Presidential Elections 2022: సజావుగా రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్‌ 

President election Polling begin In AP Assembly with CM Jagan vote - Sakshi

సీఎం జగన్‌ ఓటుతో అసెంబ్లీలో పోలింగ్‌ ప్రారంభం 

ఓటు హక్కు వినియోగించుకున్న 173 మంది రాష్ట్ర ఎమ్మెల్యేలు.. ఓటు వేయని టీడీపీ ఎమ్మెల్యేలు బుచ్చయ్య చౌదరి, నందమూరి బాలకృష్ణ 

టీడీపీ ఎమ్మెల్యేలతో కలసి ఓటేసిన చంద్రబాబు 

కట్టుదిట్టమైన భద్రతతో బ్యాలెట్‌ బాక్సు నేడు ఢిల్లీకి తరలింపు 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌ సజావుగా ముగిసింది. 175 ఎమ్మెల్యేలకు గాను 173 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో 172 మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కందుకూరుకు చెందిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి తీసుకున్న ప్రత్యేక అనుమతితో హైదరాబాద్‌లో ఓటు వేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బాలకృష్ణ విదేశాల్లో ఉండటంతో ఓటు వేయలేకపోయారని తెలుగుదేశం పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

సోమవారం ఉదయం 10 గంటలకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలి ఓటు వేయడం ద్వారా ఎన్నికల ప్రక్రియ మొదలైంది. అనంతరం శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, మేరుగ నాగార్జున, ఆర్కే రోజా, ఉష శ్రీ చరణ్, తానేటి వనిత, ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.  

వైఎస్సార్‌సీపీ బాటలో టీడీపీ  
మధ్యాహ్నం 12 గంటల తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు. భారత రాష్ట్రపతిగా తొలిసారి పోటీ చేస్తున్న ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ముకు వైఎస్సార్‌సీపీ మద్దతు ప్రకటించిన తర్వాత ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కూడా అధికారపార్టీ బాటలో నడిచిన విషయం తెలిసిందే. మధ్యాహ్నం మూడు గంటలకే 172 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయడం పూర్తయినప్పటికీ సాంకేతికంగా ఇద్దరు సభ్యులు ఓటింగ్‌కు రాకపోవడంతో 5 గంటల వరకు సిబ్బంది ఎదురు చూశారు. అనంతరం బ్యాలెట్‌ బాక్స్‌కు సీల్‌ వేసి అసెంబ్లీలోని స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రపరిచారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య విమానంలో బ్యాలెట్‌ బాక్స్‌ను మంగళవారం ఢిల్లీకి తరలించనున్నారు. గురువారం ఓట్లను లెక్కించనున్నారు. ఎన్నికైన అభ్యర్థి ఈనెల 25న నూతన రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేస్తారు.  

పటిష్ట బందోబస్తు ఏర్పాటు 
రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓటు హక్కున్న ఎమ్మెల్యేలు, పాస్‌లున్న వ్యక్తులను తప్ప ఎవరినీ లోపలకి అనుమతించలేదు. మొత్తం ఎన్నికల ప్రక్రియను వీడియో తీశారు. ఎన్నికల పరిశీలకులు చంద్రేకర్‌ భారతి, ఎన్నికల ప్రత్యేక అధికారి సంతోష్‌ అజ్మీరా, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి కె.రాజ్‌ కుమార్, సహాయ రిటర్నింగ్‌ అధికారి వనితారాణి నిరంతర పర్యవేక్షణలో రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top