
సాక్షి, నెల్లూరు: పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ ప్రతీకార చర్యల నేపథ్యంలో పహల్గాం బాధిత మధుసూదన్ కుటుంబ సభ్యులు స్పందించారు. ఉగ్రవాదులు అనేవారు లేకుండా భారత్ మరింత గట్టిగా బుద్ధి చెప్పాలి అని వ్యాఖ్యానించారు. అలాగే, ఉగ్రవాదుల చేతిలో మరెవరో ప్రాణాలు కోల్పోకుండా భారత్ చర్యలు తీసుకోవాలని అన్నారు.
భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై నెల్లూరుకు చెందిన మధుసూదన్ రావు కుటుంబ సభ్యులు స్పందించారు. ఈ సందర్భంగా మధుసూదన్ రావు తల్లి పద్మావతి మాట్లాడుతూ..‘ఎన్ని యుద్దాలు చేసినా.. నా కొడుకును తీసుకురాలేరు. నా కడుపు కోత ఏ తల్లి పడకుండా ఉగ్రవాదులను అంతం చేయాలి. నా కొడుకు అమాయకుడు, మా కుటుంబానికి ఉగ్రవాదులు తీరని ద్రోహం చేశారు. ఉగ్రవాదుల చేతిలో మరెవరో ప్రాణాలు కోల్పోకుండా భారత్ చర్యలు తీసుకోవాలి అని అన్నారు.
మధుసూదన్ సోదరి విజయలక్ష్మి మాట్లాడుతూ..‘పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత దాడులు చేయడం మా కుటుంబానికి ఊరట కలిగిస్తోంది. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న అన్నని కోల్పోవడం మా కుటుంబానికి తీరని లోటు. ఇప్పటికి కూడా ఆ షాక్ నుంచి మేము తేరుకోలేకపోతున్నాం అని ఆవేదన వ్యక్తం చేశారు.

మధుసూదన్ మామ వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ..‘ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు భారత్ మరింత పటిష్ట చర్యలు తీసుకోవాలి. అమాయక టూరిస్టులను పొట్టనపెట్టుకున్న వారిని గట్టిగా శిక్షించాలి అని డిమాండ్ చేశారు.