దొరకునా.. ఇటువంటి సేవ.. | Odisha People Served To Simhachalam Varaha Lakshmi Narasimha Swamy | Sakshi
Sakshi News home page

దొరకునా.. ఇటువంటి సేవ..

Nov 18 2020 7:36 PM | Updated on Nov 18 2020 8:05 PM

Odisha People Served To Simhachalam Varaha Lakshmi Narasimha Swamy - Sakshi

సాక్షి, సింహాచలం: ఆ కుటుంబం తరతరాలుగా లక్ష్మీనృసింహుని సేవలో పునీతమవుతోంది. 300 ఏళ్లకుపైగా ఇంట్లో పీఠం ఏర్పాటు చేసుకుని నిత్య కైంకర్యాలు చేయడమేగాక ఏటా మూడునెలలు సింహాచలంలోని శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో సేవలు చేస్తోంది. ఆలయం వద్ద కూడా దాససత్రం ఏర్పాటు చేసి భక్తులకు సేవచేస్తోంది. మానవసేవనే మాధవసేవగా.. మాధవసేవనే మానవసేవగా.. భావించటమేగాక త్రికరణశుద్ధిగా ఆచరిస్తోంది. అదే ఒడిశాలోని గంజాం జిల్లా పట్టుపురం గ్రామానికి చెందిన దాసుల కుటుంబం. ప్రస్తుతం ఆ కుటుంబానికి చెందిన లక్ష్మీకాంత్‌ నాయక్‌ దాస్‌ 14 ఏళ్లుగా స్వామికి సేవచేస్తున్నారు. ఆర్జితసేవలు జరిపించడమేగాక భక్తులకు స్వామి విశిష్టతను, సింహాచలం క్షేత్ర ప్రాశస్థ్యాన్ని వివరిస్తున్నారు.

లక్ష్మీకాంత్‌నాయక్‌ దాస్‌ తాతగారి పెదనాన్న అయిన ముకుంద నాయక్‌ దాస్‌ నుంచి ఈ కుటుంబం శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామికి సేవచే స్తోంది. ఒడిశా నుంచి సింహగిరికి వచ్చిన ముకుంద నాయక్‌ దాస్‌ ఒక చెట్టుకింద తపస్సు చేసుకుంటూ స్వామిని సేవించుకునేవారు. ముకుంద నాయక్‌ దాస్‌ పరమపదించిన తరువాత ఆయన తమ్ముడి కొడుకు రుషీకేశ్‌ నాయక్‌ దాస్‌ తొమ్మిదేళ్ల వయసులో స్వామిసేవ ప్రారంభించారు. రుషీకేశ్‌ నాయక్‌ దాసు 95 ఏళ్లపాటు స్వామికి సేవలు అందించారు. ఆయనకు 76వ ఏట సంతానం కలిగింది. 1947లో సింహగిరి క్షేత్రపాలకుడు త్రిపురాంతకస్వామి ఆలయం వద్ద కొంత స్థలాన్ని తీసుకుని ఒడిశా నుంచి సింహగిరికి వచ్చే భక్తుల కోసం దాససత్రం నిర్మాణానికి పునాది వేశారు.

ఆయన అనంతరం ఆయన కుమారుడు బుచ్చికిశోర్‌ నాయక్‌ దాస్‌ స్వామికి సేవలందించే బాధ్యతలు చేపట్టారు. తర్వాత ఆయన తమ్ముడు వనమాలి నాయక్‌ దాస్‌ స్వామిసేవ చేశారు. వనమాలి నాయక్‌ దాస్‌ హయాంలోనే రుషీకేశ్‌ నాయక్‌ దాస్‌ పునాది వేసిన దాససత్రం నిర్మించారు. 2006 వరకు ఆ సత్రంలో ఏటా మూడునెలలు ఉండేవారు. స్వామిని సేవించుకుంటూ, భక్తులకు నిత్యం సత్రంలో భోజనం పెట్టేవారు. వనమాలి నాయక్‌ దాస్‌ అనంతరం 2006లో ఆయన కుమారుడు లక్ష్మీకాంత్‌ నాయక్‌ దాస్‌ స్వామి సేవాబాధ్యతలు స్వీకరించారు. అభివృద్ధి పనుల్లో భాగంగా 2008లో దాససత్రాన్ని తొలగించిన దేవస్థానం ప్రత్యామ్నాయంగా జఠల్‌సాధు మఠానికి వెళ్లే దారిలో కొండపై స్థలాన్ని ఇచ్చింది. అక్కడ సత్రాన్ని నిర్మించిన లక్ష్మీకాంత్‌ నాయక్‌ దాస్‌ తన తండ్రి వనమాలి నాయక్‌ దాస్‌ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. 

ఇంట్లో స్వామి పీఠం
దాసుడు సింహాచలంలో ఉన్న మూడునెలల్లో స్వామికి ఆర్జితసేవలను వైభవంగా నిర్వహిస్తుంటారు. లక్ష తులసిపూజ, కోలాసేవ, గరుడసేవ, ఊంజల్‌ సేవ, నిత్యకల్యాణం, నృసింహ హోమం వాటిలో ముఖ్యమైనవి. పట్టుపురంలోని తమ ఇంట్లో శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి పీఠం ఏర్పాటు చేసుకుని సింహాచలం క్షేత్రంలో జరిగే నిత్యపూజా కార్యక్రమాలను ఆచరిస్తున్నారు. సింహాచలం క్షేత్రంలో స్వామికి రోజూ జరిగే భోగాలను అక్కడ కూడా చేస్తుంటారు. అక్కడ భక్తులు సమర్పించే ఆదాయంలో కొంత నగదుని తీసుకొచ్చి సింహాచల క్షేత్రంలో స్వామికి సమర్పిస్తారు.

తులసి, నూనె ప్రసాదం
శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామికి అంతరాలయంలో రోజూ పూజ చేసిన అనంతరం తులసిని, ఆలయ ప్రాంగణంలోని గంగమ్మతల్లి సన్నిధిలో దీపాన్ని వెలిగించి ఆ కుందెలో నూనెను దాసుడు భక్తులకు ప్రసాదంగా ఇస్తుంటారు. వీటిని స్వీకరిస్తే ఆరోగ్యం చేకూరుతుందని భక్తుల విశ్వాసం. ఈ ప్రసాదం కోసం ఒడిశా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధికంగా వస్తారు. 

సెప్టెంబర్‌లో ప్రారంభమైన లక్ష్మీకాంత్‌ నాయక్‌ దాస్‌ సేవలు
ఏటా మే నెల నుంచి మూడు నెలలపాటు స్వామికి దాసుడు సేవలు చేయడం పరిపాటి. కానీ ఈఏడాది కరోనా కారణంగా లక్ష్మీకాంత్‌ నాయక్‌ దాస్‌ సెప్టెంబర్‌లో సింహగిరికి వచ్చారు. ఇప్పటికే నిత్యకల్యాణం, గరుడసేవ, నృసింహహోమం నిర్వహించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement