PM Modi Sri Satyasai Tour: నేడు సత్యసాయి జిల్లాకు ప్రధాని మోదీ | PM Modi Inaugurate NACIN Centre In AP Satya Sai District Highlights | Sakshi
Sakshi News home page

నేడు సత్యసాయి జిల్లాకు ప్రధాని మోదీ.. జాతీయ అకాడమీ(నాసిన్‌) ప్రారంభం

Jan 16 2024 6:58 AM | Updated on Jan 16 2024 12:28 PM

PM Modi Inaugurate NACIN Centre In AP Satya Sai District Highlights - Sakshi

ఆసియా ఖండంలోనే ప్రత్యేక గుర్తింపుతో.. రూ.541 కోట్ల అంచనాలతో జాతీయ అకాడమీని పాలసముద్రం సమీపంలో.. 

శ్రీసత్యసాయి, సాక్షి: దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు  శ్రీసత్యసాయి జిల్లాకు రానున్నారు. పెనుకొండ నియోజకవర్గంలో పాలసముద్రంలో ఏర్పాటు చేసిన జాతీయ కస్టమ్స్‌, పరోక్ష పన్నులు, మాదక ద్రవ్యాల అకాడమీ (నాసిన్‌)ను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరుకానున్నారు.

ఆసియా ఖండంలోనే ప్రత్యేక గుర్తింపుతో.. రూ.541 కోట్ల అంచనాలతో ఈ నాసిన్‌ ఏర్పాటు కాబోతోంది. జిల్లాలోని గోరంట్ల మండల పరిధిలోని పాలసముద్రం సమీపంలో 44వ జాతీయ రహదారికి ఆనుకుని 503 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ శిక్షణ కేంద్రాన్ని అత్యంత భద్రత నడుమ కొనసాగే విధంగా నిర్మాణం పూర్తి చేశారు. ఐఏఎస్‌లకు ముస్సోరి, ఐపీఎస్‌లకు హైదరాబాద్‌ తరహాలో ఇండియన్‌ రెవెన్యూ సర్వీసెస్‌ (ఐఆర్‌ఎస్‌)కు ఎంపికైనవారికి ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.

అన్నీ లోపలే..
శిక్షణ పొందేవారికి అన్ని అవసరాలు లోపలే తీర్చేవిధంగా నిర్మాణాలు జరిగాయి. అంతేకాదు ఆవరణలోనే సోలార్‌ సిస్టం కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. శిక్షణలో భాగంగా అవసరమైన విమానాన్ని తీసుకొచ్చారు. నాసిన్‌ కోసం ప్రత్యేక రైల్వేలైన్‌ నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నాసిన్‌ సిబ్బంది పిల్లల విద్య కోసం సమీపంలోనే కేంద్రీయ విద్యాలయం మంజూరు చేశారు. ఇందుకోసం కావాల్సిన స్థలాన్ని రెవెన్యూశాఖ గుర్తించింది. మరోవైపు ఈఎస్‌ఐ ఆసుపత్రి ఏర్పాటుకు స్థలాన్ని ఎంపిక చేశారు.

గవర్నర్‌, సీఎం హాజరు
భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా మంగళవారం ఈ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులతోపాటు రక్షణ బలగాలు అక్కడికి చేరుకుని ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొననున్నారు. విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 1.30 గంటలకు పుట్టపర్తికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో 2.30 గంటలకు నాసిన్‌ కేంద్రానికి వెళ్తారు. ముఖ్యమంత్రి 5.30 గంటలకు తాడేపల్లికి తిరుగు  పయనం అవుతారు.మరోవైపు రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌నజీర్‌ బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో నాసిన్‌ కేంద్రానికి చేరుకుంటారు.

పీఎం పర్యటన ఇలా.. 
ప్రధానమంత్రి మోదీ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు పుట్టపర్తి సత్యసాయి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో పాలసముద్రం సమీపంలోని నాసిన్‌ కేంద్రానికి చేరుతారు.  ప్రధాని సాయంత్రం 5.15 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో పుట్టపర్తి చేరుకుని, అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. ఈ పర్యటనలోనే.. లేపాక్షి దుర్గా, పాపనాశేశ్వర, వీరభద్రస్వామి ఆలయాన్ని ప్రధాని మోదీ సందర్శించే అవకాశం ఉంది. ఇక ప్రధాని, గవర్నర్‌, ముఖ్యమంత్రి పర్యటన పురస్కరించుకుని పుట్టపర్తి విమానాశ్రయంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు పోలీసు యంత్రాంగం చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement