
నిరసన వ్యక్తం చేస్తున్న మాలమహానాడు, ప్రజా సంఘాల నేతలు
ప్రొద్దుటూరు: కోనసీమ జిల్లాలో గొడవలకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు కారకులని జాతీయ మాలమహానాడు అధ్యక్షుడు గోసా మనోహర్ ఆరోపించారు. అమలాపురం ఘటనను నిరసిస్తూ వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులోని మైదుకూరు రోడ్డులోని అంబేడ్కర్ విగ్రహం వద్ద గురువారం ఆయన నిరసన తెలిపారు. మంత్రి విశ్వరూప్ ఇంటిపై దాడి చేయడం వెనుక బాబు, పవన్‌ల హస్తం ఉందన్నారు.
ఇదిలా ఉండగా, దళిత మంత్రి విశ్వరూప్ ఇంటిపై దాడి సిగ్గుచేటని ప్రజా సంఘాల నాయకులు అన్నారు. దాడికి నిరసనగా స్థానిక పాత బస్టాండ్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సుధాకర్ మాదిగ, మాలమహానాడు నాయకుడు ఇమ్మానుయేల్, జమ్మలమడుగు డివిజన్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు గాలిపోతుల సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.