Bangalore - Vijayawada Greenfield Highway: విజయవాడ - బెంగళూరు మధ్య గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే

NHAI Preparing DPR for Bengaluru Vijayawada National Highway - Sakshi

విజయవాడ – బెంగళూరు మధ్య నాలుగులేన్ల రహదారి 

కోడూరు నుంచి ప్రకాశం జిల్లా ముప్పవరం వరకు నిర్మాణం 

శ్రీసత్యసాయి జిల్లాలో 75 కిలోమీటర్లు మేర గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే  

జిల్లాలో 2 వేల ఎకరాల భూసేకరణకు సిద్ధం 

త్వరలోనే గ్రామాల సర్వే నంబర్లతో 3–ఏ నోటిఫికేషన్‌

నూతన జిల్లా శ్రీసత్యసాయి నుంచి ఇటు విజయవాడకు, అటు పొరుగున ఉన్న కర్ణాటక రాజధాని బెంగళూరుకు వెళ్లేందుకు ‘మార్గం’ సుగమమైంది. బెంగళూరు, కడప, విజయవాడ (బీకేవీ) ఎక్స్‌ప్రెస్‌ వేకు ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో దూరాభారం తగ్గనుంది. ప్రస్తుతం విజయవాడకు చేరాలంటే దాదాపు 8 గంటల ప్రయాణం చేయాల్సి వస్తోంది. గ్రీన్‌ ఫీల్డ్‌ హైవేపై గంటకు 120 కి.మీ. వేగంతో వెళ్లేలా నాలుగు వరుసల రహదారి నిర్మించనుండటంతో నాలుగు నుంచి ఐదు గంటల్లోనే విజయవాడ చేరుకునే అవకాశం ఉంటుంది.
 
సాక్షి, పుట్టపర్తి: బెంగళూరు, కడప, విజయవాడను కలుపుతూ కొత్తగా జాతీయ రహదారి ఏర్పాటవుతోంది. జిల్లాలో 75 కి.మీ మేర విస్తరించనున్న ఈ రహదారిపై 120 కిలోమీటర్ల వేగంతో వాహనాలు ప్రయాణించేలా నిర్మించనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం కోడూరు నుంచి ప్రకాశం జిల్లా ముప్పవరం వరకు నాలుగు లేన్ల గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వేగా నిర్మించనున్నారు. దీంతో ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా సుఖవంతంగా సాగేలా నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. శ్రీసత్యసాయి జిల్లాలోని చిలమత్తూరు, గోరంట్ల, ఓడీచెరువు, నల్లమాడ, ముదిగుబ్బ , కదిరి మండలాల్లో సాగే గ్రీన్‌ఫీల్డ్‌ హైవే కోసం భూసేకరణకు సంబంధించి అధికారులు మార్కింగ్‌ చేస్తున్నారు. జిల్లాలో మొత్తంగా 2 వేల ఎకరాలు సేకరించనున్నారు. 

కోడూరు నుంచి ప్రారంభం.. 
చిలమత్తూరు మండలం కోడూరు వద్ద బెంగళూరు– హైదరాబాద్‌ జాతీయ రహదారి –44 నుంచి నాలుగు లేన్ల గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే మొదలవుతుంది. అక్కడి నుంచి వైఎస్సార్‌ జిల్లా పులివెందుల సమీపంలోని వీరపునాయునిపల్లె, ఎర్రగుంట్ల, కమలాపురం, మైదుకూరు, పోరుమామిళ్ల, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సీతారాంపురం, ప్రకాశం జిల్లా సీఎస్‌పురం మీదుగా పామూరు, కనిగిరి, చీమకుర్తి, పెద్ద ఉయ్యాలవాడ, బొద్దికూరపాడు, నాగంబొట్లపాళెం, కంకుపాడు, అద్దంకి, ముప్పవరం వరకు రోడ్డు నిర్మాణం సాగనుంది.  

జిల్లాలోని ఎనిమిది మండలాల మీదుగా..
జిల్లాలో 75 కిలోమీటర్ల మేర గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే విస్తరించనుంది. చిలమత్తూరు మండలం కోడూరు వద్ద ఎన్‌హెచ్‌–44 వద్ద మొదలై చాగిలేరు, గోరంట్ల మండలంలోని బూదిలి, జక్కసముద్రం, పుట్టపర్తి మండలంలోని అమగొండపాళ్యం, సాతర్లపల్లి, ఓడీచెరువు మండలం కొండకమర్ల, నల్లమాడ మండలం వేళ్లమద్ది, కదిరి మండలంలోని పట్నం, తలుపుల మండలంలోని లక్కసముద్రం, ముదిగుబ్బ మండలంలోని దేవరగుడి వరకు రోడ్డు నిర్మాణం జరగనుంది.  

భూసేకరణ ఇలా... 
జాతీయ రహదారి నిర్మాణానికి 90 మీటర్ల వెడల్పున భూమిని సేకరించనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో 2 వేల ఎకరాల భూసేకరణకు త్వరలోనే 3–ఏ నోటిఫికేషన్‌ ఇవ్వనున్నారు. భూసేకరణలో భాగంగా ప్రభుత్వ, అటవీ, పట్టా భూముల వారీగా వివరాలు సిద్ధం చేస్తున్నారు. డీపీఆర్‌ ప్రకారం ఏయే రెవెన్యూ గ్రామాల మీదుగా ఈ రోడ్డు వెళ్తుందనే వివరాలతో నోటిఫికేషన్‌ ఇవ్వనున్నారు.  

పెరిగిన భూమి విలువ... 
నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) బీకేవీ ఎక్స్‌ప్రెస్‌ వే కోసం సర్వే ప్రారంభించింది. భూసేకరణకు సంబంధించిన రాళ్లు ఏర్పాటు చేసింది. దీంతో ఆయా ప్రాంతాల్లో భూముల విలువ బాగా పెరిగింది. భూముల క్రయ, విక్రయాలు ఊపందుకున్నాయి.  ఈ రహదారి పూర్తయితే విజయవాడ – బెంVýæళూరు మధ్య ప్రయాణం సుఖవంతంగా సాగనుంది.

రహదారిపైకి వెళ్లేందుకు 13 చోట్లే అనుమతి..  
బీకేవీ ఎక్స్‌ప్రెస్‌ వే పైకి వెళ్లేందుకు వాహనదారులు అన్ని చోట్ల అవకాశం ఉండదు. వాహనాల స్పీడ్, భద్రతా ప్రమాణాల మేరకు... మూడు జిల్లాల్లో కేవలం 13 చోట్ల మాత్రమే రహదారిలోకి వెళ్లేందుకు, బయటకు వచ్చేందుకు అవకాశం కల్పిస్తూ రూపకల్పన చేశారు.  

డీపీఆర్‌ రూపకల్పన 
విజయవాడ– బెంగళూరు జాతీయ రహదారికి సంబంధించిన డిటైల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ (డీ.పీ.ఆర్‌)రూపకల్పనలో ఉన్నాం. త్వరలోనే భూసేకరణ పూర్తవుతుంది. 
–రామకృష్ణ , ప్రాజెక్డ్‌ డైరెక్టర్, ఎన్‌హెచ్‌ఏఐ   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top