పవన్‌కళ్యాణ్‌ నమ్మక ద్రోహం | Pawan Palyan Complaint Filed By Sgali Preethi Mother Demanding Legal Action | Sakshi
Sakshi News home page

పవన్‌కళ్యాణ్‌ నమ్మక ద్రోహం

Jul 6 2026 1:47 PM | Updated on Jul 6 2026 3:24 PM

Pawan Palyan Complaint Filed By Sgali Preethi Mother Demanding Legal Action

గన్నవరం: అధికారంలోకి రాగానే తన కుమార్తె కేసు విషయంలో న్యాయం చేస్తానని నమ్మించి మోసం చేసిన డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సుగాలి ప్రీతి తల్లి పార్వతి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆమె కృష్ణా జిల్లా గన్నవరంలో పవన్‌కళ్యాణ్‌పై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో పలు బహిరంగ సభల్లో సుగాలి ప్రీతికి జరిగిన అన్యాయం గురించి పవన్‌కళ్యాణ్‌ ప్రస్తావించారని గుర్తు చేశారు. 

అధికారంలోకి రాగానే తాము చేపట్టే ఫస్ట్‌ కేసు సుగాలి ప్రీతిదేనని కూడా ఆయన హామీ ఇచ్చారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు ముగిసిపోయినా సుగాలి ప్రీతి కేసులో ఎటువంటి పురోగతి లేకపోవడం బాధాకరమన్నారు. ఐదు రోజులుగా దాదాపు ఐదు వందల మంది పోలీసులు, నాలుగు జిల్లాల ఎస్పీలను ఉరుకులు పరుగులు పెట్టించి యూట్యూబర్‌ రావణ్‌ను అరెస్ట్‌ చేశారని, అందులో కనీసం పది శాతం శ్రద్ధ పెట్టినా తమ కుటుంబానికి న్యాయం జరిగి ఉండేదన్నారు. 

నమ్మక ద్రోహి.. పవన్ పై సుగాలి ప్రీతి తల్లి ఫిర్యాదు

నిందితులు రాష్ట్ర మంత్రుల ఇళ్లలో, కర్నూలులో స్వేచ్ఛగా తమ కళ్ల ముందే తిరుగుతున్నారని వాపోయారు. ఎందుకీ వివక్ష? అని నిలదీశారు. సుగాలి ప్రీతి కేసులో ఆధారాలు తారుమారయ్యాయని ఏ ఆధారంతో పవన్‌ చెబుతున్నారని పార్వతి ప్రశ్నించారు. ఆధారాలు లేకుండా మాట్లాడిన ఆయనపై ఎన్ని కేసులు పెట్టాలని నిలదీశారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఒక దివ్యాంగురాలికి మాట ఇచ్చి మర్చిపోవడం చీటింగ్‌ కాదా? అని ప్రశ్నించారు. ముద్దాయిలకు డిప్యూటీ సీఎం హోదాలో పవన్‌ క్లీన్‌చిట్‌ ఇవ్వడం దుర్మార్గమన్నారు. చివరికి దివ్యాంగురాలైన తనను జనసేన నేతలు, వీర మహిళలతో బాడీ షేమింగ్‌ చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement