మచిలీపట్నం: పోలీస్ జులుంతో నీచానికి ఒడిగడుతున్నారని మాజీ మంత్రి పేర్నినాని చెప్పారు. ఎవరికీ ఊపిరి తీసుకునే అవకాశం కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఏప్రిల్, మే నెలలో ఎందుకు ఎన్నికలు పెట్టలేదని ఆయన నిలదీశారు. శనివారం మచిలీపట్నంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
‘‘అరాచకాలు, దుర్మార్గాలతో అన్ని ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు. తప్పుడు మార్గాల్లో గెలిచి బలంగా ఉన్నామని చూపించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పైపై మేకప్‌లు ఎన్నాళ్లు ఉంటాయి? 2029లో ప్రజలు కచ్చితంగా చంద్రబాబు గాలి తీసేయడం ఖాయం. తప్పుడు మార్గాల్లో గెలిచి బలంగా ఉన్నామని చూపించుకునే ప్రయత్నాలు. చంద్రబాబు బుర్ర నిండా కుట్రలే. హైకోర్టు చంద్రబాబు ప్రభుత్వానికి గడ్డి పెట్టింది. గంట ముందే ఏజెంట్ నియామక పత్రాన్ని అందజేస్తే చాలని కోర్టు చెప్పింది.
పోలింగ్ కేంద్రాలను ఆక్రమించుకునేందుకు పోలీసులను మోహరిస్తున్నారా? శ్రీకాకుళం నుంచి బాపట్ల వరకు వ్యవసాయం సర్వనాశనం అయ్యింది. కూటమి ప్రభుత్వం ఒక చెత్త ప్రభుత్వం. తుపాన్ వస్తుందని వారం ముందే హెచ్చరికలు వచ్చినా పట్టించుకోలేదు. ఇప్పటివరకు విద్యుత్‌ను పునరుద్ధరించలేదు. తప్పుడు పోకడలతో చంద్రబాబు ఎన్నికలకు వెళ్తున్నారు. చంద్రబాబు ఓటుకు రూ.2 వేలు పంపించారని టీడీపీ నేతలే చెబుతున్నారు.
చిచ్చుపెట్టి చంద్రబాబు ఏం సాధిస్తారు?
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబంలో చిచ్చుపెట్టి చంద్రబాబు ఏం సాధిస్తారు? అని పేర్ని నాని అన్నారు. ‘‘యలహంక ఆస్తి వైఎస్ జగన్ అత్తగారు డాక్టర్ సుగుణమ్మది. 20 ఏళ్ల క్రితం జగన్ కంపెనీ ఆ స‍్థలాన్ని లీజుకు తీసుకుంది. కొనుగోలు వివరాలన్నీ డాక్యుమెంట్‌లో స్పష్టంగా ఉన్నాయి. ఈ నిర్మాణాల బిల్లులు, చార్జీలు కడుతున్నది జగన్ కంపెనీయే. లీజుకు తీసుకున్న స్థలంలో రెండు గెస్ట్ హౌస్‌లు కట్టారు. అధికారం కోసం ఎన్టీఆర్ ఇంట్లో చంద్రబాబు చిచ్చు పెట్టారు. వైఎస్ జగన్ కుటుంబంలో చిచ్చుపెట్టి చంద్రబాబు ఏం సాధిస్తారు? చంద్రబాబు తన తమ్ముడికి 10 పైసల వాటా అయినా ఇచ్చారా? చంద్రబాబు తన అక్కాచెల్లెళ్లకు ఏమైనా ఆస్తి ఇచ్చారా?’’ అని అన్నారు.
యలహంక ఆస్తిపై విషప్రచారం
స్థానిక ఎన్నికల్లో ప్రజలకు చెప్పుకోవడానికి చంద్రబాబు వద్ద ఏమీ లేదని పేర్ని నాని అన్నారు. ‘‘ప్రజల మద్దతూ ఆయనకు లేదు. ఒకవైపు ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే కుట్రలు. మరోవైపు వైఎస్ జగన్ విషప్రచారాల కోసం కుట్ర. నామినేషన్లు వేయనీయకుండా ప్రతిపక్షాన్ని అడ్డుకున్నారు.
పోలింగ్ కేంద్రాల్లో ప్రతిపక్ష ఏజెంట్లు కూడా లేకుండా కుట్ర చేస్తున్నారు. పోలీసులు నుంచి ఏజెంట్లు క్లియరెన్స్ తీసుకోవడం ఎప్పుడైనా విన్నామా? ఈ కుట్రల నుంచి డైవర్షన్ కోసమే యలహంక ఆస్తిపాస్తులపై విషప్రచారం. చంద్రబాబుకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు షర్మిల తెరపైకి వస్తున్నారు. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలు లక్ష్యంగా షర్మిల నడుచుకుంటున్నారు. చంద్రబాబు కుట్రలో భాగంగానే వైఎస్ జగన్‌పై తప్పుడు ప్రచారం. రేపు మున్సిపల్ ఎన్నికలున్నాయనగా, బెంగళూరు ఆస్తి తనదే అంటూ ట్వీట్ దీంట్లో భాగమే. భారతి తల్లిదండ్రులు గంగిరెడ్డి, సుగుణమ్మ ఇద్దరూ డాక్టర్లే. కడప, అనంతపురం జిల్లాలో మంచి పేరున్న డాక్టర్లు.
ఆ రోజుల్లోనే వారికి మంచి ప్రాక్టీస్ ఉంది. తమ పిల్లలను అప్పట్లోనే బెంగళూరులో చదివించుకున్నారు. ఆ నేపథ్యంలోనే వాళ్లు బెంగళూరులో ప్రాపర్టీ కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన డాక‍్యుమెంట్లో చాలా స్పష్టంగా ఉంది. జగన్ కంపెనీ 20 ఏళ్ల కిందటే యలహంక స్థలాన్ని లీజుకు తీసుకుంది. లీజుకున్న తీసుకున్న స్థలంలో రెండు గెస్ట్‌హౌస్‌లు కట్టారు. షర్మిల బెంగళూరు వచ్చేటప్పుడు ఒక దాంట్లో ఉండమన్నారు.
షర్మికు వైఎస్ జగన్ రాశారని చెప్తున్న MOUలో కూడా యలహంక ప్రాపర్టీ ప్రస్తావన లేదు కదా? తాజ్‌మహల్ చూసి నాదే అంటే ఇచ్చేస్తారా? భద్రతా కారణాలరీత్యా యలహంకలో పెళ్లి వేడుక వద్దని ముందే చెప్పారు. తన కుమార్తెల విషయంలో కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంటానని చెప్పారు. అలా చెప్పిన తర్వాత కూడా అక్కడే పెళ్లి అంటూ షర్మిల పెళ్లికార్డులు కొట్టించడం వెనుక అర్థం ఏమిటి? కుమార్తె పెళ్లి వేదికగా వివాదాలు నడపడం సరైనదేనా?
ఆ తర్వాత కూడా జగన్ లేఖ రాశారు కదా? హైదరాబాద్‌లో లోటస్‌పాండ్ ఇంటిని వాడుకోవాలని చెప్పారు. మరి ఆ అవకాశాన్ని షర్మిల ఎందుకు వినియోగించుకోలేదు? చంద్రబాబుకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఏదోలా రచ్చ చేయడం, షర్మిలకు అలవాటుగా మారింది తద్వారా జగన్‌ను తగ్గించాలని చంద్రబాబు ప్రయత్నం. ముందుగా చంద్రబాబు తన గురించి తాను తెలుసుకోవాలి’’ అని పేర్ని నాని చెప్పారు.


