
పార్ట్‌టైం జాబ్ ఆఫర్‌తో సైబర్ వల
ఇంటి వద్దే జాబ్ అంటూ ఉచ్చు
రూ.వేల నుంచి రూ.లక్షల్లో దోపిడీ
సత్యసాయి జిజిల్లాలో పెరుగుతున్నఆన్‌లైన్ జాబ్ బాధితులు
సైబర్ నేరగాళ్లు రోజుకో సరికొత్త విధానాలతో ప్రజలను మాయ చేస్తున్నారు. ఉన్నత విద్యను అభ్యసించిన వారిని సైతం సులువుగా బురిడీ కొట్టిస్తున్నారు. ఇటీవల ఇంటి వద్ద నుంచే ఉద్యోగం చేయవచ్చునంటూ వల విసిరి రూ.లక్షలు దోచేశారు. నిరుద్యోగ యువతే లక్ష్యంగా పార్ట్‌టైమ్ జాబ్‌లంటూ మోసాలకు తెగబడ్డారు. సైబర్ నేరగాళ్ల బారిన పడిన బాధితులు లబోదిబోమంటూ మిన్నకుండిపోతున్నారు. ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో వారి ఆగడాలు ఎక్కువయ్యాయి.
ధర్మవరం అర్బన్: ఆన్‌లైన్ పార్ట్‌టైమ్ జాబ్ అంటూ సైబర్ నేరగాళ్లు విసిరిన వలలో సత్యసాయి జిల్లా యువత చిక్కుకుని విలవిల్లాడుతోంది. ఆన్‌లైన్ జాబ్ సైట్, సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్, పత్రికల్లో నకిలీ ప్రకటనలు నమ్మి మోసపోతోంది. వీరిలో ఎక్కువ శాతం ఇంజనీరింగ్ పట్టభద్రులు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఉద్యోగులు, నిరుద్యోగులే ఉన్నారు.
ఇంట్లో ఉన్నవారే లక్ష్యం
వర్క్ ఫ్రమ్ హోం పై మక్కువ పెంచుకున్న యువతను లక్ష్యంగా చేసుకుని జాబ్ స్కామర్లు చెలరేగిపోతున్నారు. తక్కువ సమయం, తక్కువ శ్రమతో నెలకు వేలాది రూపాయలు సంపాదించే జాబ్‌లు తమ వద్ద ఉన్నాయంటూ తరచూ ఆన్‌లైన్‌లో ప్రకటనలు గుప్పించి ఆకర్షిస్తున్నారు. ఈ ప్రకటనలు నమ్మి సంప్రదిస్తే ఫీజుల రూపంలో డబ్బు కట్టించుకుని ఆ తర్వాత బోర్డు తిరగేయడం షరా మాములైంది.
తమనే నష్టపరిచారంటూ బ్లాక్ మెయిల్
జిల్లాలో రకరకాల డేటా ఎంట్రీ స్కామ్స్ వెలుగు చూస్తున్నాయి. ఎక్కువ స్కిల్స్ అవసరం లేదని, సింపుల్‌గా డేటా ఎంట్రీ చేస్తే చాలు డబ్బు సంపాదించవచ్చని నమ్మబలుకుతారు. ముందుగా ప్రాసెసింగ్ ఫీజు, ట్రైనింగ్ ఫీజు రూపంలో పేమెంట్ చేయించుకుంటారు. డేటా ఎంట్రీ అనంతరం అందులో తప్పులున్నాయని, దాని వల్ల తమ సంస్థ నష్టపోయిందని, పరిహారం చెల్లించకపోతే లీగల్ ప్రొసీడింగ్స్‌కు వెళతామని బెదిరింపులకు దిగుతూ పెద్ద మొత్తంలో నగదు లూటీ చేస్తున్నారు.
మచ్చుకు కొన్ని..
» నెలకు రూ.60 వరకు జీతం అందిపుచ్చుకుంటున్న ధర్మవరం నియోజకవర్గంలోని ఓ ప్రభుత్వ ఉద్యోగి... తీరిక వేళల్లో ఖాళీగా ఉండడం ఇష్టం లేక వర్క్ ఫ్రమ్ హోమ్ పేరిట ఆన్‌లైన్ టాస్‌్కలో పాల్గొన్నాడు. మొదట దాదాపు రూ.15వేల వరకు నగదు అతని ఖాతాకు బదిలీ అయింది. దీంతో పూర్తిగా నమ్మి అవతలి వ్యక్తుల డిమాండ్ మేరకు నగదు బదిలీ చేస్తూ రూ.2.75లక్షల వరకు పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత తాను మోసపోతున్నట్లుగా నిర్ధారించుకుని మిన్నకుండిపోయాడు.
» ధర్మవరానికి చెందిన ఓ యువకుడు ఇంజినీరింగ్ పూర్తి చేసి ఆరునెలలుగా ఇంటి వద్దనే ఖాళీగా ఉన్నాడు. ఆన్‌లైన్‌లో జాబ్ కోసం వెతుకుతూ ఓ వెబ్‌సైట్‌లో లింక్‌ను ఓపెన్ చేశాడు. కొంత డబ్బు పెట్టుబడిగా పెడితే అంతకు రెట్టింపు వస్తుందని అవతలి వ్యక్తులు నమ్మబలకడంతో తొలుత రూ.5వేలు వారి ఖాతాకు పంపాడు. అనంతరం విడతల వారీగా రూ.1.35 లక్షల వరకు నగదు బదిలీ చేసినా తనకు రిటర్న్స్ లేకపోవడంతో అవతలి వ్యక్తులను నిలదీశాడు. వారి సమాధానంతో తృప్తి చెందక ఇకపై తాను డబ్బు వేయనని తేల్చి చెప్పడంతో వెంటనే వారి నంబర్లు, వాట్సాప్ గ్రూపు బ్లాక్ చేసేశారు.
