మహానాడులో జగన్నామస్మరణ 

News from Telugu Desam Party Mahanadu - Sakshi

అడుగడుగునా సీఎంపై ఆక్రోశం.. ప్రభుత్వంపై అక్కసు 

తీర్మానాలన్నీ సీఎంకు వ్యతిరేకంగానే.. ఎజెండా మొత్తం జగనే  

ఆద్యంతం ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యుల పాత్ర నిల్‌

రాజమహేంద్రవరం నుంచి సాక్షి ప్రతినిధి/సాక్షి, రాజమహేంద్రవరం:  తెలుగుదేశం పార్టీ మహానాడు ఆసాంతం జగన్నామస్మరణతో మార్మోగిపోయింది. ఉదయం సమావేశం ప్రారంభమైంది మొదలు రాత్రి ముగిసే వరకు ప్రతి నిమిషం సీఎం పేరు తలుచుకోకుండా ఏ నాయకుడూ తన ప్రసంగాన్ని ముగించలేదు. తిట్లు, శాపనార్థాలు, ఆక్రోశాలు, ఆగ్రహావేశాలు, విమర్శలు, ఆరోపణలతో విరుచుకుపడ్డారు.

ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సహా నేతలంతా ఇదే ఒరవడి కొనసాగించారు. అసలు మహానాడు నిర్వహిస్తోంది సీఎం జగన్‌ను తిట్టడానికే అన్నట్లు వ్యవహరించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి నివేదిక పేరుతో వర్ల రామయ్య పార్టీ కార్యక్రమాల గురించి చెప్పడం కంటే జగన్‌ను తిట్టడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. రెండు తీర్మానాలు మినహా మిగిలిన ఏపీకి చెందిన తీర్మానాలన్నీ సీఎం జగన్‌ను లక్ష్యంగా చేసుకుని పెట్టినవే కావడం గమనార్హం.  

ఎన్టీఆర్‌ కుటుంబానికి అవమానం  
మరోవైపు ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకల పేరుతో నిర్వహిస్తున్న మహానాడులో ఆయన కుటుంబీకుల ఎవరికీ ప్రాధాన్యం లేకుండా పోయింది. చంద్రబాబు, లోకేశ్‌లకే అత్యంత ప్రాధాన్యం ఉండేలా కార్యక్రమాలు రూపొందించారు. ప్రధాన బ్యానర్‌లో నందమూరి బాలకృష్ణ ఫొటో ముద్రించక పోవడంపై పలువురు నేతలు చర్చించుకున్నారు.

ప్రకటనలు, కరపత్రాలు.. అన్నింటా చంద్రబాబు, లోకేశ్‌కే ప్రాధాన్యం కనిపించింది. తద్వారా టీడీపీలో ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులకు ప్రాధాన్యం ఉండదనే రీతిలో మహానాడు నిర్వహించారు. కాగా, మహానాడుకు జన స్పందన కరువైంది. ఆశించిన మేరకు జనం రాకపోవడంతో సభ వెలవెలబోయింది.  చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో గ్యాలరీల్లో జనం లేకపోవడంతో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. 

‘పార్టీ లేదు.. బొక్కా లేదు..’ ప్రస్తావన   
మహానాడు ప్రాంగణంలో ఆ పార్టీకి చెందిన నాయకుడు ఆకుల వెంకటేశ్వరరావు కలక­లం సృష్టించారు. గతంలో తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా ఒక హోటల్‌లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, వెంకటేశ్వరరావు మధ్య జరిగిన సంభాషణలో ‘పార్టీ లేదు.. బొక్కా లేద’ని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించిన విషయాన్ని పలువురు గుర్తు చేసుకున్నారు.

అదే వెంకటేశ్వరరావు.. మహానాడుకు హాజరై కార్యకర్తల మధ్య నుంచి లోకేశ్‌ను పిలిచి తిట్టడం చర్చనీయాంశమైంది. కొందరు కార్యకర్తలు ఆయన్ను అడ్డుకునే ప్రయత్నం చేయగా.. ‘నా జీవితం నాశనమైంది. మీవి కూడా అలా కాకుండా చూసుకోండి’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. తన 400 గజాల భూమిని కేఎల్‌ నారాయణ ఆక్రమించాడని, న్యాయం చేయమని అడిగితే లోకేశ్‌ పట్టించుకోలేదన్నాడు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top