బాలికపై అఘాయిత్యం | Police did not register a case despite complaint | Sakshi
Sakshi News home page

బాలికపై అఘాయిత్యం

Jun 13 2025 4:14 AM | Updated on Jun 13 2025 4:14 AM

Police did not register a case despite complaint

గర్భవతిని చేసి మోఖం చాటేసిన యువకుడు

ఆరు నెలల గర్భిణికి అబార్షన్‌ 

నిందితుడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అనుచరుడని ఆరోపణ 

ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయని పోలీసులు

రాజమహేంద్రవరం సిటీ: ప్రేమ పేరుతో వంచించి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. బాలికను గర్భిణిని చేసిన యువకుడు చివరకు మోసం చేసిన ఘటన రాజమహేంద్రవరంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత బాలికతో కలసి రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం నగర అధ్యక్షురాలు పోలు విజయలక్ష్మి, జిల్లా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి గురువారం మీడియాతో మాట్లాడారు. వారి కథనం ప్రకారం.. రాజమహేంద్రవరం రూరల్‌ హుకుంపేట గ్రామానికి చెందిన బాలికను మోరంపూడి ప్రాంతానికి చెందిన యువకుడు పులపర్తి సత్యదేవ్‌ ప్రేమించానంటూ రెండేళ్లుగా వెంటపడ్డాడు. 

పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆ బాలికను లోబరచుకున్నాడు. గత ఏడాది నవంబర్‌లో వైద్య పరీక్షలు నిర్వహించగా.. ఆ బాలిక 6వ నెల గర్భిణిగా నిర్ధారణ అయ్యింది. దీంతో బాలిక తల్లిదండ్రులు సత్యదేవ్‌ వద్దకు వెళ్లి తమ కుమార్తెను వివాహం చేసుకోవాలని అడిగారు. తాను స్వామి మాలలో ఉన్నానని, మాల తీసేలోగా బాలికకు అబార్షన్‌ చేయించాలని చెప్పాడు. ఈ నేపథ్యంలో ధవళేశ్వరంలోని సీఈఎం ఆసుపత్రిలో గత ఏడాది డిసెంబర్‌ 17న ఆ బాలికకు అబార్షన్‌ చేయించారు. ఆ తరువాత బాలికను వివాహం చేసుకోవడానికి సత్యదేవ్‌ నిరాకరిస్తున్నాడు. కులం తక్కువ దానివంటూ దూషిస్తున్నాడు. 

ఈ నేపథ్యంలో బాలిక, తల్లిదండ్రులు బొమ్మూరు సీఐకి ఫిర్యాదు చేయగా ఇప్పటివరకూ కేసు నమోదు చేయలేదు. నిందితుడు సత్యదేవ్‌ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అనుచరుడు కావడంతో పోలీసులు కేసు నమోదు చేయకుండా జాప్యం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ మహిళా నేతలు ఆరోపించారు. ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు చేసి, నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. 

బాలికను పెళ్లి చేసుకోమంటే పెద్దల సమక్షంలో సెటిల్మెంట్‌ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, బాధితురాలికి చట్ట ప్రకారం న్యాయం జరగాలని కోరారు. బాలికకు అబార్షన్‌ చేసిన వైద్యులపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ గాండ్ల, తెలుకుల సంఘం అధ్యక్షురాలు సంకిస భవానీప్రియ, మాజీ కార్పొరేటర్‌ మజ్జి నూకరత్నం, కాటం ప్రియాంక, కృష్ణవేణి పాల్గొన్నారు.

బాలికపై లైంగిక దాడి
గర్భం దాల్చడంతో తల్లి ఫిర్యాదు
నాగలాపురం: తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలంలో 15 ఏళ్ల బాలికపై రెండునెలల క్రితం లైంగిక దాడికి పాల్పడ్డ ఓ వ్యక్తిపై గురువారం పోక్సో కేసు నమోదు చేసినట్లు నిండ్ర సీఐ రవీంద్ర తెలిపారు. సీఐ తెలిపిన వివరాలు ప్రకారం.. పిచ్చాటూరు మండలం, కారూరు దళితవాడకు చెందిన శేఖర్‌ (55) అనే వ్యక్తి రెండు నెలల క్రితం 15 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించాడు. 

అనంతరం.. బాలిక గర్భం దాల్చడంతో జరిగిన విషయాన్ని తల్లికి చెప్పింది. దీంతో బాలిక తల్లిదండ్రులు బుధవారం పోలీసులకు ఫిర్యాదుచేశారు. పిచ్చాటూరు పోలీసులు బుధవారం నిందితుడిని అదుపులోకి తీసుకుని గురువారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదుచేసి రిమాండుకు తరలించినట్లు పిచ్చాటూరు ఎస్‌ఐ వెంకటేశ్వర్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement