్కువగా నమోదైనట్టు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన అసోసియేషన్‌ ఆఫ్‌ స్టేట్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండర్‌ టేకింగ్స్‌ పేర్కొంది. కరోనా సమయంలో ఇతర రాష్ట్రాల కంటే ఏపీలోనే ప్రజా రవాణా వ్యవస్థ మెరుగ్గా ఉందని తేల్చింది. 

వంద శాతం బస్సుల్ని నడిపేందుకు సిద్ధం
రాష్ట్రంలో ప్రయాణికుల సౌలభ్యం కోసం కోవిడ్‌ నిబంధనలను అనుసరించి వంద శాతం బస్సుల్ని నడిపేందుకు సిద్ధంగా ఉన్నాం. మిగిలిన ఆర్టీసీల కంటే ఏపీఎస్‌ఆర్టీసీకే ఆదరణ ఎక్కువగా ఉంది. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల మెరుగైన సామర్థ్యంతో పనిచేసే అవకాశం దక్కింది. 
– కె.బ్రహ్మానందరెడ్డి, ఈడీ (ఆపరేషన్స్‌), ఏపీఎస్‌ఆర్టీసీ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top