
సాక్షి, అమరావతి: కొందరి తీరు వల్ల పోలవరం ప్రాజెక్టు పనులు ఆలస్యమయ్యాయని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. పోలవరం ప్రాజెక్టుతో తనకు మానసికంగా అనుబంధం ఉందని చెప్పారు. గతంలో తాను జల వనరుల శాఖ మంత్రిగా ఉండగా, పోలవరం ప్రాజెక్టు పనుల విషయం ఏమైందనేది ఆయన గుర్తు చేసుకున్నారు. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా గురువారం నిర్వహించిన 51 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టు పనులకు ఎదురైన సమస్యలను ఆయన పరోక్షంగా ప్రస్తావించడం ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో తాను ఎప్పుడు విజయవాడ వచ్చినా పోలవరం ప్రాజెక్టు పనులపై సమీక్షించేవాడినన్నారు. ‘కొందరు సంక్షోభాలను అవకాశాలుగా మలచుకుంటారు.. కానీ పోలవరం ప్రాజెక్టు విషయంలో అప్పట్లో కొందరు అవకాశాలను సంక్షోభాలు గా చేసుకున్నారు’ అని వ్యాఖ్యానించారు. అప్ప ట్లో కాంట్రాక్టరుపెద్ద సమస్యగా మారాడని చెబు తూ.. దాన్ని చాలా కష్టమైన వ్యవహారంగా మా ర్చారన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో సమస్యలన్నీ సమసి పోయాయని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పనులు పునఃప్రారంభం కావడంతోపాటు 80 శాతం పనులు పూర్తి కావడం సంతోషకరమన్నారు. ఆ ప్రాజెక్టు 100 శాతం విజయవంతం అవుతుందన్నారు. అందుకు కేంద్రం పూర్తి సహకారం ఇస్తుందని చెప్పారు.
రాష్ట్రంలో సమర్థ ప్రభుత్వం
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమర్థ నేతృత్వం లో ఏపీ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని కేంద్ర మంత్రి ప్రశంసలు కురిపించారు. దేశంలో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఏపీ అగ్రస్థానంలో ఉందని స్పష్టం చేశారు. ఏపీ విజన్ దేశానికి అతి ముఖ్యమని చెప్పారు. అభివృద్ధి చేయాలనే బలమైన రాజకీయ నాయకత్వం ఉంటేనే కొత్త ప్రాజెక్టులు, మౌలిక వసతులు సాధించగలమన్నారు. సరైన విజన్, పారదర్శకత, సత్వర నిర్ణయాలు, సరైన కార్యాచరణ, అవినీతి లేని వ్యవస్థలు చాలా ముఖ్యమన్నారు. అందుకే అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉంటున్న ఏపీ దేశానికి అతి ముఖ్యమైన రాష్ట్రమని చెప్పా రు. జీడీపీ, తలసరి ఆదాయం పెరుగుదలతో ఏపీ రికార్డు చాలా బాగుందన్నారు. ఏపీ గొప్పగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలుస్తుందని తనకు సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు.
విశాఖపట్నం–భీమిలి–భోగాపురం బీచ్ కారిడార్‌కు ఆమోదం
ఏపీలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన ప్రతిపాదనలు అన్నింటినీ ఆమోదిస్తున్నామని కేంద్ర మంత్రి గడ్కరీ తెలిపారు. ఆయన కోరినట్టుగా విశాఖపట్నం–భీమిలి–భోగాపురం బీచ్ కారిడార్‌కు వెంటనే ఆమోదం తెలుపుతున్నామని స్పష్టం చేశారు. 30 ఆర్వోబీలు ఇస్తున్నామని ప్రకటించారు. విజయవాడ తూర్పు బైపాస్ రింగ్ రోడ్డు మంజూరు చేస్తున్నామని చెప్పారు. భూ సేకరణతోపాటు 50 శాతం ప్రాజెక్టు వ్యయాన్ని భరించాలని నిబంధనలు చెబుతున్నప్పటికీ సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి మేరకు అందులో మినహాయింపులు ఇస్తున్నామని తెలిపారు. భూ సేకరణతోపాటు ఆ ప్రాజెక్టు పనుల వరకు స్టీలు, సిమెంట్ మీద జీఎస్టీ మినహాయింపు, రాయల్టీ ఫ్రీ అగ్రిగేట్ మెటీరియల్ ఇస్తే చాలన్నారు. ప్రాజెక్టు వ్యయాన్ని కేంద్రమే పూర్తిగా భరించి విజయవాడ తూర్పు బైపాస్ రింగ్‌రోడ్డును పూర్తి చేస్తుందని వెల్లడించారు. ప్రభుత్వ భూమి ఇస్తే.. లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.