అమరావతి... ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పెద్ద పజిల్. రాష్ట్రం భవిష్యత్తు మొత్తం దీంతోనే ముడిపడిందని కూటమి పెద్దలు చెబుతున్నా... దాన్నో రియల్ ఎస్టేట్ వెంచర్‌గా మార్చడం వల్లనే ప్రస్తుత సంక్షోభం నెలకొందని అందరూ అనుకుంటున్నారు. కేవలం 29 గ్రామాల్లో లక్షల కోట్లు గుమ్మరిస్తున్నామని చెబుతున్నా అక్కడి రైతులు మాత్రం అసంతృప్తితో రగిలిపోతున్నారు. సమస్య ఎంత తీవ్రంగా మారిందంటే.. తమ ఆవేదన వ్యక్తం చేస్తూ గుండెపోటుతో మరణించేంత! దురదృష్టవశాత్తూ ఈ అసంతృప్తులు, మరణాలు కూటమి నేతల మనసుల్లో ఏమాత్రం కదలిక, మార్పు తీసుకు రాలేకపోయాయి. ఉన్న ఇళ్లు కూల్చకుండానే అభివృద్ధి చేస్తామని మన్నటివరకూ ఊదరగొట్టిన చంద్రబాబు, మంత్రి నారాయణల గొంతులిప్పుడు మూగబోయాయి ఎందుకు? సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిటీ అని.. ఇప్పుడు వేల కోట్ల అప్పులెందుకు చేస్తున్నారు? ఉన్నది చాలదన్నట్లు మరో 44 వేల ఎకరాల భూమి పూలింగ్ కోసం ఎందుకు పాకులాడుతున్నట్లు? రాష్ట్ర ప్రజల మనసుల్లోని సమాధానం లేని ప్రశ్నలివి.
కొద్ది రోజుల క్రితం మందడం గ్రామసభలో రామారావు అనే రైతు రాజధాని కోసం తానిచ్చిన రెండెకరాల భూమికి బదులుగా వాగులో ఫ్లాట్ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేస్తూ అక్కడే గుండెపోటుకు గురై మరణించడం తీవ్ర కలకలం రేపింది. రామారావు బంధువులు, కొందరు స్థానికులు ‘‘మళ్లీ ఎవరిని చంపడానికి వచ్చారు’’ అంటూ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే శ్రావణకుమార్లను ప్రశ్నించిన తీరు రాజధాని ప్రాంతంలో రైతుల ఆగ్రహానికి దర్పణం పడుతుంది.
రామారావుది ప్రభుత్వ హత్యే అని సీపీఐ నేత కె.నారాయణ విమర్శించారు. గతంలో విపక్షంలో ఉన్నప్పుడు ఎక్కడ ఎవరు ఎలా మరణించినా, అమరావతి ఉద్యమంలోనే మృతి చెందారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడమే కాకుండా, వారి కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లిన చంద్రబాబు సి.ఎమ్. అయ్యాక రామారావు ఇంటికి వెళ్లలేదు. ఫోన్లో పరామర్శించారని ఎల్లో మీడియా తెలిపింది. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు కూడా రామరావుది సహజ మరణంగా చూపించడానికి తాపత్రయపడ్డాయి. రామారావు అంత గట్టిగా మంత్రిని ప్రశ్నిస్తే ఆయన కూల్‌గా మాట్లాడి కుప్పకూలారని ఒక పత్రిక హెడింగ్ పెట్టింది. ప్లాట్ల కేటాయింపులో జరుగుతున్న అన్యాయం రామారావు ఒక్కరి సమస్య కాదు. వేలాదిమంది ఇతర రైతుల బాధ. చిన్నకారు, సన్నకారు రైతులకు ఎదురవుతున్న సంక్షోభం. కీలకమైన ప్రదేశాలలో ఉన్న తమ పొలాలను ప్రభుత్వానికి ఇస్తే, తమకు చెరువులలో, వాగులలో ప్లాట్లు ఇస్తున్నారేమిటని ప్రశ్నిస్తున్నారు. అలాగే పలుకుబడిని బట్టి తూర్పు ఫేసింగ్ ప్లాట్లు కేటాయిస్తున్నారని మరి కొందరు వాపోతున్నారు. సీడ్ యాక్సిస్ రోడ్డు చెంత తమకు ఎందుకు ప్లాట్లు ఇవ్వరని వారు ప్రశ్నిస్తున్నారు. కాగా ఆసక్తికరంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగు రోడ్ల మధ్యలో ప్లాట్ ఎలా కొనుగోలు చేయగలిగారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రశ్నించడం విశేషం.
