Techie Prashant: కన్నీటి పర్యంతం.. అమ్మ మాట విననందుకే ఈ కష్టాలు

Prashanth was reached his home in Visakhapatnam - Sakshi

విశాఖ స్వగృహానికి చేరిన ప్రశాంత్‌ 

ఉద్వేగంతో కన్నీళ్లపర్యంతమైన తల్లిదండ్రులు  

ఎంతో మంది భారతీయులు పాక్‌ జైల్లో మగ్గుతున్నారు  

వారందరి వివరాలు కేంద్రానికి ఇచ్చానన్న ప్రశాంత్‌  

సాక్షి, విశాఖపట్నం/మధురవాడ: నాలుగేళ్ల కిందట వెళ్లిపోయిన తమ కుమారుడు మరికొద్దిసేపట్లో ఇంటికి రాబోతున్నాడు.. తమ బిడ్డను చూసేందుకు ఆ తల్లిదండ్రులు ఎంతో ఉద్వేగంతో ఎదురు చూస్తున్నారు. అంతలోనే రానే వచ్చాడు. ఇన్నాళ్లకు కుమారుడిని చూసిన ఆ తల్లిదండ్రులు పట్టరాని సంతోషంతో ఎదురెళ్లి గుండెలకు హత్తుకున్నారు. ఒక్కసారిగా కన్నీళ్లపర్యంతమయ్యారు. నాలుగేళ్ల కిందట ప్రియురాలి కోసమని వెళుతూ పాకిస్థాన్‌ చెరలోకి వెళ్లిన ప్రశాంత్‌ సోమవారం విడుదలైన విషయం తెలిసిందే. బుధవారం మధ్యాహ్నం విశాఖ మిథిలాపురి వుడా కాలనీలోని తన గృహానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా తండ్రి బాబూరావు, సోదరుడు శ్రీకాంత్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. అమ్మ మాట విననందుకే తాను ఇన్ని కష్టాలు పడ్డానని చెప్పారు. జైల్లో మంచి పుస్తకాలు చదివానని, తనలో మార్పు వచ్చిందని, కొత్త జీవితాన్ని ప్రారంభిస్తానన్నారు. ప్రశాంత్‌ చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే..  

శిక్షా కాలం పూర్తయినా ఇంకా జైల్లోనే..  
సరిహద్దు దాటి పాకిస్తాన్‌లోకి ప్రవేశించి ఎడారిలో 40 కి.మీ నడిచాను. అటుగా వచ్చిన హైవే పెట్రోలియం వాహనంలోంచి వచ్చిన సిబ్బంది నా వివరాలు అడిగారు. అప్పటికే అలిసిపోయి ఉన్న నేను సరిగా సమాధానం చెప్పలేకపోయాను. వాళ్లు నన్ను పట్టుకెళ్లి భద్రత సిబ్బందికి అప్పగించారు. న్యాయస్థానంలో ప్రవేశపెట్టి ఆ తర్వాత నన్ను జైలుకు తరలించారు. నేను జైల్లో ఉన్నంత కాలం నాతో ఒక్కపనీ చేయించలేదు. అంతేకాదు, జైల్లో ఉన్న ఏ భారతీయ ఖైదీతో కూడా పనిచేయించడం లేదు. వారితో మాట్లాడితే తెలిసింది.. వారి శిక్షలు పూర్తయినా ఇంకా ఎంబసీ నుంచి క్లియరెన్స్‌ రాని కారణంగా అక్కడే మగ్గుతున్నారని.

వాళ్లను చూశాక ఇక నేను ఇంటికి రావడంపై ఆశలు వదిలేసుకున్నాను. అమ్మానాన్నను చూస్తానని అస్సలు అనుకోలేదు. కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాల చొరవతోనే నేను ఇంత త్వరగా రాగలిగాను. శిక్ష పూర్తి చేసుకున్న, త్వరలోనే శిక్ష పూర్తి కానున్న ఖైదీల వివరాలు కూడా సేకరించి కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చాను. వారిని కూడా త్వరలోనే విడుదల చేయాలని కోరుతున్నా. అప్పుడు నేను మూర్ఖంగా వ్యవహరించాను. ఇలా వెళుతున్నానని అమ్మతో చెప్పాను. అమ్మ వద్దంది. అయినా ఆమె మాట వినలేదు. అందుకే ఇన్ని కష్టాలుపడ్డా’ అని ప్రశాంత్‌ చెప్పారు. తమవాడు క్షేమంగా తిరిగి వచ్చేందుకు సహకరించిన కేంద్రానికి, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రశాంత్‌ తల్లిదండ్రులు, సోదరుడు కృతజ్ఞతలు చెప్పారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top