Sakshi News home page

మళ్లీ మోకాలడ్డు.. రాజధానిలో పేదల ఇళ్ల నిర్మాణంపై చంద్రబాబు అండ్‌ కో అక్కసు

Published Fri, Aug 4 2023 4:36 AM

Poor People are angry about TDP conspiracy politics - Sakshi

సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాజధానిలో పేదలు ఉండటానికి వీల్లేదంటున్న చంద్రబాబు సహా తెలుగుదేశం పార్టీ పెద్దలు వారి పంతం నెగ్గించుకున్నారు. రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఆర్‌–5 పేరుతో ఓ జోన్‌ను సృష్టించి, ఆ స్థలాల్లో నిర్మాణాలు చేపట్టేందుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలకు రాజధాని రైతుల ముసుగులో అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోన్న చంద్రబాబు అండ్‌ కో తాజాగా మరో అడుగు ముందుకు వేసింది. సీఎం జగన్‌.. 50 వేల మందికి పైగా పేద అక్క­చెల్లెమ్మలకు అక్కడ ఇళ్ల స్థలాలు పంపిణీ చేసి, వేగంగా ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో మరోమారు కోర్టు ద్వారా మోకాలడ్డారు.

నాడు అధి­కారంలో ఉన్నప్పుడు రాజధానిలో పేదల ఇళ్ల కోసం మొత్తం భూమిలో 5 శాతం కేటాయించాలని చట్టం తీసుకొచ్చి, దాన్ని తమ స్వప్రయోజనాల కోసం అమలు చేయకుండా తుంగలో తొక్కిన టీడీపీ పెద్దలు.. ఇప్పుడూ పేదలకు తీరని ద్రోహమే చేశా­రు. రాజధానిలో పేదలు వచ్చి చేరితే అదో పెద్ద ము­రికి వాడగా మారుతుందని, వారి వల్ల తమ స్థలా­లకు రేట్లు పడిపోతాయంటూ పేదలను కించప­రు­స్తూ తమ న్యాయవాదుల ద్వారా దారుణంగా వాద­నలు వినిపించిన టీడీపీ పెద్దలు.. కోర్టుల్లో తమకున్న బలాన్ని మరోసారి రుజువు చేశారు.

రాజధానిలో పేదలకు ఇచ్చిన స్థలాల్లో ప్రభుత్వం చేపట్టబోతున్న ఇళ్ల నిర్మాణాన్ని అడ్డుకోవాలంటూ రైతుల ముసు­గులో వారు దాఖలు చేయించిన అనుబంధ పిటిషన్ల­ను హైకోర్టు  అనుమతించింది. పేదలకు ఇచ్చిన స్థలా­ల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టకుండా స్టే విధించింది. పేదల ఇళ్ల నిర్మాణానికి విస్తృత ప్రజా ప్రయోజనాలు పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయని తెలి­పింది.

అందువల్ల ఇళ్ల నిర్మాణానికి అనుమతి­నివ్వ­డం ఎంత మాత్రం సమర్థనీయం కాదని స్పష్టం చే­సిం­ది. ఆర్‌–5 జోన్‌లో పేదల ఇళ్ల నిర్మాణం పూర్త­యితే పూడ్చలేని నష్టం జరుగుతుందని తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయా­జులు, జస్టిస్‌ చీకటి మానవేంద్రనాథ్‌ రా­య్, జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరీలతో కూడిన త్రిసభ్య ధర్మా­సనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 

అప్పుడు ఫలించని కుట్ర
సీఆర్‌డీఏలో పేదల ఇళ్లు నిర్మించకుండా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన సృష్టించిన సంఘాలు ఆది నుంచి అడ్డుపడుతూ వస్తున్న విషయం తెలిసిందే. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద 2020లోనే ప్రభుత్వం రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేదలకు 30 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేసింది. గత చంద్రబాబు ప్రభుత్వ తప్పులను సరిదిద్ది పేదలకు రాజధానిలో 5 శాతం భూమిని కేటాయించడమే కాక, ఆ భూమిలో ఇళ్ల స్థలాలు ఇచ్చి, అందులో ఇళ్లు నిర్మించేందుకు వీలుగా ఆర్‌ 5 జోన్‌ను సృష్టిస్తూ సీఆర్‌డీఏ చట్టానికి రాష్ట్ర ప్రభుత్వం సవరణ చేసింది.

