రైలు ప్రయాణం ‘ఉక్క’రబిక్కిరి | People are dreading travel due to the summer heat | Sakshi
Sakshi News home page

రైలు ప్రయాణం ‘ఉక్క’రబిక్కిరి

May 14 2025 4:50 AM | Updated on May 14 2025 4:50 AM

People are dreading travel due to the summer heat

వేసవి తాపంతో అల్లాడుతున్న ప్రయాణికులు

పగటిపూట ప్రయాణం అంటే మరీ హడల్‌

తగ్గిపోయిన జనరల్‌ బోగీలతో మరింత అవస్థలు 

ఏసీలో ప్రయాణానికి అత్యధికుల మొగ్గు 

నెలన్నర ముందే అయిపోతున్న థర్డ్‌ ఏసీ, ఎకానమీ టికెట్లు

సాక్షి, నెట్‌వర్క్‌ : వేసవి తాపం దృష్ట్యా ప్రయాణం అంటేనే ప్రజలు హడలిపోతున్నారు. రైలు ప్రయాణం అంటే మరీ బెంబేలెత్తిపోతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలపైన నమోదవుతుండడంతో జనరల్‌ బోగీల్లో ఉక్కపోతతో  అల్లా­డు­తు­న్నారు. పేద, అల్పాదాయ వర్గాలు ప్రయాణించే ఈ బోగీలను ఇటీవల కేంద్రం భారీగా తగ్గించడంతో కిక్కి­రిసి ప్రయాణించాల్సి వస్తోంది. ఫలితంగా ప్రయాణి­కులు ఊపిరి ఆడక నరకం అనుభవిస్తు­న్నారు. కిటికీల్లో నుంచి వస్తున్న వడగాడ్పులకు ఉక్కిరిబిక్కిరి అవుతు­న్నారు. 

వృద్ధులు, చిన్నారులు వడదెబ్బకు గురవుతున్నారు. రిజర్వేషన్‌ బోగీల్లోనూ ఇదే దుస్థితి. దీంతో చార్జీ ఎక్కువగా ఉన్నా.. ఏసీ కోచ్‌లు, ఎకానమీ ఏసీ కోచ్‌లలో ప్రయాణానికే అత్యధికులు మొగ్గుచూపుతున్నారు. రద్దీ పెరుగుదలతో ఏసీ కోచ్‌లు నెల, నెలన్నర ముందే నిండిపోతున్నాయి. ఏ రైలు చూసినా వెయిటింగ్‌ లిస్టు చూపి­స్తున్నాయి. రద్దీ పెరిగిన నేపథ్యంలో ఏసీ కోచ్‌ల పెంపు­నకు రైల్వే శాఖ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతు­న్నారు. ఏసీ కోచ్‌లు, ఎకానమీ కోచ్‌లతోపాటు సాధారణ బోగీలు మరింత పెంచితే ఉపశమనంగా ఉంటుందని చెబుతున్నారు. 

ఆధ్యాత్మిక యాత్రలలో ఆపసోపాలు 
పరీక్షలు పూర్తయ్యాయి. వేసవి సెలవులు వచ్చాయి. దీంతో పిల్లలతో చాలామంది ఆధ్యాత్మిక క్షేత్రాల సం­ద­ర్శనకు వెళ్తుంటారు. బస్సు కంటే రైలు ప్రయా­ణానికి ప్రాధాన్యం ఇస్తారు. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి మీదుగా రోజూ 90 నుంచి వంద రైళ్లు నడుస్తుంటాయి. సుమారు రెండు లక్షల మంది ప్రయాణిస్తుంటారని సమాచా­రం. వీరంతా వేసవి తాపానికి అల్లాడుతున్నారు. జనరల్‌తోపాటు ఏసీ బోగీలు పెంచాలని కోరుతున్నారు.

సీట్లు, బెర్త్‌లు దొరకడం లేదు
వేసవి సెలవుల దృష్ట్యా బోగీలన్నీ కిక్కిరిసిపోతున్నాయి. రిజర్వేషన్‌ చేసుకుందామన్నా.. సీట్లు, బెర్త్‌లు దొరకడం లేదు. సాధారణ బోగీల సామర్థ్యం 90 మంది అయితే 200 మంది వరకు కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. స్లీపర్‌ కోచ్‌ సామర్థ్యం 72. డిమాండ్‌ పెరగడంతో ఏసీ కోచ్‌లలోనూ సీట్లు దొరకడం లేదు. 

చాంతాడంత వెయిటింగ్‌ లిస్టు చూపిస్తుంది.  విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్, చెన్నై, బెంగళూరు, విజయవాడ, హౌరా, భువనేశ్వర్‌ వెళ్లే రైళ్లకు ఏసీ కోచ్‌లలో కనీసం నెల రోజుల వరకు సీట్లు లేవు. స్లీపర్‌ కోచ్‌ల సంగతి ఇక చెప్పక్కర్లేదు. ముఖ్యంగా విశాఖ నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే ఫలక్‌నుమా, గరీభ్‌రథ్, గోదావరి తదితర పలు ఎక్స్‌ప్రెస్‌లలో ఏసీ కోచ్‌లలో ఖాళీలు లేవు. 

రెండేళ్ల క్రితం నుంచి థర్డ్‌ ఏసీ ఎకానమీ 
రైళ్లలో గతంలో ఫస్ట్‌ ఏసీ, సెకండ్‌ ఏసీ, థర్డ్‌ ఏసీ.. ఇలా మూడు రకాల ఏసీ కోచ్‌లు మాత్రమే ఉండేవి. పేద, మధ్య తరగతి వర్గాలను దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ రెండేళ్ల క్రితం కొత్తగా థర్డ్‌ ఏసీ ఎకానమీ కోచ్‌లనుప్రవేశపెట్టింది. సాధారణ థర్డ్‌ ఏసీ కోచ్‌లోని ఓ కూపేలో 8 బెర్త్‌లుంటే, ఎకానమీ ఏసీ కోచ్‌లో తొమ్మిదుంటాయి. కూపేల వైశాల్యం కూడా తగ్గించడం వల్ల ఇలాంటి ఓ కోచ్‌లో అదనంగా మరో కూపే ఉంటోంది. 

అంటే ఈ కూపే ద్వారా అదనంగా తొమ్మిది బెర్తులు అందుబాటులో ఉంటాయన్నమాట. సాధారణ థర్డ్‌ ఏసీ కోచ్‌ కంటే ఎకానమీ కోచ్‌ టికెట్‌ ధర తక్కువగా ఉంటుంది. అందుకే అల్పాదాయ వర్గాలు ఈ ఎకానమీ ఏసీ కోచ్‌లలో ప్రయాణానికి ఆసక్తి చూపుతున్నారు.

ఖర్చయినా ఏసీనే బెటర్‌ 
ఉక్కబోత, సౌకర్యాల లేమి, గాలి ఆడని పరిస్థితితో స్లీపర్‌ క్లాస్‌ ప్రయాణం నరకంగా మారింది. మా పిల్లలు ఇద్దరూ విశాఖలో ఉంటారు. వారి దగ్గరకు ప్రతినెలా మా భార్యాభర్తల్లో ఎవరో ఒకరం వెళ్లి వస్తుంటాం. ఈ క్రమంలో స్లీపర్‌ క్లాస్‌లో ప్రయాణించలేక, ఖర్చు ఎక్కువైనా వందేభారత్, థర్డ్‌ ఏసీల్లో వెళ్లాల్సి వస్తుంది.  – బండి వెంకటేశ్వరరావు, రైల్వే ప్రయాణికుడు, ఏలూరు    

కిటికీ తెరిస్తే వడగాలి, మూస్తే ఉక్కపోత 
ఎండలు భయంకరంగా ఉన్నాయి. గద్వాల నుంచి కర్నూలుకు ప్రయాణం చేయాలంటేనే ఇబ్బందిగా ఉంది. కిటికీలు తెరిస్తే వడగాలి, మూస్తే ఉక్కపోత. నరకం చూస్తున్నా.        – రామన్న, గద్వాల  

ఊపిరి ఆడడం లేదు
నా పేరు విజయ్‌. నేను చెన్నైలో రైలెక్కాను. బోగీలన్నీ కిక్కిరిశాయి. కిటికీలో నుంచి వేడిగాలులు వస్తున్నాయి. కూర్చుని ప్రయాణించడమే కష్టంగా ఉంది. ఇక నిలుచుని ప్రయాణించేవారి దుస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఊపిరి ఆడడం లేదు. ఏసీ, జనరల్‌ బోగీల సంఖ్య పెంచాలి.      –విజయ్, కడప 

ఏసీ బోగీలు పెంచాలి
వేసవి తాపం దృష్ట్యా సాధారణ, స్లీపర్‌ బోగీల్లో ప్రయాణించలేని దుస్థితి నెలకొంది. ఊపిరి ఆడడం లేదు. ఏసీ బోగీల్లో సీట్లు దొరకడం లేదు. రైల్వే శాఖ ఎండా కాలం ఏసీ బోగీలు పెంచాలి.   – దల్లి మహేశ్వరరెడ్డి, స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగి, విశాఖపట్నం  

స్లీపర్‌ బోగీలో నరకం
కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దర్శనం కోసం ఏడాదిలో కనీసం రెండు, మూడుసార్లు గుంతకల్లుకు రైలులో వస్తుంటాం. స్లీపర్, జనరల్‌ బోగీల్లో ప్రయాణించాలంటే నరకంగా ఉంది. వేడి సెగలకు తట్టుకోలేకపోతున్నాం.      – లక్ష్మీదేవి, హిందూపురం, శ్రీసత్యసాయి జిల్లా  

చాలా కష్టంగా ఉంది
తమిళనాడులోని కోయంబత్తూరులో తెల్లవారుజామున డిబ్రుఘర్‌–కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్‌ ఎక్కాను. ఎండవేడి బాగా ఉంది. వడగాడ్పులకు ప్రాణం పోయినంత పనవుతోంది. చొక్కా తీసేసి బనీన్‌ మీద కూర్చున్నా.. ఉండలేకపోతున్నా.   – లక్కీజర్, బిహార్‌

Advertisement
 
Advertisement
Advertisement