ట్రాఫిక్‌ ఉల్లంఘన.. రోజుకు 9 మంది మృతి

National road safety programs from 18 Jan - Sakshi

ప్రతి వంద రోడ్డు ప్రమాదాల్లో 36 మంది మృత్యువాత

ట్రాన్స్‌పోర్టు రీసెర్చి వింగ్‌ అధ్యయనంలో వెల్లడైన అంశాలివి

నేటి నుంచి జాతీయ రహదారి భద్రత కార్యక్రమాలు

సాక్షి, అమరావతి: మన రాష్ట్రంలో ట్రాఫిక్‌ ఉల్లంఘనల కారణంగా రోజుకు తొమ్మిదిమంది మృత్యువాత పడుతున్నారు. ప్రతి వంద రోడ్డు ప్రమాదాల్లో 36 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రాష్ట్రంలో ట్రాఫిక్‌ రూల్స్‌ ఉల్లంఘించేవారు 40 శాతం మంది ఉన్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ తేల్చింది. గత నాలుగేళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదాలను విశ్లేషిస్తూ ట్రాన్స్‌పోర్టు రీసెర్చి వింగ్‌ ఇటీవలే ఓ నివేదిక వెల్లడించింది. మన రాష్ట్రంలో ప్రమాదాలు, కారణాలు తదితర అంశాలను ఈ నివేదిక విశ్లేషించింది. మన రాష్ట్రంలో ఏటా 35 శాతం ద్విచక్ర వాహనాలు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నాయి. వీటిని నడుపుతున్నవారిలో 80 శాతం మంది హెల్మెట్‌ ధరించకపోవడం వల్ల తలకు గాయాలై ప్రాణాలు కోల్పోతున్నారు. ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు చెక్‌ పెట్టేందుకు, రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రాణాలు కోల్పోకుండా నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల భారీగా జరిమానాలు పెంచిన సంగతి తెలిసిందే.

ఈ జరిమానాల పెంపుతో రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పడతాయని రవాణారంగ నిపుణులు పేర్కొంటున్నారు. వాహన తనిఖీలను ముమ్మరం చేసి రహదారి భద్రతపై పూర్తి అవగాహన కల్పించాలని రవాణా, పోలీస్‌ శాఖలు నిర్ణయించాయి. నేటి (సోమవారం) నుంచి జాతీయ రహదారి భద్రత కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. నెలరోజుల పాటు జరగనున్నాయి. ప్రతి రోజూ రవాణా శాఖ అధికారులకు ఓ కార్యక్రమాన్ని నిర్దేశించింది. ఆటో, లారీ డ్రైవర్లకు కంటి పరీక్షలు, ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై రాష్ట్రంలో రోజూ 80 నుంచి 120 వరకు కేసులు నమోదవుతున్నాయి. డ్రైవింగ్‌ లైసెన్సు ఉండి ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడేవారికి జాతీయ రహదారి భద్రత కార్యక్రమాల్లో భాగంగా పునశ్చరణ తరగతులు నిర్వహించడంపై ప్రణాళిక రూపొందించారు.  ఈ వారోత్సవాలకు సంబంధించి సుప్రీంకోర్టు కమిటీ కూడా కొన్ని సూచనలు చేసింది. వాహనదారుడు హెల్మెట్‌ ధరించడం నిబంధనగా కాకుండా బాధ్యతగా తీసుకునేలా అవగాహన కల్పించాలని పేర్కొంది. రవాణా వాహనాలు నడిపే డ్రైవర్లు తప్పనిసరిగా ఆరు నెలలకోసారి కంటి పరీక్షలు చేయించుకోవాలని, ఈ వారోత్సవాల్లో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించేందుకు శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించింది. రహదారి భద్రత చర్యలు పాటించకుండా పదేపదే ఉల్లంఘనలకు పాల్పడే వాహనదారులపై కఠిన చర్యలు చేపట్టాలి.

8 శాతం తగ్గిన ట్రాఫిక్‌ ఉల్లంఘనలు
రాష్ట్రంలో ట్రాఫిక్‌ ఉల్లంఘనలు ఎనిమిది శాతం వరకు తగ్గాయి. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతుండటానికి ప్రధాన కారణమైన ఓవర్‌ స్పీడ్, హెల్మెట్‌ ధరించకపోవడం వంటి కేటగిరీల్లో అయితే ఏకంగా పది నుంచి 15 శాతం వరకు ఉల్లంఘనలు తగ్గిపోయాయి. ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు భారీ జరిమానాలు విధించేలా రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది అక్టోబరులో నోటిఫికేషన్‌ జారీచేసి పక్కాగా అమలు చేస్తుండటమే ఇందుకు కారణమని రవాణా శాఖ పేర్కొంటోంది. గతంలో రాష్ట్రంలో ట్రాఫిక్‌ ఉల్లంఘనలు 40 శాతం వరకు ఉన్నట్లు పేర్కొన్న రీసెర్చి వింగ్‌ ఇప్పుడు జరిమానాల పెంపు భయంతో తగ్గిపోయాయని తెలిపింది. ఉల్లంఘనలు ఇంకా తగ్గుముఖం పడితే రోడ్డు ప్రమాదాలు, మరణాలు గణనీయంగా తగ్గిపోతాయని రవాణా అధికారులు పేర్కొంటున్నారు. 

హెల్మెట్‌ ధరించేవారి సంఖ్య పెరిగింది
గతంలో హెల్మెట్‌ ధరించకపోతే రూ.100 జరిమానా విధించేవారు. ఇప్పుడు జరిమానా రూ.వెయ్యికి పెంచడంతో ఉల్లంఘించేవారి సంఖ్య 15 శాతానికి తగ్గింది. ఈ ఏడాది సెప్టెంబరు 20 నుంచి అక్టోబరు 20 వరకు హెల్మెట్‌ ధరించని వారిపై 1,947 కేసులు నమోదు చేశారు. తరువాత నెలలో 1,650 కేసులు నమోదయ్యాయి. అంటే హెల్మెట్‌ ధరించేవారిసంఖ్య 15 శాతం పెరిగింది. ఓవర్‌ స్పీడ్‌కు జరిమానా రూ.వెయ్యి నుంచి రూ.10 వేల వరకు పెంచారు. దీంతో కేసులు వెయ్యి నుంచి 900కు (పదిశాతం) తగ్గాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top