దేవుడా ఎంతపని చేశావయ్యా..! మిన్నంటిన రోదనలు

Nine People killed Bus Overturned Valley At Bhakarapeta Saturday  - Sakshi

దేవుడా ఎంత పని చేశావయ్యా.. సంతోషంగా శుభకార్యానికి వెళ్తున్న వారిని ఎందుకింత నిర్దయగా కబళించావు.. మేము ఏం పాపం చేశామయ్యా.. ఇంత విషాదాన్ని మా కుటుంబాలకు మిగిల్చావు’ అంటూ బస్సు ప్రమాద బాధితులు రోదించిన తీరు అందరినీ కలచివేసింది. తిరుపతి సమీపంలోని భాకరాపేట వద్ద లోయలో బస్సు బోల్తాపడిన ఘటనలో చనిపోయిన వారి మృతదేహాలను అంబులెన్సుల్లో ధర్మవరానికి తీసుకురాగానే బాధితుల రోదనలు మిన్నంటాయి. 
సాక్షి, ధర్మవరం టౌన్‌/ అర్బన్‌/ తనకల్లు/ కదిరిటౌన్‌/ పుట్టపర్తి: ధర్మవరంలోని ప్రముఖ పట్టు చీరల వ్యాపారి మలిశెట్టి మురళి కుమారుడు వేణు వివాహ నిశ్చితార్థ వేడుకలకు తిరుచానూరులోని రాధాకృష్ణ కల్యాణమండపానికి బయల్దేరిన వారిని బస్సు ప్రమాద రూపంలో మృత్యువు వెంటాడింది. భాకరాపేట వద్ద లోయలో శనివారం రాత్రి బస్సు బోల్తాపడిన ఘటనలో అక్కడికక్కడే ఎనిమిది మంది మృతి చెందగా, ఆదివారం సాయంత్రం మరొకరు చనిపోయారు. దీంతో మృతి చెందిన వారి సంఖ్య తొమ్మిదికి చేరుకుంది.

మృతుల్లో ధర్మవరానికి చెందిన మలిశెట్టి మురళి (45), తమ్ముడు మలిశెట్టి గణేష్‌ (42), మరో తమ్ముడు శివ భార్య కాంతమ్మ (38), బంధువు, పెళ్లిళ్ల పేరయ్య అయిన మలిశెట్టి వెంగప్ప (75), భార్య నాగలక్ష్మి (60), తనకల్లు మండలం కొక్కంటి క్రాస్‌కు చెందిన జింకా చంద్ర కుమార్తె చందన (10), ధర్మవరానికి చెందిన బస్సు డ్రైవర్‌ నబీరసూల్‌ (42), కదిరికి చెందిన క్లీనర్‌ షకీల్‌ (22), మలిశెట్టి మురళి స్నేహితుడు, విలేకరి అయిన బుక్కపట్నం మండలం మారాలకు చెందిన ఆదినారాయణరెడ్డి (45) ఉన్నారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు, మరో కుటుంబంలో దంపతులు ప్రాణాలు కోల్పోవడం తీరని విషాదం మిగి  ల్చింది. గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారు 33 మంది ఉన్నారు. 

కన్నీటి వీడ్కోలు.. 
బస్సు ప్రమాద మృతుల్లో ఎక్కువమంది ధర్మవరానికి చెందిన ఒకే కుటుంబానికి చెందినవారు ఉన్నారు. తిరుపతి ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మలిశెట్టి మురళి, తమ్ముడు గణేష్, మరో తమ్ముడు శివ భార్య కాంతమ్మ మృతదేహాలను ఆదివారం అంబులెన్స్‌లో కొత్తపేట ఉషోదయ స్కూల్‌ వద్దకు తీసుకొచ్చారు. అప్పటికే అక్కడకు చేరుకున్న బంధువులు, కుటుంబ సభ్యులు, పట్టణ ప్రజలు బోరున విలపించారు.

మృతదేహాలను ఎమ్మెల్యే కేతిరెడ్డి  వెంకటరామిరెడ్డి సోదరుడు, వైఎస్సార్‌సీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకటకృష్ణారెడ్డి, ఏపీ ఔట్‌సోర్సింగ్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ వడ్డే బాలాజీ, దేవరకొండ రమేష్, గుండా ఈశ్వరయ్య సందర్శించి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గరుడంపల్లి సమీపాన మలిశెట్టి మురళి పొలంలో నిర్వహించిన ముగ్గురి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మలిశెట్టి వెంగప్పకు హిందూ శ్మశాన వాటికలోను, డ్రైవర్‌ నబీరసూల్‌కు ముస్లిం శ్మశానవాటికలో అంత్యక్రియలు జరిగాయి. కదిరిలో క్లీనర్‌ షకీల్, బుక్కపట్నం మండలం మారాలలో విలేకరి ఆదినారాయణరెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. చిన్నారి చందనకు తనకల్లు మండలం కొక్కంటి క్రాస్‌ సమీపంలో   అంత్యక్రియలు పూర్తి చేశారు.  

