తాతయ్య ప్రోత్సాహమే నడిపించింది | Nazeeruddin Exclusive Interview with sakshi | Sakshi
Sakshi News home page

తాతయ్య ప్రోత్సాహమే నడిపించింది

Sep 30 2024 4:58 AM | Updated on Sep 30 2024 4:58 AM

Nazeeruddin Exclusive Interview with sakshi

తెలుగు ఇండియన్‌ ఐడల్‌–3 విజేతగా నిలిచిన మెకానిక్‌ కొడుకు

తాతయ్య వద్ద నేర్చుకున్న సరిగమలే ఆధారం

15 వేల మందితో పోటీపడి.. టాప్‌–12కు ఎంపిక

వారితో పోటీపడి సంగీత సంగ్రామంలో గెలిచిన తాడేపల్లిగూడెం కుర్రోడు

సంగీత సంచలనం నజీరుద్దీన్‌తో ‘సాక్షి’ ఇంటర్వ్యూ

సాక్షి, అమరావతి: మెకానిక్‌ కొడుకు.. సరిగమలలో చెలరేగిపోతుంటే సంగీత సరస్వతి పులకించింది. ‘ఈ పేటకు నేనే మేస్తిరీ.. నిరుపేదల పాలిట పెన్నిది’ అంటూ ఓ పేదింటి కుర్రాడు పాడుతుంటే.. సంగీత దర్శకులు, గాయకులు, వీక్షకుల మనస్సులు చిందులు వేశాయి. తాత ఇచ్చిన ప్రోత్సాహం.. అమ్మ లేని ఆ యువకుడి అకుంఠిత దీక్ష.. ప్రతిష్టాత్మక తెలుగు ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌–3లో విజేతగా నిలిపింది. కష్టాలే మెట్లుగా, కన్నీళ్లే ఇంధనంగా మలుచుకుని తన అద్భుత స్వరంతో సంగీత ప్రియుల హృదయాలను గెలిచిన యువ సంచలనం నజీరుద్దీన్‌ షేక్‌తో ‘సాక్షి’ ప్రత్యేక  ఇంటర్వ్యూ. ఆ విశేషాలు నజీర్‌ మాటల్లోనే.. 

అమ్మ లేని బాధ నుంచి బయటపడటానికి..  
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మా ఊరు. మా నాన్న షేక్‌ బాజీ మోటర్‌ మెకానిక్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పొషిస్తుండేవారు. అమ్మ మదీనా గతేడాది అనారోగ్యంతో మాకు దూరమయ్యారు. ఆ బాధ నుంచి బయటపడటానికి తెలుగు ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌–3ని ఉపయోగించుకున్నా. మా తాతయ్య షేక్‌ ఖాసిం దాదాపు 47 ఏళ్లుగా ఘంటసాల గాన సభ పేరుతో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. తాడేపల్లిగూడెంలో ఘంటసాల విగ్రహం కూడా పెట్టించారు.

రాగమయి ఆర్కెస్ట్రా స్థాపించి గాన కచేరీలు నిర్వహించేవారు. నాకు సంగీతంపై మక్కువ కలగడానికి.. ఆయనే కారణం. నా ఆసక్తిని గమనించి నాలుగేళ్ల వయసు ఉన్నప్పుడే షణ్ముకి ఆంజనేయులు కుమారుడు షణ్ముకి వినయ్‌ వద్ద కీ బోర్డు నేరి్పంచారు. ఐదేళ్లకే పాటలు పాడేందుకు శిక్షణ ఇచ్చారు. తొమ్మిదేళ్లు వచ్చేసరికి నేను వేదికలపై పాటలు పాడే స్థాయికి చేరా. తాతయ్య చెల్లెలు షేక్‌ ఫాతిమా కూడా ఓ ప్రైవేటు స్కూల్‌లో సంగీత ఉపాధ్యాయురాలిగా పనిచేసేవారు. ఆమె నుంచి సంగీతంలో మెళకువలు నేర్చుకున్నా.  

రూ.పది లక్షల కన్నా.. ప్రపంచ గుర్తింపే గొప్ప 
హైదరాబాద్‌లో తెలుగు ఇండియన్‌ ఐడల్‌ కార్యక్ర­మం కోసం ఆడిషన్లు జరుగుతున్నాయని తెలిసి వెళ్లా­ను. సంగీత దర్శకుడు తమన్‌ మెచ్చుకుని పోటీకి ఎంపిక చేశారు. దాదాపు 15 వేల మంది ఆడిషన్లకు వస్తే.. 12 మందికి మాత్రమే పోటీచేసే అవకా­శం లభించింది. ‘ఆహా’ ఓటీటీ వేదికగా దాదాపు 28 వారాల పాటు పోటీ జరిగింది. అందులో విజేతగా నిలవడం జీవితంలో అతి పెద్ద విజయంగా భావిస్తున్నా. పవన్‌కళ్యాణ్‌ ‘ఓజీ’తో పాటు నాని, సుధీర్‌బాబు సినిమాల్లో పాటలు పాడే అవకాశం దక్కింది. బహుమతిగా వచి్చన రూ.10 లక్షలకన్నా.. నా కష్టా­న్ని, టాలెంట్‌ను ప్రపంచం గుర్తించిందనే సంతోషం ఎక్కువగా ఉంది. 

ప్రముఖ గాయకులతో కలిసి విదేశా­ల్లో త్వరలో సంగీత ప్రద­ర్శన ఇవ్వబోతున్నానంటే నన్ను ఆదరించి ప్రోత్సహించిన ప్రతి ఒక్కరి ఆశీర్వా­దం వల్లే. తెలుగు ఇండియన్‌ ఐడల్‌ వల్ల సంగీత దర్శకుడు తమన్, గాయకులు కార్తీక్, గీతామాధురితో పాటు సహ గాయకుల నుంచి ఎంతో నేర్చుకున్నాను. సీఏ పూర్తి చేసి చదువులోనూ, సినీ గాయకుడిగానూ రాణించాలనుకుంటున్నా. ఏఆర్‌ రెహా్మన్‌ సినిమాల్లో పాడటం నా కల. ఆ అవకాశం కోసం ఎదురుచూస్తుంటా. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement