
ప్రకాశం: ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలం నల్లగుంట్లలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. శుక్రవారం రాత్రి ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. డీఎస్పీ నాగరాజు కథనం మేరకు.. 2022 ఫిబ్రవరి 9వ తేదీన కొర్రప్రోలు సమీపంలో జరిగిన మొద్దు వెంకటేశ్వర్లు హత్య కేసులో గ్రామానికి చెందిన బైరబోయిన వెంకటేశ్వర్లు ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ప్రత్యర్థి వర్గానికి చెందిన వ్యక్తులు కక్షతో రగిలిపోతున్నారు.
ఈ క్రమంలో శుక్రవారం రాత్రి గ్రామంలో మొహర్రం వేడుకల సందర్భంగా బాదుల్లా షరగత్‌ను నిర్వహించారు. ఇదే అదునుగా భావించిన ప్రత్యర్థి వర్గీయులు అర్ధరాత్రి సమయంలో కాపు కాసి వెంకటేశ్వర్లుపై కత్తులతో చేసిన దాడి కిరాతకంగా నరికి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. హతుడి భార్య విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గ్రామంలో పోలీస్ పికెట్
వెంకటేశ్వర్లు దారుణ హత్యకు గురవడంతో ఆయన కుటుంబం శోక సముద్రంలో మునిగింది. భార్య విజయలక్ష్మి భర్త మృతదేహంపై పడి బోరున విలపించటం అందరినీ కలిచి వేసింది. మృతునికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈ ఘటనతో గ్రామంలో స్పెషల్ పార్టీ పోలీసులతో పికెట్ ఏర్పాటు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలించినట్లు ఎస్సై మహేష్ తెలిపారు.