మృత్యువులోనూ వీడని బంధం.. 
ధర్మవరం పట్టణానికి చెందిన మలిశెట్టి మురళి, తమ్ముడు గణేష్, మరో తమ్ముడు శివ భార్య కాంతమ్మ బస్సు ప్రమాదంలో మృతిచెందారు. ముగ్గురు అన్నదమ్ములూ పట్టుచీరల వ్యాపారం చేసుకుంటూ జీవించేవారు. కానీ బస్సు ప్రమాదం ఆ ఇంట విషాదాన్ని నింపింది. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో కుటుంబ సభ్యుల బాధ వర్ణనాతీతంగా మారింది. మురళి కుమారుడు వేణు (పెళ్లికొడుకు), భార్య లలితమ్మ, తమ్ముడు గణేష్‌ భార్య భైరవి తిరుపతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మురళి మృతితో అన్నదమ్ముల కుటుంబాలు పెద్ద దిక్కు కోల్పోయినట్లయ్యింది. 

నీ వెంటే నేనూ.. 
ధర్మవరానికి చెందిన మలిశెట్టి వెంగప్ప శనివారం రాత్రి బస్సు ప్రమాదంలో మృతిచెందగా, గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతని భార్య నాగలక్ష్మి (60) ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచింది. భర్త మృతి చెందిన విషయం కూడా ఆమెకు తెలియకనే కన్నుమూసింది.  

అర్ధంతరంగా ముగిసిన విలేకరి జీవితం.. 
బుక్కపట్నం మండలం మారాల గ్రామానికి చెందిన ఆదినారాయణరెడ్డి బస్సు ప్రమాదంలో మృతిచెందారు. ఆదినారాయణరెడ్డి 20 ఏళ్లుగా పత్రికారంగంలో విలేకరిగా పనిచేస్తున్నారు. మలిశెట్టి మురళి స్నేహితుడు కావడంతో ఆయన కుమారుడి నిశ్చితార్థానికి ఆదినారాయణరెడ్డి బస్సులో వెళ్లారు. అలా వెళ్లిన విలేకరి అర్ధంతరంగా తనువు చాలించాడు. ఈయనకు భార్య గౌతమి, కుమార్తె మనీషా, కుమారుడు గణేష్‌రెడ్డి ఉన్నారు.  

అయ్యో ‘పాపం'.. 
ధర్మవరం కొత్తపేట నివాసి జింకా చంద్ర కుమార్తె జింకా చందన (10) స్థానిక మున్సిపల్‌ స్కూల్‌లో నాలుగో తరగతి చదువుతోంది. బంధువుల నిశ్చితార్థానికి వెళ్లి బస్సు ప్రమాదంలో చందన మృతి చెందింది. తండ్రి చంద్ర తిరుపతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వీరి సొంతూరు తనకల్లు మండలం కొక్కంటి క్రాస్‌. 

ఛిద్రమైన పేదల బతుకులు 
బస్సు ప్రమాదంలో మృతి చెందిన డ్రైవర్‌ నబీరసూల్, క్లీనర్‌ షకీల్‌ నిరుపేదలు. ఈ ప్రమాదంతో రెండు కుటుంబాలు ఛిద్రమయ్యాయి. కదిరికి చెందిన క్లీనర్‌ షకీల్‌ అవివాహితుడు. నార్పల మండలం గూగూడుకు చెందిన డ్రైవర్‌ నబీరసూల్‌ 12 ఏళ్ల క్రితం పొట్టకూటి కోసం తాడిపత్రికి వెళ్లాడు. అక్కడి నుంచి ధర్మవరం చేరుకుని డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఊహించని విధంగా మృత్యువాత పడటంతో ఇతని భార్య, ఇద్దరు పిల్లల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఇతని సోదరుడు హైదర్‌వలి కూడా లారీడ్రైవర్‌గా వెళ్తూ 16 క్రితం ముదిగుబ్బ వద్ద రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు.   

(చదవండి: లోయలో పడ్డ బస్సు.. ప్రమాదానికి కారణాలివే..!)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top