ఆ పరీక్షలను సవాల్‌గా తీసుకోండి: పెద్దిరెడ్డి

Peddireddy Ramachandra Reddy Comments Over Village And Ward Secretary Exams - Sakshi

సాక్షి, తాడేపల్లి : కరోనా వైరస్‌ నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే పరీక్షలను సవాల్‌గా తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జిల్లా కలెక్టర్లు, జేసీలను ఆదేశించారు. బుధవారం తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పరీక్షలపై జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, పీఆర్ కమిషనర్ గిరిజా శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. సెప్టెంబర్ 20 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల భర్తీకి పరీక్షలు ప్రారంభమవుతాయని తెలిపారు. వారం రోజుల పాటు పరీక్షల నిర్వహణ జరుగుతుందన్నారు. ( ‘ఆ రోజు వాలంటీర్లకు చప్పట్లతో అభినందనలు’)

మొత్తం 10,63,168 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతారని వెల్లడించారు. కోవిడ్ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ఆర్టీసీ ద్వారా రవాణా సదుపాయం ఉండేలా కలెక్టర్లు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, జేసీలు ఈ పరీక్షల నిర్వహణ బాధ్యతలు తీసుకోవాలని, పరీక్షా కేంద్రాల ఎంపికలో ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. రూట్ ఆఫీసర్లు, జోనల్ అధికారుల పర్యవేక్షణలో పరీక్షలు జరుగుతాయని చెప్పారు. గతంలో విజయవంతంగా సచివాలయ ఉద్యోగాల భర్తీ కోసం పరీక్షలు నిర్వహించామని, ఈసారి కూడా అదే తరహాలో పరీక్షలను నిర్వహించాలని అన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top