
జగన్ పర్యటనలో అడుగడుగునా అడ్డంకులు.. జనాన్ని నిలువరించేందుకు కూటమి ప్రభుత్వం విఫలయత్నం
పోలీసుల అత్యుత్సాహం.. రహదారులను తవ్వేసిన వైనం
పార్టీ శ్రేణులు రాకుండా అడ్డగింతలు
ఓ దశలో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై లాఠీచార్జి
అయినా ఆంక్షలు లెక్కచేయక వెల్లువలా తరలి వచ్చిన అభిమాన జనం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నెల్లూరు పర్యటనలో పార్టీ శ్రేణులను, అభిమానులను కట్టడి చేయడంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఊరూరా ఆంక్షలు, పెద్ద సంఖ్యలో చెక్‌పోస్టులు, అడుగడుగునా బారికేడ్లు, ముళ్లు, ఇనుప కంచెలు ఏర్పాటు చేయడంతో పాటు తుదకు రహదారులను తవ్వి.. ధ్వంసం చేసినా ప్రభుత్వ పెద్దల లక్ష్యం మాత్రం నెరవేరలేదు. ఇవేవీ కూడా వైఎస్సార్‌సీపీ శ్రేణులు, ప్రజలను అడ్డుకోలేకపోయాయి. జగన్‌ను కలిసేందుకు, చూసేందుకు వచ్చిన నేతలు, కార్యకర్తలు, అభిమానులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు.
కొందరు నేతలు, కార్యకర్తలపై లాఠీచార్జ్ చేసి ప్రభుత్వ పెద్దలను మెప్పించే ప్రయత్నాలు చేశారు. ఇంత చేసినా ఊహించని స్థాయిలో జనం రావడంతో నెల్లూరు నగరం జన సునామీగా మారింది. వైఎస్ జగన్ గురువారం నాటి పర్యటనకు 110 మందికి మించి పాల్గొన కూడదంటూ ఆంక్షలు విధించిన ఇన్‌చార్జి ఎస్పీ ఏఆర్ దామోదర్ నేతృత్వంలో గుంటూరు రేంజ్ పరిధిలోని అన్ని జిల్లాల నుంచి 2వేల∙మందికిపైగా పోలీసులను మోహరించారు. పర్యటనకు ఎవరూ రాకూడదంటూ, వస్తే కేసులు నమోదు చేస్తామంటూ నిర్బంధాలకు తెర లేపారు.
అర్ధరాత్రి, అపరాత్రి తేడాలేకుండా వైఎస్సార్‌సీపీ నేతలకు నోటీసులు జారీ చేశారు. ప్రజలకు సైతం హెచ్చరికలు చేశారు. గురువారం తెల్లవారుజాము నుంచే నెల్లూరు సరిహద్దుల్లో పదుల సంఖ్యలో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి, బయట ప్రాంతాల నుంచి ఎవరూ నగరంలోకి రాకుండా చర్యలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు రోడ్లపైకి వచ్చి తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రజలు పనుల నిమిత్తం నెల్లూరు నగరానికి వెళుతున్నామని చెప్పినప్పటికీ వినకుండా బలవంతంగా వెనక్కి పంపారు.
ఇనుప కంచెలతో బారికేడ్లను ఏర్పాటు చేశారు. రహదారులను తవ్వేశారు. చెముడుగుంటలోని హెలిప్యాడ్ వద్ద నుంచి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటి వరకు ప్రధాన కూడళ్ల వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. డీటీసీకి వెళ్లే రహదారిలోకి ఎవరినీ అనుమతించలేదు. ఆ ప్రాంతం వారు ఎవరూ ఇల్లు విడిచి బయటకు రాకుండా నిర్బంధించారు.

కర్ఫ్యూ వాతావరణం
కేంద్ర కారాగారం చుట్టూ బారికేడ్లు పెట్టారు. దానికి ముందు ముళ్ల కంచెను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. అనుకూల మీడియా మినహా ఇతరులు ఎవరినీ వెళ్లనివ్వలేదు. వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులు రాకుండా పరిసర ప్రాంతాలన్నీ పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. హెలిప్యాడ్ వద్దకు వెళుతున్న మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరుల పట్ల కూడా పోలీసు అధికారులు దురుసుగా ప్రవర్తించారు. నెల్లూరు నగరం అంతా కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించింది.
విధుల్లో ఉన్న పోలీసులంతా వైఎస్ జగన్ భద్రత కోసం కాకుండా వైఎస్సార్‌సీపీ శ్రేణులు, ప్రజలు జగన్ వద్దకు వెళ్లకుండా నిలువరించడానికే పని చేసినట్లు స్పష్టంగా కనిపించింది. ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్ సమీపంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలపై పోలీసులు లాఠీలు ఝుళిపించి భయానక వాతావరణం కల్పించారు. నెల్లూరు నగరంలో పలువురు వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్‌లు చేశారు. జిల్లా మైనార్టీ అధ్యక్షుడు సిద్దిఖ్, 42వ డివిజన్ అధ్యక్షుడు షేక్ అబ్దుల్ మస్తాన్, కుక్కలగుంటకు చెందిన ఆవుల నాగేంద్రను చిన్నబజారు పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు.
పలువురికి సెక్షన్ 170 బీఎన్‌ఎస్‌ఎస్ కింద నోటీసులు జారీ చేశారు. పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినప్పటికీ తుదకు వైఎస్ జగన్ కేంద్ర కారాగారానికి వచ్చే సమయానికి వేల మంది అభిమానులు అక్కడికి చేరుకుని జై జగన్... అంటూ నినాదాలు చేశారు. అక్కడి నుంచి జగన్ పర్యటన ముగిసే వరకు కనుచూపు మేర జనం పోటెత్తారు. ఆంక్షలను లెక్క చేయక జగన్ పర్యటనలో పాల్గొని అభిమానాన్ని చాటుకున్నారు.