Guntur: బ్యాంకులకు సమ్మె సెగ.. దాదాపు రూ.120 కోట్ల లావాదేవీలకు విఘాతం!

Public Sector Bank Employees Nationwide Strike For 2 Days Against Privatisation - Sakshi

 మూతపడిన 450 శాఖలు 

 రెండ్రోజులపాటు సిబ్బంది సమ్మెబాట 

 సమ్మెలో మూడు వేల మంది ఉద్యోగులు 

 నిలిచిన రూ.120 కోట్ల లావాదేవీలు 

 నగదు కొరత లేకుండా చర్యలు

కొరిటెపాడు (గుంటూరు):  జాతీయ బ్యాంకులను ప్రైవేటీకరణ, విలీనానికి వ్యతిరేకంగా యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్‌ పిలుపు మేరకు రెండు రోజులపాటు బ్యాంకు ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగారు. యూనియన్‌ పిలుపు మేరకు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా జిల్లాలో అన్ని జాతీయ బ్యాంకు ఉద్యోగులు మొదటి రోజు గురువారం చేపట్టిన  సమ్మె విజయవంతమైంది. జిల్లా వ్యాప్తంగా 12 జాతీయ బ్యాంకుల పరిధిలో 450 శాఖలు ఉన్నాయి. వీటిలో సుమారు 3 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రైవేటు బ్యాంకులు యథావిధిగా పనిచేశాయి. జిల్లాలోని 450 ప్రభుత్వరంగ బ్యాంకులు మూతపడ్డాయి. బ్యాంకులు మూతపడటంతో దాదాపు రూ.120 కోట్ల మేర లావాదేవీలు నిలిచిపోయాయి. శుక్రవారం కూడా ప్రభుత్వ బ్యాంకులు మూతపడనున్నాయి. సమ్మెలో భాగంగా గురువారం జీటీ రోడ్‌లోని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా జోనల్‌ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. 

ఈ సందర్భంగా ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి పి.కిషోర్‌కుమార్‌ మాట్లాడుతూ కేంద్రం తలపెట్టిన బ్యాంకుల ప్రైవేటీకరణను ప్రతి పౌరుడు, ప్రతి ఖాతాదారుడు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. బ్యాంకుల్లో ఉన్న రూ.10 లక్షల కోట్ల డిపాజిట్లను కొల్లగొట్టేందుకు కుట్ర జరుగుతోందని విమర్శించారు. 

గతంలో అనేక ప్రైవేటు బ్యాంకులు ప్రజల నుంచి డిపాజిట్‌ రూపంలో పెద్ద మొత్తంలో సొమ్ము వసూళ్లు చేసి పారిశ్రామిక సామ్రాజ్యం అవసరాలకు వాడుకొని దివాళా తీయించిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రభుత్వరంగ బ్యాంకుల కారణంగానే దేశ ఆర్ధిక వ్యవస్థ నిలదొక్కుకుందన్నారు. ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణను కేంద్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తోందని హెచ్చరించారు. అన్ని కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో సంపూర్ణ మద్దతు ప్రకటించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో వివిధ సంఘాలు, యూనియన్ల నేతలు వి.రాధాకృష్ణమూర్తి, సురేష్, హనుమంతరెడ్డి, లక్ష్మీనారాయణ, హరిబాబు, బాషా, మురళీ నాగేంద్ర, రవి, షరీఫ్, వేణు, రామారావు, క్రాంతి, పావని, జిల్లా వ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

చదవండి: కేవలం వారాల వ్యవధిలోనే శర వేగంగా ఒమిక్రాన్‌ వ్యాప్తి: సీడీసీ హెచ్చరిక

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top