
సోమవారం నుంచి విధుల బహిష్కరణ
వచ్చే నెల 2న చలో విజయవాడ
3 నుంచి ఆమరణ దీక్షలు
సాక్షి, అమరావతి: మెడికల్ పీజీ కోర్సుల్లో ప్రభుత్వ వైద్యులకు ఇన్‌సర్వీస్ కోటా కుదింపును వ్యతిరేకిస్తూ, వివిధ సమస్యల పరిష్కరించాలనే డిమాండ్‌తో పీహెచ్‌సీ వైద్యులు సమ్మెబాట పట్టారు. సోమవారం నుంచి విధులు బహిష్కరించి సమ్మెను ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి పీహెచ్‌సీ వైద్యుల సంఘం అల్టిమేటం ఇచ్చింది. ఇందులో భాగంగా శుక్రవారం ఆన్‌లైన్ రిపోరి్టంగ్, అధికారిక కార్యక్రమాలను బహిష్కరించారు. శనివారం ఫ్యామిలీ డాక్టర్, స్వస్త్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్ మెడికల్ క్యాంప్‌లకు హాజరుకాకుండా కేవలం పీహెచ్‌సీల్లో సేవలకు పరిమితం కావడం ద్వారా తమ నిరసన తెలిపారు.
ఆదివారం అన్ని అధికారిక వాట్సాప్ గ్రూప్‌ల నుంచి వైదొలగనున్నారు. ఉద్యోగంలో చేరే సమయంలో ఉన్నత విద్య అభ్యసించడానికి తగినంత కోటా ఇస్తామని హామీ ఇచ్చి.. ఇప్పుడు అవకాశానికి గండికొట్టి అన్యాయం చేస్తున్నారని వైద్యుల సంఘం ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. సీహెచ్‌సీల్లో పనిచేసే వైద్యులకు మూడేళ్లకే పదోన్నతి ఇచ్చిన ప్రభుత్వం, 20 ఏళ్లుగా సేవలందిస్తున్న పీహెచ్‌సీ వైద్యులకు మాత్రం పదోన్నతి కల్పించడం లేదన్నారు. పదోన్నతుల విషయంలోనూ తమకు వెన్నుపోటు పొడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నగరాలు, పట్టణాలకు దూరంగా మారుమూల ప్రాంతాల్లో క్లిష్టపరిస్థితుల్లో సేవలందిస్తున్న తమకు అలవెన్స్‌లు తగినంతగా ఇవ్వడం లేదన్నారు. నోషనల్ ఇంక్రిమెంట్‌పై మొండిచేయి చూపించారని వెల్లడించారు. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలో భాగంగా గ్రామాలకు వెళుతున్న తమకు రూ.5 వేల ట్రావెల్ అలవెన్స్ ఇవ్వడం లేదన్నారు. ఈ సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే సమ్మెను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ప్రభుత్వం స్పందించకపోతే సోమవారం ఓపీ విధులను బహిష్కరించి, కేవలం ఎమర్జెన్సీ సేవలు మాత్రమే అందిస్తామన్నారు. మంగళవారం జిల్లా స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. అక్టోబర్ 1న జిల్లాల్లో ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. 2న చలో విజయవాడకు పిలునిచ్చారు. 3వ తేదీ నుంచి విజయవాడలో ఆమరణ దీక్షకు దిగుతామని ప్రకటించారు.