AP: రైతు సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరిస్తాం 

Poonam Malakondaiah Says Solve All Farmers problems In AP - Sakshi

విత్తు నుంచి మార్కెటింగ్‌ వరకు అండగా ప్రభుత్వం

ఉన్నత స్థాయి సమావేశంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం  

సాక్షి, అమరావతి: క్షేత్రస్థాయిలో రైతులెవరూ ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య అన్నారు. విత్తు నుంచి మార్కెటింగ్‌ వరకు ఎలాంటి సమస్యలు ఎదురైనా చిత్తశుద్ధితో పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రబీ కొనుగోళ్లు, ఖరీఫ్‌ సాగులో రైతులెదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దృష్టికి ఏపీ అగ్రికల్చర్‌ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి ఇటీవల తీసుకెళ్లారు. దీంతో సీఎం ఆదేశాల మేరకు సమస్యల పరిష్కారానికి వ్యవసాయ సలహా మండళ్లు, ఏపీ స్టేట్‌ అగ్రికల్చర్‌ మిషన్‌ సభ్యులతో తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో పూనం మాలకొండయ్య ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా పలువురు సభ్యులు మాట్లాడుతూ.. ఈ క్రాప్‌ బుకింగ్‌ను మరింత సమర్ధవంతంగా అమలు చేయాలని, వ్యవసాయ యాంత్రీకరణను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. మిరప నారుమడులను పెంచే విషయంలో విధివిధానాలను రూపొందించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అందువల్ల ఆ విధానంలో మార్పులు తీసుకురావాలని చెప్పారు. జిల్లా, మండల, ఆర్‌బీకే స్థాయిలో వ్యవసాయ సలహా మండళ్ల పనితీరును మెరుగుపరిచేలా కార్యాచరణ రూపొందించాలని, బోర్డుల్లో చేసిన తీర్మానాలను అమలు చేసే దిశగా వ్యవసాయ శాఖ చర్యలు తీసుకోవాలన్నారు.

అర్హులైన వాస్తవ సాగుదారులందరికీ సీసీఆర్‌సీ కార్డులు(సాగుదారుల హక్కు పత్రాలు) అందేలా చూడాలని కోరారు. ఆర్‌బీకేలతో వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక యూనివర్సిటీలను పూర్తి స్థాయిలో అనుసంధానించాలన్నారు. ఆ తర్వాత పూనం మాలకొండయ్య స్పందిస్తూ.. ఇక్కడ ప్రస్తావించిన ప్రతీ సమస్యను సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లి, ఆయనతో చర్చించి సాధ్యమైనంత త్వరగా పరిష్కారమార్గాలను ఆచరణలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కార్యదర్శి సాల్మన్‌ ఆరోఖ్యరాజ్, అదనపు కార్యదర్శి ధనుంజయరెడ్డి, మార్కెటింగ్‌ శాఖ ప్రత్యేక కార్యదర్శి మధుసూదనరెడ్డి, వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖల కమిషనర్లు అరుణ్‌ కుమార్, పీఏస్‌ ప్రద్యుమ్న, సివిల్‌ సప్లయిస్‌ ఎక్స్‌ అఫిషియో కార్యదర్శి కోన శశిధర్, ఏపీ అగ్రికల్చర్‌ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి, ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కరరెడ్డి, వ్యవసాయ సలహా మండళ్ల అధ్యక్షులు సీహెచ్‌ సుబ్బారావు, త్రినాథ్‌రెడ్డి, భరత్‌కుమార్‌రెడ్డి, రామారావు, చంద్రశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top