వైజాగ్‌ స్టీల్‌ నయా బ్రాండింగ్‌

New branding of Vizag Steel Andhra Pradesh - Sakshi

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కొత్త సిరీస్‌ 

నకిలీలకు ఆస్కారం లేకుండా అన్ని ఉత్పత్తులపైనా ముద్రణ 

ఉత్పత్తి గ్రేడ్‌ కూడా తెలిసేలా కొత్త పరిజ్ఞానంతో న్యూ బ్రాండింగ్‌ 

ఉక్కు నగరం (విశాఖపట్నం): ఉత్పత్తుల విక్రయంలో బ్రాండింగ్‌దే ప్రధాన భూమిక. వివిధ కంపెనీలు ఉత్పత్తి చేసే వస్తువులకు ఉండే బ్రాండ్‌ ఇమేజ్‌ను చూసి వినియోగదారులు ఆయా వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. దేశీయ ఉక్కు పరిశ్రమలో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ తనదైన టీఎంటీ పేరిట ప్రత్యేక బ్రాండింగ్‌ కలిగి ఉంది. తాజాగా ఈ ప్లాంట్‌ కొత్త బ్రాండింగ్‌కు శ్రీకారం చుట్టింది.

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వైజాగ్‌ టీఎంటీ 500డి, వైజాగ్‌ టీఎంటీ హెచ్‌సీఆర్‌డీ బ్రాండింగ్‌ స్థానంలో కొత్తగా వైజాగ్‌ టీఎంటీ ఎఫ్‌ఈ 550డి, 500డి 6686 59, 8568 66 అనే బ్రాండ్‌ నంబర్లు ముద్రిస్తోంది. 16 ఎంఎం నుంచి 36 ఎంఎం వరకు ఉన్న సైజు ఊచలు, రైల్వే సంస్థకు పంపే ఉత్పత్తులపై హెచ్‌సీఆర్‌డీ (హై కరోజన్‌ రెసిస్టెంట్‌ డీటైల్‌)ను ముద్రిస్తున్నారు.  

ఎలా మొదలైందంటే.. 
విశాఖ ఉక్కు ఉత్పత్తులను తొలినాళ్లలో ఇతర కంపెనీల ఉత్పత్తుల మాదిరిగానే ఎలాంటి గుర్తిం పు మార్కులు లేకుండా విక్రయించేవారు. దీంతో విశాఖ ఉక్కును గుర్తించడం కష్టంగా ఉండేది. ఆ తరువాత స్టీల్‌ ప్లాంట్‌ అధికారులు రీబార్స్‌ మధ్యలో ఆంగ్ల అక్షరం ‘వి’ ఉండేలా చేశారు. అది స్పష్టంగా కనిపించేది కాదు. అనంతరం ఉత్పత్తులపై ప్రారంభంలో బ్రాండింగ్‌ కోసం పెద్ద సైజు ‘నంబర్‌ పంచ్‌’ అనే సాధనంతో వైజాగ్‌ స్టీల్‌ అని వేసేవారు. ఇది చాలా శ్రమతో కూడుకున్న పని. అన్ని ఉత్పత్తుల మీద ఇలా వేయాలంటే ఎక్కువ శ్రమ, సమయం పట్టేవి. 2002 తర్వాత నేరుగా ఉత్పత్తి మీద ముద్రపడేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.

స్టీల్‌ ప్లాంట్‌లో రోలింగ్‌ మిల్స్‌ విభాగాలైన లైట్‌ అండ్‌ మీడియం మర్చంట్‌ మిల్‌ (ఎల్‌ఎంఎంఎం), మీడియం మర్చంట్‌ అండ్‌ స్ట్రక్చరల్‌ మిల్‌ (ఎంఎంఎస్‌ఎం), వైర్‌ రాడ్‌ మిల్స్‌ (డబ్ల్యూఆర్‌ఎం), స్పెషల్‌ బార్‌ మిల్‌ (ఎస్‌బీఎం), వైర్‌ రాడ్‌ మిల్‌ (డబ్ల్యూఆర్‌ఎం)–2, స్ట్రక్చరల్‌ మిల్‌ (ఎస్టీఎం)లలో రీబార్స్, రౌండ్స్, ఏంగిల్స్, చానల్స్, బీమ్స్‌ తదితర వస్తువులను ఉత్పత్తి చేస్తారు. నిర్ణీత పరిమాణంలో ఆ రోల్స్‌ను సిద్ధం చేసిన తర్వాత దానిపై విశాఖ ఉక్కు ప్రతిష్టగా నిలిచే వైజాగ్‌ స్టీల్‌ టీఎంటీ (ధర్మో మెకానికల్‌ ట్రీట్‌మెంట్‌) ముద్రను వేస్తారు.  

నకిలీలకు చెక్‌ 
జాతీయ, అంతర్జాతీయ విపణిలో విశాఖ ఉక్కు ఉత్పత్తులకు ఉన్న గిరాకీ నేపథ్యంలో తరచూ నకిలీ ఉత్పత్తులు తయారవుతున్నట్టు విశాఖ స్టీల్స్‌ యాజమాన్యం గుర్తించింది. ఈ దృష్ట్యా డూప్లికేటింగ్‌ జరగకుండా బ్రాండింగ్‌ చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగా ఇప్పుడు ఆ ఉత్పత్తి గ్రేడ్‌ను కూడా తెలిపేలా సాంకేతిక పరిజ్ఞానంతో ఈ బ్రాండింగ్‌ చేస్తున్నారు. రోలింగ్‌ మిల్స్‌లో ఆయా ఉత్పత్తులు రోల్‌ అవుతున్న క్రమంలోనే ఆ ఉత్పత్తిపై ఇది విశాఖ ఉక్కు ఉత్పత్తి అని తెలిసేలా బ్రాండింగ్‌ చేస్తున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top