గుడ్లగూబ తన జీవితకాలంలో ఎన్ని ఎలుకల్ని తింటుందో తెలుసా?

Owls Are Farmers Best Friends - Sakshi

Owls Facts In Telugu: మనిషికి ఎప్పుడూ హాని చేయలేదు.. అసలు చేయలేవు కూడా. అయినా ఆ జీవుల్ని మనం అసహ్యించుకుంటాం. వాటిని చూస్తేనే అశుభంగా  భావిస్తాం. మన సమీపంలో  వాటి ఉనికినే తట్టుకోలేం.. అపనమ్మకాలతో వాటికి నిలువ నీడ లేకుండా చేస్తున్నాం.. క్షుద్ర పూజల పేరుతో కొందరి అజ్ఞానానికి అవి బలవుతున్నా.. మనకు మాత్రం మేలే చేస్తున్నాయి. పర్యావరణాన్ని పరిరక్షిస్తున్నాయి.. ఎలుకల బారి నుంచి పంటల్ని రక్షిస్తున్నాయి.. తద్వారా మనకు ఆహార భద్రతనిస్తున్నాయి..

గుడ్లగూబలకు అటవీ, జనసంచారం లేని ప్రాంతాలు ఆవాసాలు.  ప్రస్తుతం వాటి ఆవాసాలు దెబ్బతింటున్నాయి. సాధారణంగా గుడ్లగూబలు రాత్రిపూట సంచరిస్తాయి.. అయితే కొన్ని జాతులు పగలు కూడా తిరుగుతాయి. వంద గడ్డిజాతి(బార్న్‌) గుడ్లగూబలు వాటి జీవిత కాలంలో తినే ఎలుకల వల్ల రెండు వేల మందికి ఆహార భద్రతను కల్పిస్తాయని అధ్యయనాల్లో తేలింది. అవి ఉన్న చోట ఎలుకల కోసం మందుల వాడకం తగ్గుతుంది. ఆ విధంగా పర్యావరణానికి మేలు జరుగుతుంది. రైతులకు మందుల ఖర్చు కూడా తగ్గుతుంది. పంటల దిగుబడీ పెరుగుతుంది.

జీవితకాలం ఒకే జంటగా.. 
స్కాప్స్‌ వంటి చిన్న గుడ్లగూబలు 17 సెం.మీ. ఉంటే, ఇండియన్‌ ఈగిల్‌ వంటి గుడ్లగూబలు 60 సెం.మీ.వరకూ ఉంటాయి. గుడ్లగూబలకు పెద్ద కళ్లు ఉన్నాగానీ అవి వాటిని కదిలించలేవు. మెడను 270 డిగ్రీలకు తిప్పే అసాధారణ సామర్థ్యం వాటి సొంతం. దీని ద్వారానే అవి తమను తాము రక్షించుకుంటాయి. ఒక ఆడ, మగ గుడ్లగూబ జంట మనుషుల మాదిరిగానే జీవితకాలం కలిసుంటాయి. వాటి జీవితకాలం పదేళ్లయినా.. కొన్ని ఇంకా ఎక్కువ కాలమే బతుకుతాయి. 

అంతరించే దశలో పలు జాతులు 
పలు గుడ్లగూబ జాతులు ఆవాసాలను కోల్పోయి అంతరించే జాబితాలో ఉన్నాయి. మన దేశానికి చెందిన, టేకు అడవుల్లో నివాసముండే అడవి గుడ్లగూబ జాతి అంతరించిపోయిందని భావించారు. కానీ 1997లో మళ్లీ కనిపించింది. ప్రస్తుతం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్‌ తదితర రాష్ట్రాల్లో వాటి ఉనికిని గుర్తించారు. ఇండియన్‌ ఈగిల్‌ గుడ్లగూబ కొండ ప్రాంతాల్లో జరిగే తవ్వకాల కారణంగా ఆవాసాలను కోల్పోతోంది. పట్టణ ప్రాంతాల్లో బార్న్‌ గుడ్లగూబలు ఎత్తయిన భవనాలు, అపార్ట్‌మెంట్‌ బ్లాకుల్లో గూళ్లు పెడతాయి. అపనమ్మకాలతో వాటి గూళ్లను నాశనం చేస్తున్నారు. కొన్ని గుడ్లగూబ జాతుల్ని వేటాడి  అక్రమంగా రవాణా చేస్తున్నారు. గుడ్లగూబలకు 1972లో వన్యప్రాణి సంరక్షణ చట్టం పరిధిలో రక్షణ ఉంది. వాటిని వేటాడడం, వ్యాపారం చేయడం శిక్షార్హమైన నేరం. 

పర్యావరణానికి మేలు
గుడ్లగూబల గురించి పిల్లలు, పెద్దలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అవి ఉంటే వాటి పరిసరాల్లో ఎలుకలుండవు. తద్వారా అనేక వ్యాధులను నివారించొచ్చు. సహజ ఎలుకల నియంత్రణ కోసం రైతులు తమ పొలాల్లో గుడ్లగూబలను ఆహ్వానిస్తే ఎంతో మేలు జరుగుతుంది. సమాజంలో వాటి గురించి ఉన్న చెడు అభిప్రాయాన్ని మార్చగలిగితే.. అందమైన పక్షులను కాపాడుకుని మన పర్యావరణానికి మేలు చేసిన వారం అవుతాం.
– బండి రాజశేఖర్, సిటిజన్‌ సైన్స్‌ కో–ఆర్డినేటర్, ఐఐఎస్‌ఈఆర్, తిరుపతి

పంట నేస్తం గుడ్లగూబ గురించి మరిన్ని విషయాలు..

  • మన దేశంలో 35 జాతులు.
  • మన రాష్ట్రంలో 13 జాతులు.
  • ఇండియన్‌ ఈగిల్‌ గుడ్లగూబ మన దేశంలో పెద్దది. నగరాలు, గ్రామాలు, అడవుల సమీపంలోని కొండలు దీనికి ఆవాసాలు.
  • బార్న్‌ గుడ్లగూబ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా కనిపించే జాతి.
  • నగరాల్లో ఎత్తయిన భవనాలపై గూళ్లు పెట్టుకుంటుంది.
  •  మచ్చల గుడ్లగూబ నగరాలు, గ్రామాలు, అడవులు, ఎడారుల్లో కనిపిస్తుంది.
  • కీటకాలు, చిన్న చిన్న పక్షులు, ఎలుకల్ని తింటుంది.
  • ఒక గుడ్లగూబ తన జీవితకాలంలో 11 వేల ఎలుకలను తింటుంది.
  • ఆ ఎలుకలు 13 టన్నుల ఆహార పంటలను తినేస్తాయి.
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top