ఆ చట్టాన్ని, ఆ జోన్‌లో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు అవసరమైన భూమిని గుంటూరు, కృష్ణా జిల్లాల కలెక్టర్లకు బదలాయించేందుకు అనుమతినిస్తూ జారీ చేసిన జీవోను సవాలు చేయిస్తూ టీడీపీ పలువురి చేత హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయించింది. చంద్రబాబు, ఆయన సృష్టించిన సంఘాలు హైకోర్టులో 18 కేసులు, సుప్రీంకోర్టులో 5 కేసులు వేశారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా అడ్డుకునేందుకు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు శక్తివంచన లేకుండా ప్రయత్నించారు.

సీఎం జగన్‌ మూడేళ్లపాటు వారితో న్యాయ పోరాటం చేశారు. దీంతో అటు హైకోర్టు, ఇటు సుప్రీంకోర్టు కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని నియంత్రించేందుకు నిరాకరించాయి. ఇళ్ల పట్టాలు జారీ చేసుకోవచ్చంటూ ప్రభుత్వానికి అనుమతినిచ్చాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసింది.

అలా పంపిణీ చేసిన స్థలాల్లో ఇళ్లు నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అనంతరం ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన సాయాన్ని అడ్డుకోవడానికి చంద్రబాబు అండ్‌ కో విశ్వప్రయత్నాలు చేస్తోంది. కేంద్ర మంత్రులు, అధికారులను కలిసి రకరకాల ఫిర్యాదులు చేశారు. అయినప్పటికీ వారి పాచికలు పారలేదు.  

మళ్లీ మరో కుట్ర 
దీనిపై ఓర్వలేని తెలుగుదేశం పార్టీ పెద్దలు మరో కుట్రకు తెరలేపారు. పేదల కోసం చేపట్టనున్న ఇళ్ల నిర్మాణాన్ని అడ్డుకునేందుకు హైకోర్టులో మళ్లీ పిటిషన్లు దాఖలు చేయించారు. ఇళ్లు కట్టకుండా ప్రభుత్వాన్ని నియంత్రించాలన్నారు. ఈ వ్యాజ్యాలపై ఇటీవల న్యాయమూర్తులు జస్టిస్‌ సోమయాజులు, జస్టిస్‌ మానవేంద్రనాథ్‌ రాయ్, జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఇరుపక్షాల సుదీర్ఘ వాదనలు విని తీర్పును రిజర్వ్‌ చేసింది. గురువారం తీర్పు వెలువరించింది. పిటిషనర్లు తమ వాదనల సందర్భంగా లేవనెత్తిన అంశాలన్నింటితో ఏకీభవించిన త్రిసభ్య ధర్మాసనం.. ప్రభుత్వం, సీఆర్‌డీఏ వాదనల్లో ఒక్క దాన్ని కూడా పరిగణనలోకి తీసుకోకపోవడం విశేషం. 

ఇతర ప్రాంతాల వారికి ఇవ్వచ్చో లేదో చూడాలి 
రాజధాని నిర్మాణంలో ఇళ్లు కోల్పోయే వారికి ఇళ్లు నిర్మించి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఇతర ప్రాంతాల వారికి రాజధానిలో ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు చట్ట నిబంధనలు అనుమతిస్తాయా? లేదా? అన్నది లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. ఇళ్ల పట్టాల మంజూరు హైకోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటుందని సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో, భవిష్యత్తులో తాము పట్టాల మంజూరుకు వ్యతిరేకంగా తీర్పునిస్తే, ఇప్పుడు చేపట్టే ఇళ్ల నిర్మాణం కోసం ఖర్చు చేసిన డబ్బు మొత్తం వృథా అవుతుందని ధర్మాసనం తెలిపింది.

