అంతర్జాలంలో ఓటీటీ మంత్రజాలం

OTT Platforms Change Entertainment Movies And Web Series - Sakshi

వెండి తెర, బుల్లి తెరలను తలదన్నుతున్న ఓటీటీ ప్లాట్‌ఫామ్‌

థియేటర్లు తెరుచుకున్నా కొనసాగుతున్న హవా

నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌ ప్రైమ్, డిస్నీప్లస్‌ హాట్‌స్టార్, ఆహా, జీ5 ద్వారా సినిమాలు, వెబ్‌ సిరీస్, టాక్‌ షోలు

క్రైమ్, థ్రిల్లర్, సస్పెన్స్, దేశభక్తి, సమాజ హితం, సందేశానికి ప్రాధాన్యం

ఓటీటీ బాట పడుతున్న సినీ దర్శకులు, నటులు

త్వరలో బాలయ్యతో ‘ఆహా’ టాక్‌ షో

వెబ్‌ సిరీస్‌లో ప్రియమణి, సమంత వంటి హీరోయిన్లు

సాక్షి, అమరావతి: అంతర్జాలంలో ఓవర్‌ ది టాప్‌ (ఓటీటీ) ప్లాట్‌ఫామ్‌ వినోదాన్ని పంచుతోంది. కోవిడ్‌ దెబ్బకు సినిమా థియేటర్లు మూతపడటం, టీవీ సీరియల్స్, షోలు నిలిచిపోవడంతో ఓటీటీ ఆన్‌లైన్‌ ట్రెండ్‌కు తెరలేచిన సంగతి తెలిసిందే. వెండి తెర, బుల్లి తెరను తలదన్నేలా పట్టునిలుపుకుంటున్న ఓటీటీ ఇప్పుడు సినిమా థియేటర్లు తెరుచుకున్నప్పటికీ హవా కొనసాగిస్తోంది.

ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌ ప్రైమ్, డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌తోపాటు తెలుగులో ప్రధానమైన ‘ఆహా’, జీ5 వంటి ఆన్‌లైన్‌ సైట్‌ల ద్వారా మొదలైన సినిమాల రిలీజ్‌ ఇప్పుడు వెబ్‌ సిరీస్, టాక్‌ షోల ట్రెండ్‌ను కొనసాగిస్తోంది. క్రైౖమ్, థ్రిల్లర్, సస్పెన్స్, సెంటిమెంట్, దేశభక్తి, సందేశం వంటి అంశాలే ప్రధానంగా వెబ్‌ సిరీస్, ప్రత్యేక కార్యక్రమాలకు ఆదరణ లభిస్తోంది. ఆన్‌లైన్‌ వీక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తుండటంతో సినీ దర్శకులు, నటులదృష్టి ఇప్పుడు వెబ్‌ సిరీస్, టాక్‌ షోల వైపు మళ్లింది.

సమయం.. నిడివి పరిమితి లేకుండా..
తక్కువ నిడివితో ఎక్కువ ఎపిసోడ్ల ద్వారా ఆకట్టుకునే సన్నివేశాలతో రూపొందిస్తున్న వెబ్‌ సిరీస్‌కు క్రేజ్‌ పెరిగింది. సినిమాలైతే తాము చెప్పదల్చుకున్న విషయాన్ని కేవలం 2.15 గంటల నుంచి 2.45 గంటల్లో కథను చిత్రీకరించాలి. అదే వెబ్‌ సిరీస్‌లో అయితే సమయం, నిడివి పరిమితి లేకపోవడంతో కథ, విషయాలను బట్టి ఎన్ని ఎపిసోడ్లు అయినా, ఎంత సమయమైన ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉంది.

ఒక్కో సిరీస్‌ను ఐదు నుంచి 20 ఎపిసోడ్‌లుగా రూపొందిస్తున్నారు. ఈ సిరీస్‌లో ఒక్కో ఎపిసోడ్‌ 28 నిమిషాల నుంచి 42 నిమిషాలపాటు ఉండేలా చిత్రీకరిస్తున్నారు. ఈ మొత్తం సిరీస్‌ 7.30 గంటల నుంచి 12 గంటల వరకు ఉంటాయి. దీనివల్ల టీవీ సీరియల్స్‌ మాదిరిగానే వెబ్‌ సిరీస్‌ను ప్రేక్షకులు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎన్ని ఎపిసోడ్స్‌ చూడాలంటే అన్ని చూడొచ్చు. 