ఇక ఆయా గ్రామాల వారికి కొత్త టెన్షన్ పట్టుకుంది. భూ సమీకరణ సమయంలో గ్రామాలకు ఎలాంటి హానీ జరగదని చంద్రబాబు హామీ ఇచ్చారు. కాని ప్రస్తుతం రోడ్ల నిర్మాణంతో గ్రామాలు ఛిద్రమవుతున్నాయని ఒక జర్నలిస్టు తన పరిశీలన వ్యాసంలో తెలిపారు. అబ్బరాజుపాలెం, దొండడపాడు, పిచ్చుకలపాలెం, రాయపూడి, నేలపాడు, శాఖమూరు, తుళ్లూరు తదితర 11 గ్రామాలలో తక్షణం ప్రభావితం అవుతుండగా, మొత్తం 20 గ్రామాలలో ఇళ్లు, భవనాలు పోతాయని అనధికార సమాచారంగా ఉందని ఆ కథనంలో తెలిపారు. ఒక్క మందడంలోనే 147 ఇళ్లను తొలగించవలసి వస్తోందట. చంద్రబాబు ఎప్పటికప్పుడు తన తక్షణ అవసరాల కోసం ఏదో ఒక హామీ ఇచ్చేయడం, ఆ తర్వాత దానికి విరుద్ధంగా వ్యవహరించడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. ఇళ్లు కోల్పోయే వారికి ప్రత్యామ్నాయ స్థలాలు ఇస్తారన్న గ్యారంటీ లేదట. బాధితులు కోరిన విధంగా ఖరీదైన ప్రాంతాలలో స్థలాలు ఇవ్వలేమని సీఆర్డీయే అధికారులు చెబుతున్నారట.
ప్రపంచ బ్యాంక్, ఏడీబీ తదితర ఆర్థిక సంస్థల నుంచి వేల కోట్ల అప్పు తెస్తున్న ప్రభుత్వం వాటిని దుబారా చేయడం కూడా విమర్శలకు దారి తీస్తోంది. పూలింగ్ లే అవుట్ కింద రాజధాని జోన్ 8లో ఎకరా అభివృద్దికి ఏకంగా రెండు కోట్లు ఖర్చు పెట్టబోతున్నారట. ఇంత వ్యయం దేశంలో ఇంకెక్కడైనా జరుగుతుందా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అమరావతి ట్రంక్ రోడ్ల నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం ఆమోదించిన మొత్తం ఖర్చు రూ.7794 కోట్లుగా ఉండడంపై తీవ్ర విమర్శలు ఉన్నాయి. వరద నీటిని ఎత్తిపోయడానికి ఏ రాజధానిలోనూ వరదనీటి ఎత్తిపోతకు ప్రత్యేక లిఫ్ట్‌లు లేవని ప్రముఖ నిపుణుడు రామచంద్రయ్య వ్యాఖ్యానించారు.
హైదరాబాద్ వంటి చోట్ల కూడా భూమి కొనుగోలు చేసి నిర్మాణాలు చేసినా చదరపు అడుగుకు రూ.నాలుగైదు వేలు కాదని, అమరావతిలో మాత్రం రూ.తొమ్మిది, పది వేలు అవడానికి కారణం ఏమిటన్నది మరికొందరి ప్రశ్న. చంద్రబాబు అండ్ కో రకరకాల జిమ్మిక్కులు చేస్తున్నా రియల్ ఎస్టేట్ పెద్దగా లేకపోవడం అక్కడివారిలో నిరాశకు దారి తీస్తోంది. గతంలో అమరావతికి మద్దతుగా మాట్లాడిన వడ్డే శోభనాద్రీశ్వర రావు, పరకాల ప్రభాకర్ వంటి కొందరు ప్రముఖులు రాజధాని స్థల ఎంపికను తప్పుపడుతున్నారు. అంతేకాక, ప్రస్తుతం ఉన్న 53 వేల ఎకరాల భూమి చాలదని, మరో నలభైవేల ఎకరాలు తీసుకోవడానికి ప్రభుత్వం పూనుకోవడాన్ని ఆక్షేపిస్తున్నారు. రెండో దశ పూలింగ్‌కు సహకరించవద్దని వడ్డే శోభనాద్రీశ్వరరావు రైతులకు పిలుపునిచ్చారు కూడా. అయినా ప్రభుత్వం రెండో దశ పూలింగ్ కు నోటిఫికేషన్ ఇచ్చింది. తొలిదశ రైతులకు ఇచ్చిన హామీలను ఏ మేరకు నెరవేర్చారని, తమకు ఏ గ్యారంటీలు ఇస్తారని రెండో దశ గ్రామాల రైతులు ప్రశ్నిస్తున్నారు..ఈ పరిణామాలతో ఒకప్పుడు చంద్రబాబుకు గట్టి మద్దతుదారులుగా ఉన్న రైతులలో సైతం ఇప్పుడు ఏమి జరుగుతోందో తెలియక ఇదంతా ఒక పజిల్‌గా మారిందని వాపోతున్నారు.

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


