గతేడాది క్లీన్ టాయిలెట్ పిక్చర్ ఛాలెంజ్ ప్రారంభించిన ఎన్‌హెచ్‌ఏఐ
మార్పు రాకపోవడంతో మరింత కఠినంగా కొత్త విధానం
సాక్షి, అమరావతి : జాతీయ రహదారులపై వాహనదారుల నుంచి టోల్ వసూలు చేస్తున్న టోల్‌ప్లాజాల్లో టాయిలెట్ల అపరిశుభ్రతపై భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) మరింత కఠినంగా వ్యవహరించనుంది. ఈ మేరకు పర్యవేక్షణ, అమలు వ్యవస్థను మరింత కఠినతరం చేస్తూ సోమవారం కొత్త విధానాన్ని ప్రకటించింది. ప్లాజాల వద్ద టాయిలెట్ల అపరిశుభ్రత, నిర్వహణలో నిర్లక్ష్యం, టోల్ వసూలు కేంద్రాలు, పరిసర ప్రాంతాలు, సూచిక బోర్డుల నిర్వహణలో లోపాలపై ఇకపై నిరంతర పర్యవేక్షణ చేపట్టనుంది. నిబంధనలు పాటించని, పదే పదే లోపాలను సరిదిద్దని టోల్ ఫీజు వసూలు సంస్థలను 15 రోజులపాటు, లోపాలను సరిచేసే వరకు ఎన్‌హెచ్‌ఏఐ టెండర్లలో పాల్గొనకుండా నిషేధించనుంది.
జాతీయ రహదారులపై ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఎన్‌హెచ్‌ఏఐ 2025లో ‘క్లీన్ టాయిలెట్ పిక్చర్ ఛాలెంజ్’ను ప్రారంభించింది. టోల్ ప్లాజాల వద్ద అపరిశుభ్రంగా ఉన్న టాయిలెట్లను గుర్తించిన ప్రయాణికులు ‘రాజ్‌మార్గ్ యాత్ర’ మొబైల్ యాప్ ద్వారా స్పష్టమైన, జియో ట్యాగ్ చేసిన, సమయ వివరాలున్న ఫొటోలను అప్‌లోడ్ చేయవచ్చు. నిబంధనలకు అనుగుణంగా ఫిర్యాదు చేసిన అర్హమైన ప్రతి వాహన రిజిస్ట్రేషన్ నంబర్‌కు రూ.1,000 విలువైన ఫాస్టాగ్ రీచార్జ్‌ను బహుమతిగా అందిస్తారు.
ప్రజల భాగస్వామ్యంతో లోపాలను సరిదిద్దే ప్రయత్నం..
గతేడాది క్లీన్ టాయిలెట్ పిక్చర్ ఛాలెంజ్ ప్రారంభించినప్పటికీ టోల్‌ప్లాజాల వద్ద లోపాలు సరిదిద్దలేదనే ఫిర్యాదులు రావడంతో మరింత కఠినంగా వ్యవహరించాలని ఎన్‌హెచ్‌ఏఐ నిర్ణయం తీసుకుని దానికి కొనసాగింపుగా కొత్త విధానం అమలులోకి తెచ్చింది. ప్రజల భాగస్వామ్యం, క్రమం తప్పని తనిఖీలు, డిజిటల్ ఆధారాల నమోదు, నిర్ణీత గడువులో లోపాల పరిష్కారం ద్వారా జాతీయ రహదారులపై పారిశుద్ధ్య ప్రమాణాలను మెరుగుపరచడంతోపాటు, నిర్వహణ సంస్థల బాధ్యతను నిర్ధారించడమే ఈ కొత్త విధానం లక్ష్యమని ఎన్‌హెచ్‌ఏఐ పేర్కొంది.
కొత్త విధానంలో భాగంగా ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు కనీసం వారానికి ఒకసారి టోల్ ప్లాజాల్లోని టాయిలెట్లు, ఇతర సదుపాయాలను తనిఖీ చేయాలి. ఏవైనా లోపాలు గుర్తిస్తే టోల్ ఫీజు వసూలు సంస్థకు షోకాజ్ నోటీసు జారీ చేసి, నిర్ణీత గడువులోగా వాటిని సరిచేయాలని ఆదేశించాలి. లోపాలకు సంబంధించిన నోటీసులతోపాటు తేదీతో కూడిన ఫొటోలను ఎన్‌హెచ్‌ఏఐ డేటా లేక్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తారు. సంబంధిత సంస్థ కూడా తన వివరణతోపాటు లోపాలను సరిచేసినట్లు నిరూపించే ఫొటోలను పోర్టల్‌లో సమర్పించాలి.
క్షేత్రస్థాయి అధికారులు ఈ ప్రక్రియను పర్యవేక్షించి, నిర్దేశిత గడువులో సమస్యలు పరిష్కారమయ్యేలా చూడాలి. టోల్ ప్లాజాల నిర్వహణలో పదేపదే నిర్లక్ష్యం వహించే సంస్థలపై ఎన్‌హెచ్‌ఏఐ కఠిన చర్యలు తీసుకోనుంది. ఒక సంస్థ నిర్వహిస్తున్న మొత్తం టోల్ ప్లాజాల సంఖ్యతో పోలిస్తే, పరిష్కరించని లోపాలకు సంబంధించి జారీ చేసిన నోటీసుల సంఖ్య 10 శాతానికి చేరినా, దాటినా ఆ సంస్థను పనితీరు సరిగా లేని సంస్థగా ప్రకటిస్తారు. 15 రోజులపాటు టెండర్‌లో పాల్గొనకుండా నిషేధిస్తారు.


