గుండెలపై కుంపటిలా కోవిడ్‌ సమస్యలు.. వారికే ఎక్కువ ప్రమాదం? | Post Covid Affects Heart Problems Doctor Advice Need To Take Precautions | Sakshi
Sakshi News home page

Post Covid Complications: గుండెలపై కుంపటిలా కోవిడ్‌ సమస్యలు.. వారికే ఎక్కువ ప్రమాదం?

Feb 23 2022 8:58 AM | Updated on Feb 23 2022 7:05 PM

Post Covid Affects Heart Problems Doctor Advice Need To Take Precautions - Sakshi

సాక్షి, శ్రీకాకుళం: ‘నాకు తెలిసి 30–40 ఏళ్ల వయసు గల ఎనిమిది మంది ఇటీవల గుండె సమస్యతో చనిపోయారు. పోస్టు కోవిడ్‌లో భాగంగా 40 శాతం మందిలో గుండె సమస్యలను గుర్తించాం. అంతకు ముందు 50 ఏళ్లు పైబడిన వారి కి మాత్రమే ఈ సమస్యలు కనిపించేవి. ఇప్పుడు యువకుల్లోనూ కనిపిస్తున్నాయి.’ జెమ్స్‌ ఆస్పత్రిలో కన్సల్టెంట్‌ కార్డియాలజిస్ట్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ ఎల్‌ కే విజయ్‌కుమార్‌ చెప్పిన మాటలివి. పోస్టు కోవిడ్‌ సమస్య ఎంత పెద్దదో ఆయన మాటలే చెబుతున్నాయి.  

కోవిడ్‌ నుంచి కోలుకున్నాక గుండె సంబంధిత పరీక్షలు చేయించుకోవడం అత్యవసరమని ఆయన సూచిస్తున్నారు. కోవిడ్‌ వచ్చాక సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, పోస్టు కోవిడ్‌లో భాగంగా ఆరోగ్య తనిఖీలు చేయించుకోకపోవడం, సరైన పోషకాహారం, తగు వ్యాయామం, విశ్రాంతి తీసుకోకపోవడం, దినచర్యలో ఒత్తిడికి గురవ్వడంతో హృద్రోగ సమస్యలు ఎదురవుతున్నట్టుగా వైద్యులు స్పష్టం చేస్తున్నారు. కోవిడ్‌ వచ్చిన వారు తప్పనిసరిగా ఆస్పత్రులకు వెళ్లి పరీక్షలు చేసుకుంటే, మరణాల వరకు పరిస్థితులు వెళ్లవని కార్డియాలజిస్టులు ముక్తకంఠంతో చెబుతున్నారు.      

గతంలో అలా.. ఇప్పుడు ఇలా.. 
గతంలో ఆస్పత్రులకు వచ్చే 70ఏళ్ల పైబడిన వారిలో 30 శాతం వరకు గుండె సమస్యలు వచ్చేవి. 60 ఏళ్లు దాటిన వారిలో 20 శాతం మంది బాధితులు ఉండేవారు. 50 ఏళ్లు దాటిన వారిలో ఈ సంఖ్య ఇదివరకు పది శాతమే. కానీ ఇప్పుడు 30 నుంచి 40ఏళ్ల వారికే గుండె సమస్యలొస్తున్నాయి. అకస్మాత్తుగా మరణాలు సంభవిస్తున్నాయి. జెమ్స్‌ ఆస్పత్రి ఇటీవల నిర్వహించిన 68 హెల్త్‌ క్యాంపుల ద్వారా గుర్తించిన 452 మందికి యాంజియో, 72 మందికి బైపాస్‌ సర్జరీలు చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.  

ఆ రెండింటిపైనే.. 
కోవిడ్‌ వచ్చిన వారికి ప్రధానంగా రెండింటిపై ప్రభావం చూపుతోంది. ఒకటి ఊపిరితిత్తులపైనైతే, రెండోది గుండె పైన. కోవిడ్‌ వచ్చిన వారిలో 90శాతం మేరకు ఎంతోకొంత ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తాయి. దగ్గు, ఆయాసం తగ్గాక ఊపిరితిత్తుల సమస్య నుంచి బయటపడ్డామని తెలుస్తోంది. కానీ గుండె విషయంలో ఎప్పుడేం జరుగుతుందో అంచనా వేయలేకపోతున్నామని వైద్యులు తమ స్వీయ అనుభవాలు చెబుతున్నారు.  
►కోవిడ్‌ సోకిన వారిలో 40 శాతం వరకు ఎంతో కొంత గుండె సమస్యలు తలెత్తుతున్నాయి.  
►కొందరిలో హార్ట్‌ పంపింగ్‌ తగ్గిపోవడం, గుండె రిథమ్‌ ఎక్కువ, తక్కువ ఉండటం, హార్ట్‌ ఎటాక్, పెరాలసిస్‌ స్ట్రోక్, అకస్మిక మరణాలు సంభవిస్తున్నాయి.  
►కోవిడ్‌ వైరస్‌ ఆనవాళ్లు శరీరంలో మార్పులు తీసుకొస్తున్నాయి. సరైన ఆహారం, వ్యాయామం, సరిపడా విశ్రాంతి, మానసిక ప్రశాంతతో పాటు సమయానుకూల జాగ్రత్తలు తీసుకోకపోవడమే కారణమని వైద్య వర్గాలు చెబుతున్నాయి.సాధారణంగా 30 ఏళ్ల లోపు వారికి బీపీ, షుగర్‌ సమస్యలు ఉండవు. కానీ కోవిడ్‌ వచ్చాక ఇదే వయస్సులో గల చాలామంది వాటి బారిన పడుతున్నారు.  
►జన్యు పరమైన సమస్యలకు కోవిడ్‌ తోడు కావడంతో ఒక్కసారిగా ఆరోగ్య పరిస్థితులు మారిపోతున్నాయని వైద్యులు అంచనా వేస్తున్నారు. కోవిడ్‌ వచ్చిన వారు తప్పనిసరిగా ఆస్పత్రులకు వెళ్లి తనిఖీలు చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement