
చనిపోయిన పసికందును నడిరోడ్డుపై వదిలేసిన కసాయి
డబ్బుల్లేవని ప్రాథేయపడ్డా కనికరించలేదని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు
5 కి.మీ. మేర మృతదేహంతో నడుచుకుంటూ ఇంటికి..
మహారాణిపేట (విశాఖ) : విశాఖపట్నం కేజీహెచ్‌లో ఇదో అమానుష ఘటన. టీడీపీ కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వాస్పత్రుల పనితీరుకు అద్దంపట్టిన దారుణం. అనారోగ్యంతో మృతిచెందిన రెండు నెలల పసికందును, ఆ చిన్నారి తల్లిదండ్రులను కేజీహెచ్ అంబులెన్స్ డ్రైవర్ నిర్దాక్షిణ్యంగా నడిరోడ్డుపై వదిలేసి వెళ్లిపోయిన ఘోర ఉదంతమిది. దిక్కుతోచని, నిస్సహాయ స్థితిలో ఆ తల్లిదండ్రులు రాత్రిపూట విగత జీవితో ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ ఇంటికెళ్లారు. అందరినీ కదిలించే ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. అల్లూరి జిల్లా అనంతగిరి మండలం పెద్దకోట పంచాయతీ మడ్రేబు గ్రామానికి చెందిన సేదరి శైలు, అర్జున్ దంపతులకు రెండు నెలల కిందట చిన్నారి జన్మించింది.
పాపకు శ్వాస సంబంధిత సమస్య తలెత్తడంతో ఈనెల 8న విశాఖ కేజీహెచ్‌లో చేర్పించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం పసికందు మృతిచెందింది. పాప మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకెళ్లడానికి కేజీహెచ్ అంబులెన్స్‌లో బయల్దేరారు. కొంతదూరం వెళ్లాక కొత్తవలస జంక్షన్‌లో అంబులెన్స్ డ్రైవర్ వీరిని దించేశాడు. తమ వద్ద డబ్బుల్లేవని, స్వస్థలానికి తీసుకెళ్లమని తల్లిదండ్రులు ప్రాథేయపడ్డా కనికరించలేదు. దీంతో వారు తెలిసిన వారి ద్వారా డబ్బులు తెప్పించుకుని, ఆటోలో రూ.6 వేలకు సరియా వరకు వెళ్లారు. అక్కడి నుంచి రాత్రి సమయంలో పాప మృతదేహాన్ని మోసుకుంటూ ఇంటికి చేరుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
వేడుకున్నా కనికరించలేదు..
ఇక ఈ దారుణంపై బాధితులు శైలు, అర్జున్ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. కేజీహెచ్ అంబులెన్స్ డ్రైవర్ చాలా నిర్దయగా ప్రవర్తించాడని ఆవేదన వ్యక్తంచేశారు. డబ్బుల్లేవని చెప్పినా వినకుండా పాప మృతదేహంతో ఉన్న తమను కొత్తవలస జంక్షన్‌లో బాధ్యతారహితంగా వదిలేశాడని ఆరోపించారు. దీంతో రాత్రి 7 గంటల నుంచి 11 గంటల వరకు ఐదు కిలోమీటర్ల మేర పాప మృతదేహాన్ని మోసుకుంటూ ఇంటికి చేరుకున్నామని వారిరువురూ విలపిస్తూ చెప్పారు. అంబులెన్స్ డ్రైవర్‌పై చర్య తీసుకోవాలని, సరియా నుంచి మాడ్రేబు వరకు రోడ్డు సౌకర్యం కల్పించాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె.గోవిందరావు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు.