కర్నూలు ప్రభుత్వాసుపత్రి.. రూ.150 కోసం పీడించారు 

Old Woman Harassed in Kurnool Government Hospital for Bribe - Sakshi

సాక్షి, కర్నూలు(హాస్పిటల్‌): కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో అనధికార వ్యక్తుల సంచారం అధికమైంది. వైద్య సిబ్బందిలాగా యూనిఫాం ధరించి వార్డులో తిరుగుతూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. రోగులు, వారి సహాయకులను డబ్బుల కోసం వేధిస్తున్నారు. శుక్రవారం ఉదయం ఆసుపత్రి ఫిమేల్‌ వార్డుకు వైద్యపరీక్షల కోసం ఓ మహిళ వచ్చింది. ఆమెకు సహాయంగా వచ్చిన వృద్ధురాలిని డబ్బులు ఇవ్వాలంటూ యూనిఫాంలో ఉన్న వ్యక్తులు వేధించారు.

తన వద్ద డబ్బులు లేవంటూ వృద్ధురాలు బతిమిలాడినా వదిలిపెట్టలేదు. చివరికి వంద రూపాయలు ఇస్తానని వృద్ధురాలు చెప్పగా కనీసం రూ.150 ఇవ్వాలంటూ వేధించి మరీ తీసుకున్నారు. ఈ తతంగాన్ని కొందరు సెల్‌ఫోన్‌లో వీడియో తీసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేయగా వైరల్‌గా మారింది. ఇది జిల్లా కలెక్టర్‌ దృష్టికి వెళ్లడంతో ఆయన ఆసుపత్రి అధికారులను విచారణకు ఆదేశించారు.

అయితే వైద్య సిబ్బంది ముసుగులో ఉన్న వ్యక్తులు ఆసుపత్రికి సంబంధించిన వారు కాదని, బయటి వ్యక్తులని అధికారులు తేల్చారు. వారిపై మూడవ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నరేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. ఆసుపత్రిలో సెక్యూరిటీ సిబ్బంది నిత్యం పర్యవేక్షణలో నిమగ్నమై ఉండాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆసుపత్రి సిబ్బంది ప్రతి ఒక్కరూ గుర్తింపు కార్డు, డ్రస్‌ కోడ్‌ ధరించి ఉండాలని, లేకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

చదవండి: (ఏపీ సంక్షేమ పథకాలకు లండన్‌ ఎంపీ కితాబు)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top