ఈ డబ్బంతా ప్రజా ధనమని గుర్తు చేసింది. పన్నుదారుల డబ్బు ఇలా వృథా అవుతుంటే మౌనంగా చూస్తూ ఉండలేమంది. సీఆర్‌డీఏ నుంచి తీసుకున్న భూములకు ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి డబ్బు చెల్లించలేదని, డబ్బు చెల్లించనప్పుడు ఆ భూములు ప్రభుత్వ పరం కావని తెలిపింది.

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు ప్రభుత్వం
హైకోర్టు తీర్పుపై నిరుపేదల పక్షాన సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నవరత్నాలు­–పేదలందరికీ ఇళ్లు పథకం కింద సీఆర్‌డీఏ పరిధిలో గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లాలకు చెందిన నిరుపేదలకు పక్కా ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో 1,402 ఎకరాల్లో 50,793 మంది మహిళలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసింది. రూ.1,829.57 కోట్ల వ్యయంతో అన్ని మౌలిక వసతులతో ఇళ్ల నిర్మాణాలకు గత నెల 24వ తేదీన సీఎం వైఎస్‌ జగన్‌ శంకుస్థాపన చేశారు.

ఆ తర్వాత ఇళ్ల నిర్మాణాలు కూడా ప్రారంభమయ్యాయి. ఆరు నెలల్లో తమ దశాబ్దాల సొంతింటి కల నెరవేరబోతోందని పేదింటి అక్కాచెల్లెమ్మ­లు ఆశగా ఎదురు చూస్తున్న తరుణంలో కోర్టు తీర్పుతో ఇళ్ల నిర్మాణాలు ఆగిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్ర­యించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తమ న్యాయవాదులకు దిశా నిర్దేశం చేసింది.

వాళ్లు పెట్టరు.. పెట్టే వారిని పెట్టనివ్వరు
ఎన్నో ఏళ్ల నుంచి రైల్వే స్థలాల్లో భయం భయంగా బతుకుతున్నాం. సీఎం జగన్‌ పుణ్యమా అంటూ ఇళ్ల స్థలం ఇచ్చారు. ఇప్పుడేమో ఇళ్లు నిర్మించవద్దంటూ కోర్టు తీర్పు ఇచ్చిందని అంటున్నారు. టీడీపీ వాళ్లు కూడా ప్రజల్ని పరిపాలించడానికి, మంచి చేయడానికే ఉన్నామని చెబుతున్నారు. అలాంటప్పుడు ఇలా పేదల ఇళ్లపై కోర్టుకు వెళ్లడం ఏమిటో అర్థం కావడం లేదు. వాళ్లు పెట్టరు.. పెట్టే వాళ్లను పెట్టనివ్వరు. గతంలో పెన్షన్‌ రావాలంటే ఆఫీస్‌ల చుట్టూ తిరగాల్సివచ్చేది. జగన్‌ వచ్చాక ఇంటికి వచ్చి పెన్షన్‌ ఇస్తున్నారు. ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినా తుదకు న్యాయం గెలుస్తుంది.
– చిలక పార్వతమ్మ, సలాం హోటల్‌ సెంటర్‌

ఇది టీడీపీ నాయకుల కుట్ర
అమరావతిలో చట్ట ప్రకా­రం కేటాయించాల్సిన పే­దల ఇళ్ల స్థలాలను సైతం టీడీపీ స్వార్థ ప్రయోజ­నాల కోసం కోర్టును ఆశ్ర­యించి అడ్డుకోవడం దుర్మార్గం. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పేద ప్రజల పట్ల విశ్వాసం ఉంది కాబట్టే రాజధాని ప్రాంతంలో 50 వేల మందికి పైగా ఇళ్లు కేటాయించారు. టీడీపీ రైతుల ముసుగులో కోర్టుకు వెళ్లి పేదలను మోసగిస్తోంది. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జగన్‌మోహన్‌రెడ్డే ముందంజలో ఉన్నారు. ఆయన సాధించి తీరుతారు.     
– రెడ్డి నిర్మల, బాబూ జగ్జీవన్‌రామ్‌ కాలనీ