» ధర్మవరంలో నివాసముంటున్న ఓ వివాహిత డిగ్రీ వరకు చదువుకుంది. ఇంట్లో ఖాళీగా ఉండలేక పార్ట్‌టైం జాబ్ కోసం ఆన్‌లైన్‌లో సెర్చ్ చేస్తుంటే రోజు రెండు గంటల పాటు పనిచేస్తే రూ.250 చొప్పున నెల రోజుల తర్వాత జీతం రూపంలో బ్యాంకు ఖాతాలోకి నగదు జమ అవుతుందనే ఓ సైట్ కనిపించడంతో సంప్రదించింది. అవతలి వ్యక్తుల మాటలు నమ్మి తొలుత రూ.5వేలు చెల్లించింది.
ఆ తర్వాత రోజు రూ.250 నుంచి రూ.500ల వరకు సంపాదిస్తున్నట్లు వారం రోజుల పాటు ఆన్‌లైన్ వాలెట్‌లో కనిపిస్తూ వచ్చింది. వారు విధించిన గడువు లోపు మ్యాటర్ టైప్ చేసి ఇవ్వకపోతే ఎదురు డబ్బు చెల్లించాలనే నిబంధన ఉండడంతో పలుమార్లు తన ఖాతా నుంచి దాదాపు రూ.55వేల వరకు ఆమె బదిలీ చేస్తూ వచ్చింది. అయితే రెండు నెలలు గడిచినా ఆమె బ్యాంక్ ఖాతాలోకి డబ్బు జమకాకపోవడంతో మోసపోయానని గ్రహించి వెంటనే భర్తకు వివరించింది.
» ధర్మవరంలోని యాదవవీధిలో నివాసముంటున్న బీటెక్ పూర్తి చేసిన యువకుడు పార్ట్‌టైం జాబ్ కోసం ఆన్‌లైన్‌లో సెర్చ్ చేశాడు. ఇంట్లో గంటసేపు కష్టపడి డబ్బులు సంపాదించుకోవచ్చని ఓ వెబ్‌సైట్‌లో సమాచారాన్ని నమ్మి తన సరి్టఫికెట్లు, ఆధార్‌కార్డు అప్‌లోడ్ చేశాడు. ముందుగా ప్రాసెసింగ్ ఫీజు, ట్రైనింగ్ ఫీజు పేరుతో అడ్వాన్స్‌గా రూ.15వేలు సైబర్ నేరగాళ్లు తమ ఖాతాలోకి జమ చేయించుకున్నారు. అనంతరం తాము ఇచ్చిన మ్యాటర్‌ను అలాగే టైప్ చేసి పంపాలని, గంటలోపు ఎన్ని పదాలు టైపు చేస్తే అంత డబ్బు బ్యాంక్ ఖాతాలోకి జమ అవుతుందని నమ్మబలికారు.
దీంతో యువకుడు టైపు చేస్తుండగా, తప్పులు ఉన్నాయని, దీంతో కంపెనీ పరువు పోయిందని, పరిహారం రూ. 2 లక్షలు చెల్లించకపోతే కోర్టుకు లాగుతామని బెదిరించారు. పక్కనే ఉన్న తమ న్యాయవాదితో మాట్లాడమంటూ మరో వ్యక్తికి ఫోన్ ఇచ్చారు. విషయాన్ని వెంటనే సదరు యువకుడు పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో అప్రమత్తమైన సైబర్ నేరగాళ్లు వారి నంబర్‌ను బ్లాక్ చేశారు.
అప్రమత్తంగా ఉండాలి
ఆన్‌లైన్‌లో వచ్చే ఉద్యోగ ప్రకటనలు చూసి మోసపోవద్దు. యువత నైపుణ్యం పెంచుకోవడానికి కోచింగ్ సెంటర్లకు వెళ్లి కొత్త కోర్సులు అభ్యసించాలి. సాధారణంగా ప్రముఖ సంస్థలు ఎప్పుడూ రిజి్రస్టేషన్ ఫీజు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫీజు పేరిట నగదు వసూలు చేయవు.
జాబ్ స్కామర్ల ప్రకటనల్లో, ఈ మెయిల్స్‌లో ఎక్కువగా గ్రామర్ తప్పులు ఉంటాయి. జాబ్ డిస్క్రిప్షన్ కూడా అస్పష్టంగా ఉంటుంది. క్విక్ మనీ, అన్‌లిమిటెడ్ ఎరి్నంగ్స్, ఎలాంటి టెక్నికల్ స్కిల్స్ అవసరం లేదు అనే పదాలపై అప్రమత్తంగా ఉండాలి. మోసపోయామని గ్రహిస్తే సమీప పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ధైర్యంగా ఫిర్యాదు చేయాలి. – సీఐ రెడ్డెప్ప, టూ టౌన్ పోలీస్ స్టేషన్, ధర్మవరం