
పోలీసులకు హైకోర్టు ఆదేశం
తదుపరి విచారణ వచ్చే గురువారానికి వాయిదా
సాక్షి, అమరావతి/నూజివీడు: వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి వైద్య సాయం అందకుండా ఇబ్బందులు పెడుతున్న పోలీసులకు, జైలు అధికారులకు హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. వంశీకి ప్రభుత్వ ఆసుపత్రిలో కాకుండా విజయవాడ ఆయుష్ ఆసుపత్రిలో వైద్య సాయం అందించాలని స్పష్టం చేసింది. వంశీ ఆరోగ్య పరిస్థితిపై వచ్చే గురువారం నాటికి పూర్తిస్థాయి నివేదిక తమకు ఇవ్వాలని ఆయుష్ ఆసుపత్రి డైరెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది. ఆసుపత్రిలో వంశీతో పాటు ఆయన భార్య లేదా కుటుంబ సభ్యులెవరైనా కూడా ఉండొచ్చంది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. బాపులపాడు మండల పరిధిలో నకిలీ ఇళ్ల పట్టాల మంజూరు వ్యవహారంలో హనుమాన్ జంక్షన్ పోలీసులు నమోదు చేసిన కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ హైకోర్టును ఆశ్రయించారు. తన తీవ్ర అనారోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మధ్యంతర బెయిల్‌పై విడుదల చేయాలంటూ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై గురువారం జస్టిస్ లక్ష్మణరావు విచారణ జరిపారు.
మైనింగ్ కేసులో వల్లభనేని వంశీకి ఊరట
మైనింగ్ వ్యవహారంలో గన్నవరం పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులో వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి హైకోర్టు ఊరటనిచ్చింది. ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రూ.20 వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని వంశీని ఆదేశించింది. అలాగే చార్జిషీట్ దాఖలు చేసేవరకు ప్రతి రెండో శనివారం దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
గన్నవరం నియోజకవర్గ పరిధిలోని బాపులపాడు, గన్నవరం, విజయవాడ గ్రామీణ మండలాల పరిధిలో వల్లభనేని వంశీ, ఆయన అనుచరులు అక్రమంగా మైనింగ్ జరిపి ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారంటూ కృష్ణా జిల్లా గనుల శాఖ అధికారి ఈ నెల 15న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై గన్నవరం పోలీసులు వంశీతోపాటు మరికొందరిపై అదే రోజు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.
ఈ వ్యాజ్యంపై హైకోర్టు గురువారం మరోసారి విచారణ జరిపింది. వంశీ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. అర్ధరాత్రి ఫిర్యాదు అందితే, ఆ వెంటనే పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. ఇది పోలీసుల దురుద్దేశాన్ని ప్రస్ఫుటం చేస్తోందని తెలిపారు. మైనింగ్ జరిగిన ఐదేళ్ల తరువాత విజిలెన్స్ నివేదిక ఆధారంగా వంశీపై కేసు నమోదు చేశారన్నారు. కేసుల మీద కేసులు పెడుతూ జైలు నుంచి బయటకు రాకుండా పోలీసులు కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
పోలీసుల తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ.. అరెస్ట్ గురించి పిటిషనర్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటికే ఆయనకు హైకోర్టు రక్షణ కల్పించిందన్నారు. కింది కోర్టు జారీ చేసిన పీటీ వారెంట్‌ను అమలు చేయబోమని అడ్వొకేట్ జనరల్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
వంశీ పోలీస్ కస్టడీ పిటిషన్ డిస్మిస్
వల్లభనేని వంశీని 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి పోలీసులు రెండోసారి వేసిన పిటిషన్‌ను ఏలూరు జిల్లా నూజివీడులోని రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు గురువారం కొట్టివేసింది. వంశీ రిమాండ్ గడువు ముగియడంతో వర్చువల్‌గా వంశీని జడ్జి ముందు హాజరుపరచగా, రిమాండ్‌ను జూన్ 12 వరకు పొడిగించారు.