
విజయవాడలో రిలే నిరాహార దీక్ష చేస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(పీహెచ్‌సీ) వైద్యులు
విజయవాడ ధర్నా చౌక్‌లో ప్రారంభం
సమస్యలు పరిష్కరించే వరకూ దీక్షలు కొనసాగింపు
లబ్బీపేట (విజయవాడ తూర్పు): తమ దీర్ఘకాల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ) వైద్యులు నిరవధిక సమ్మెకు దిగారు. గత ఏడాది ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేటివరకూ అమలుచేయకపోగా, వాటికి విరుద్ధంగా చర్యలు తీసుకోవడాన్ని నిరసిస్తూ విధులు బహిష్కరించిన వైద్యులు.. తాజాగా విజయవాడ ధర్నా చౌక్‌లో రిలే దీక్షలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం ప్రారంభించిన ఈ రిలే దీక్షలు తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకూ కొనసాగుతాయని అసోసియేషన్ నేతలు ప్రకటించారు.
ప్రధాన డిమాండ్లు ఇవే..
⇒ అన్ని విభాగాల్లో 20 శాతం ఇన్‌సర్వీస్ పీజీ సీట్లు కొనసాగించాలి. టైమ్»ౌండ్ ఉద్యోగోన్నతులు ప్రకటించాలి. డీసీఎస్, సీఎస్ ఉద్యోగోన్నతులకు కాలపరిమితి నిర్ణయించాలి. ఆ మేరకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలి.
⇒ గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న వైద్యులకు వెంటనే ట్రైబల్ అలవెన్స్ మంజూరుచేయాలి.
⇒ సంచార వైద్యసేవలకు తక్షణమే సదుపాయాలు కలి్పంచాలి. వాయిదా పడిన వేతన పెంపును తక్షణమే అమలుచేయాలి.
రోగులను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంలేదు..
రోగులను ఇబ్బంది పెట్టాలనేది తమ ఉద్దేశంకాదని, తమ సమస్యలను పరిష్కరించాలన్న డిమాండ్‌తోనే సమ్మెకు వెళ్లినట్లు తెలిపారు. తాము సమ్మెకు వెళ్తామని అధికారులకు ముందుగానే నోటీసులు ఇచ్చామని చెప్పారు. ప్రభుత్వం స్పష్టమైన లిఖితపూర్వక హామీ ఇచ్చేవరకూ తమ నిరసన కొనసాగుతుందని స్పష్టంచేశారు.
ఆమోదయోగ్యమైన డిమాండ్లు సీఎం దృష్టికి
సాక్షి, అమరావతి: పీహెచ్‌సీ వైద్యుల డిమాండ్లలో ఆమోదయోగ్యమైన వాటిని సీఎం దృష్టికి తీసుకెళ్లి తగిన నిర్ణయం తీసుకుంటామని వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ తెలిపారు. వెంటేనే వైద్యులు విధుల్లో చేరాలని కోరారు. శనివారం సత్యకుమార్ మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. వారి డిమాండ్లను పరిశీలిస్తామన్నారు. ఇన్ సర్వీస్ కోటా, ఉద్యోగ సర్వీస్ డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తెలిపారు.