వెబ్‌ సిరీస్‌ వైపు.. సినీ దర్శకుల చూపు
సినీ నిర్మాతలు, నటులు సైతం వెబ్‌ సిరీస్‌ వైపు మక్కువ చూపుతున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో ఆన్‌లైన్‌ ప్రేక్షకుల ఆదరణ చూరగొన్న ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ వెబ్‌ సిరీస్‌లో ప్రియమణి నటించడం గమనార్హం. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)కు చెందిన ఒక అధికారి అటు కుటుంబ బాధ్యతలు, ఇటు దేశ రక్షణలో సతమతమైన తీరును పది ఎపిసోడ్‌లలో అద్భుతంగా చిత్రీకరించారు. మరో పది ఎపిసోడ్‌లతో చిత్రీకరించిన ‘ది ప్యామిలీ మ్యాన్‌–2’లో ప్రియమణితోపాటు సమంత కూడా నటించింది. తాజాగా రిలీజ్‌ చేసిన ‘బ్రీత్‌ ఇంటూ ది షాడోస్‌’లో నిత్యామీనన్, ‘ది లస్ట్‌ స్టోరీస్‌’లో ఈషా రెబ్బ, ‘ముద్దపప్పు ఆవకాయ’లో నిహారిక కొణిదెల నటించారు.

‘నవరస’ టైటిల్‌తో తొమ్మిది మంది డైరెక్టర్లతో తొమ్మిది రసాలు ప్రతిబింబించేలా వెబ్‌ సిరీస్‌ తీస్తున్నట్టు సినీ దర్శకుడు మణిరత్నం ప్రకటించారు. శృతిహాసన్‌ ప్రధాన పాత్రగా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ రూపొందించిన వెబ్‌ సిరీస్‌ విడుదల కావాల్సి ఉంది. ‘శతమానం భవతి’ సినిమా దర్శకుడు సతీష్‌ వేగేశ్న వెబ్‌ సిరీస్‌ తీయనున్నట్టు ప్రకటించారు. మణిరత్నం దర్శకత్వంలో శరత్‌కుమార్, వరలక్ష్మి(సర్కార్‌ ఫేం) నటించిన ‘అద్దం’ సిరీస్‌ ఓటీటీ ద్వారా విడుదలకు సిద్ధమైంది.

‘ఆహా’లో బాలయ్య
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కు చెందిన ‘ఆహా’ ఓటీటీ మీడియా సర్వీసెస్‌లో నందమూరి బాలకృష్ణ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసారం చేయనున్నారు. ‘ఆన్‌ స్టాపబుల్‌ విత్‌ ఎన్బీకే’ పేరుతో  వెబ్‌ సిరీస్‌గా ప్రముఖుల ఇంటర్వ్యూలను నవంబర్‌ 4 నుంచి ప్రసారం చేయనున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. వెండితెర, బుల్లితెరకు దీటుగా ఆదరణ చూరగొంటున్న ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి మరింత మంది సినీ నిర్మాతలు, దర్శకులు, నటులు 
క్యూ కట్టేందుకు సిద్ధమవుతుండటం గమనార్హం.

ఓటీటీ అంటే..
ఓటీటీ (ఓవర్‌ ది టాప్‌) మీడియా సర్వీస్‌ అంతర్జాలం (ఇంటర్నెట్‌)పై ఆధారపడి పనిచేస్తుంది. దీనినే డిజిటల్‌ స్ట్రీమింగ్‌ మీడియా సర్వీస్‌ అని కూడా పిలుస్తారు. ఇందులో సినిమాలు, వెబ్‌ సిరీస్, టీవీ కార్యక్రమాలు, సెలబ్రిటీ షోలు ప్రసారం చేస్తారు. ఓటీటీలో వినియోగదారులు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏ కార్యక్రమం కావాలంటే అది చూడొచ్చు. కేబుల్‌ టీవీ, డీటీహెచ్‌ కనెక్షన్‌ అవసరం లేకుండా ఇంటర్నెట్‌ ఉపయోగించుకుని సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్, టాబ్, టీవీల్లోనూ ఈ కార్యక్రమాలు చూడొచ్చు. ఇంటర్నెట్‌ వినియోగిస్తున్న వారిలో సగటున 39 నుంచి 45 శాతం మంది ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ద్వారా సినిమాలు, వెబ్‌ సిరీస్, టాక్‌ షోలు వీక్షిస్తున్నట్టు అంచనా. 

వెబ్‌ సిరీస్‌లో వెగటు సన్నివేశాలు
సినిమాలపై ఉన్న సెన్సార్‌ కత్తెర వెబ్‌ సిరీస్‌కు లేకపోవడంతో వెగటు పుట్టించే సన్నివేశాలు కూడా రూపొందించడం గమనార్హం. సినిమాల్లో అశ్లీల సన్నివేశాలు, కులాలు, మతాలు, రాజకీయ పార్టీలు, వ్యక్తులను కించపరిచే సన్నివేశాలను సెన్సార్‌ బోర్డు తొలగిస్తుంది. వెబ్‌ సిరీస్‌పై అటువంటి ఆంక్షలు లేకపోవడంతో క్రైమ్, థ్రిల్లర్, సస్పెన్స్‌ పేరుతో అశ్లీల సన్నివేశాలు, అసభ్య పదజాలం యథాతథంగా చూపిస్తుండటం శోచనీయం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top