వారి విజయం తాత్కాలికమే
రాజధాని ప్రాంతంలో పేదలు ఉండకూడదనే ఉద్దేశంతోనే వాళ్లు వివిధ కారణాలను చూపిస్తూ కోర్టుకు వెళ్లారు. వారు అనుకున్నదే చేశారు. అమరావతిలో డబ్బున్న వాళ్లే ఉండాలని వాళ్ల ఉద్దేశం. వారు ఎన్ని చేసినా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తప్పకుండా తుది విజయం సాధిస్తారు. ఆ నమ్మకం మాకు ఉంది. కేటాయించిన స్థలాల్లోనే ఇళ్లు నిర్మించి ఇస్తారని గట్టిగా నమ్ముతున్నాం. వాళ్ల విజయం తాత్కాలికమే. న్యాయస్థానాల్లో తుది విజయం పేద ప్రజలదే.
– షేక్‌ మీరాబి, నులకపేట

రాజధాని అంటే వాళ్లే ఉండాలా?
రాజధాని అమరావతిలో చంద్రబాబు, ఆయన సామాజికవర్గం వాళ్లు మాత్రమే వుండాలా? మాలాంటి పేదలకు రాజధానిలో ఇళ్ల స్థలాలు కేటాయించి, ఇళ్లు నిర్మించి ఇస్తుంటే చంద్రబాబు, ఆయన సామాజిక వర్గం వాళ్లు అడ్డుకోవడం దుర్మార్గం. పేదలంతా ఏకమై పోరాటం చేస్తే చంద్రబాబు ఆయన సామాజిక వర్గం రాజధాని అమ­రావతిలో ఉండగలరా? ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పేదలంతా అండగా ని­లు­స్తాం. తుదకు మావైపే న్యాయం నిలుస్తుంది.
– కొండపనేని సీత, ఇప్పటం, తాడేపల్లి మండలం

రైతుల ముసుగులో తెలుగుదేశం పార్టీ నాటకం 
రైతుల ముగుసులో టీడీపీ నాటకం ఆడుతోంది. ఈ మధ్యకాలంలో చదువుకున్న పిల్లలు చెబితే తప్ప టీడీపీ నిజ స్వరూపం మాకు తెలియలేదు. రైతుల ముసుగులో కోర్టుకు వెళ్లిన వారు రాజధాని ప్రాంతంలో పేద వాళ్లకు ఎలా నివాస స్థలాలు ఇస్తారంటూ ఫిర్యాదు రాశారని చెప్పారు. ఇలా చేయడం దుర్మార్గం. పేదల కడుపు కొట్టడం ధర్మం కాదు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనే మా అందరికీ న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉంది.
– దాడి శాంతకుమారి, నులకపేట

మా వల్లే మీరు సుఖంగా ఉంటున్నారు
డబ్బున్న వాళ్ల ఇళ్లలో పని చేయాలంటే మాలాంటి వారు ఎక్కడెక్కడో గుడిసెల్లో ఉంటూ వచ్చి పోవాలి. కాబట్టి మాలాంటోళ్లం రాజధానిలో ఉండకూడదనేది వారి పంతం. పేదలకు ఇళ్లు కట్టించకూడదని టీడీపీ వాళ్లు కోర్టును ఆశ్రయించడం చాలా బాధగా ఉంది. మాలాంటి వారు ఉంటేనే మీలాంటి వారు ఇళ్లల్లో సుఖంగా ఉంటారు. ఇప్పటికైనా అది ఆలోచించి కోర్టులో వేసిన కేసును వెనక్కు తీసుకుంటే బాగుంటుంది.
– కొప్పుల పద్మ, పోలకంపాడు 

Advertisement
Advertisement