అంతర్జాతీయ, ప్రైవేట్‌ వర్సిటీల కోసం పాలసీ | Policy for international and private universities | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ, ప్రైవేట్‌ వర్సిటీల కోసం పాలసీ

Oct 8 2026 4:33 AM | Updated on Oct 8 2026 4:33 AM

Policy for international and private universities

విదేశీ ఉన్నత విద్యా సంస్థలు, ప్రైవేట్‌ వర్సిటీల ప్రోత్సాహక విధానం–2026కు ఆమోదం 

పాలసీ అమలుకు ప్రత్యేక యంత్రాంగం 

ప్రైవేటు స్కూళ్ల ఏర్పాటుకు సర్వే నిబంధన తొలగింపు 

మంత్రివర్గ సమావేశం నిర్ణయాలను వెల్లడించిన మంత్రి పార్ధసారథి

సాక్షి, అమరావతి: రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయి ఉన్నత విద్యా సంస్ధలు, ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాలను తెచ్చేందుకు ఏపీ విదేశీ ఉన్నత విద్యా సంస్థలు, ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల ప్రోత్సాహక విధానం–2026కు బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. 

ఈ విధానం ద్వారా విదేశీ ఉన్నత విద్యా సంస్థలు, భారతీయ ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాలు రాష్ట్రంలో క్యాంపస్‌ల ఏర్పాటుకు అర్హత ప్రమాణాలు, ప్రోత్సాహకాలు వంటి అంశాలను పొందుపరిచారు. ప్రభుత్వం ఎంపిక చేసిన అకడమిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సర్వీస్‌ ప్రొవైడర్ల ద్వారా కూడా క్యాంపస్‌లు ఏర్పాటు చేసుకునే వీలు కల్పించారు. ఈ విధానం అమలు, పర్యవేక్షణ కోసం ప్రత్యేక యంత్రాంగం ఉంటుంది. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి కొలుసు పార్ధసారథి మీడియాకు వివరించారు. ఆ వివరాలు..  

» రాష్ట్ర విద్యా వ్యవస్థ నిబంధనల్లో మార్పుల కోసం ఆంధ్రప్రదేశ్‌ విద్యా చట్టం–1982లోని పలు సెక్షన్లను సవరించేందుకు ఆర్డినెన్స్‌ జారీకి ఆమోదం. ప్రైవేట్‌ పాఠశాల ఏర్పాటు లేదా రిజిస్ట్రేషన్‌కు అనుమతి ఇచ్చే ముందు ఆ ప్రాంతంలో ముందుగా సర్వే చేసి, నోటిఫికేషన్‌ ఇచ్చి, అక్కడ బడి అవసరం ఉందని నిరూపించాలనే నిబంధనలను ఈ సవరణ ద్వారా తొలగిస్తారు.  
»  ఇళ్ల స్థలాల సమస్యను 45  రోజుల్లో పరిష్కరించేందుకు మంత్రుల కమిటీ ఏర్పాటు. ఈ కమిటీలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి,  రెవెన్యూ శాఖ మంత్రి,  మరో మంత్రి సభ్యులుగా ఉంటారు. ఇప్పటికే లేఅవుట్లలో ఖాళీగా ఉన్న స్థలాలు, లబ్దిదారులు వదిలేసిన రిజిస్టర్డు స్థలాల రిజి్రస్టేషన్‌ రద్దు చేసి అర్హులైన వారికి కేటాయించే అంశాలపై ఈ కమిటీ సమగ్రంగా పరిశీలించి నివేదికను ప్రభుత్వానికి అందిస్తుంది. 
»  విధుల్లో ఉండగానే మరణించిన అర్హత కలిగిన ఆశా కార్యకర్తలకు ఎండ్‌ ఆఫ్‌ సర్వీస్‌ ప్రయోజనంగా గ్రాట్యుటీ ఇస్తారు. సేవలో ఉన్న పూర్తి చేసిన ప్రతి సంవత్సరానికి రూ.5,000 చొప్పున, గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు గ్రాట్యుటీ చెల్లించేందుకు ఆమోదం.  
»   2026–27 విద్యా సంవత్సరంలో తల్లికి వందనం అమలు కోసం జారీ చేసిన జీవోకు ఆమోదం. 
»   సంక్షేమ వసతి గృహాలు, గురు కులాలు, ఇతర ప్రభుత్వ సంస్థల్లో వసతి పొందుతున్న విద్యార్థులకు అందించే నెలవారీ డైట్‌ ఛార్జీలను పెంచే జీవోకు ఆమోదం. 
»   గిరిజన విద్యార్థులు జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు నాణ్యమైన శిక్షణ అందించడానికి విశాఖపట్నంలోని మారికవలస ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటు జీవోకు ఆమోదం.  

కేబినెట్‌ సమావేశానికి నలుగురు డుమ్మా 
రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి నలుగురు మంత్రులు డుమ్మా కొట్టారు. టీజీ భరత్, బీసీ జనార్ధన్‌రెడ్డి, సత్యకుమార్, కందుల దుర్గేష్‌ బుధవారం జరిగిన సమావేశానికి హాజరుకాలేదు. కార్యక్రమాలు ఉన్నాయని ముగ్గురు, విదేశాల్లో ఉండడంతో ఒకరు గైర్హాజరయ్యారు. చంద్రబాబు కేబినెట్‌ సమావేశాలను సైతం సమీక్షా సమావేశాల తరహాలో నిర్వహిస్తుండడంతో మంత్రులు వాటిని సీరియస్‌గా తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే ప్రతి సమావేశానికి ఇద్దరు, ముగ్గురు మంత్రులు గైర్హాజరుకావడం పరిపాటిగా మారింది. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ గతంలో వరుసగా మూడు కేబినెట్‌ సమావేశాలకు హాజరు కాలేదు. రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన నిర్ణయాలపై నిర్ణయం తీసుకోవాల్సిన మంత్రులు అసలు వాటి గురించే పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement