సాక్షి, హైదరాబాద్: ఏపీలో అరాచక పాలన సాగుతోందన్నారు వైఎస్సార్‌సీపీ నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతి. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. లక్షల కోట్లు దండుకుని ఇతర దేశాల్లో దాస్తున్నారని అన్నారు. ఎన్టీఆర్ మీదకు చెప్పులు వేయించిన వ్యక్తి.. ఇప్పుడు మళ్లీ విగ్రహం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు.
నందమూరి లక్ష్మీపార్వతి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు వెన్ను పోటుకు 30 ఏళ్ళు గడిచాయి. ఆరోజు మహా నాయకుడు ఎన్టీఆర్ మీద చెప్పులు వేశాడు. మళ్ళీ ఇప్పుడు విగ్రహం పెడతాను అని రాజకీయం చేస్తున్నాడు. చంద్రబాబు ప్రతిష్ట పడిపోతున్నపుడు ఎన్టీఆర్ పేరు వాడుకుంటాడు. దుర్మార్గంగా ఎన్టీఆర్‌కు జరిగిన ద్రోహం అందరూ ఆలోచించాలి. బాబు చెప్పే అబద్దాలు నమ్మొద్దు. ఇప్పటికైనా ఎన్టీఆర్ చివరి క్షణంలో పడిన క్షోభను గమనించాలి. ఎన్టీఆర్ చివరి క్షణంలో ఇచ్చిన ఇంటర్వ్యూ అందరూ చూడండి. చంద్రబాబు లాంటి దుర్మార్గుడికా నేను పిల్లను ఇచ్చింది అని ఎన్టీఆర్ బాధ పడ్డారు. చంద్రబాబును రాజకీయాల్లో ఉంచకూడదు అని ఎన్టీఆర్ అన్నారు.
చంద్రబాబు అబద్దాల చరిత్రను నమ్మొద్దు. మీరు ఎన్టీఆర్ చెప్పింది మరోసారి వినండి. నిజమైన ఎన్టీఆర్ అభిమానులు చంద్రబాబు మోసాన్ని నమ్మరు. నిజమైన ఎన్టీఆర్ అభిమానులు చంద్రబాబును సహించరు. మొన్న కూడా ఈవీఎంల ద్వారా మోసం చేసి వచ్చాడు. అబద్దపు హామీలు చేసి అధికారంలోకి వచ్చాడు. అందరినీ మోసం చేసి అధికారం చేజిక్కించుకున్నారు. తండ్రి కొడుకులకు దోపిడీ తప్ప హామీలు నెరవేర్చే ఆసక్తి లేదు. లక్షల కోట్లు దండుకుని ఇతర దేశాల్లో దాస్తున్నారు. మళ్ళీ ఆయన మీద కేసులు కొట్టి వేయించుకుంటున్నారు.
జగనే నంబర్ వన్..
ఎన్టీఆర్, వైఎస్సార్ ప్రజల్లో ఎప్పటికీ నిలిచారు. భారత్‌లోనే పవర్ ఫుల్ స్థానంలో వైఎస్ జగన్ ఉన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో దేశంలోనే నంబర్ వన్ వైఎస్ జగన్. మళ్లీ జగన్‌ను అధికారంలోకి తీసుకురావాలని ప్రజలు ఆలోచిస్తున్నారు. ఏపీలో ఎవరికీ పండగ సంతోషంగా జరగలేదు. పండగ పేరుతో రాష్ట్రాన్ని జూదం, పందేలు, రికార్డింగ్ డాన్సులు అనే విధంగా చేశారు. వైఎస్ జగన్ విశాఖను అందంగా తీర్చిదిద్దారు. కానీ, చంద్రబాబు, లోకేష్ మాత్రం.. విశాఖను అశ్లీల నృత్యాలకు వేదిక చేశారు.
లోకేష్‌దే మొదటి అరెస్ట్..
లోకేష్ రెడ్ బుక్ పాలనా ఆయన మెడకే చుట్టుకుంటుంది. నేను ప్రధాని మోదీకి కూడా లేఖ రాస్తాను. ఇలాంటి వారిని మీరు ఎంకరేజ్ చేయొద్దు. హంతకులను మీరు వెనుకేసుకురావొద్దు. ఇంత అవినీతిలో కూరుకుపోయిన వారిన మీకు స్నేహితులా?. జగన్ అధికారంలోకి వచ్చాక మొదట అరెస్ట్ అయ్యేది లోకేష్. ఆయన అవినీతిలో కూరుకుపోయారు. ఎన్టీఆర్ బతికి ఉన్నఫుడు చంపేశారు. ఇపుడు విగ్రహం పెడుతామని డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబుకు చాతనైతే ఎన్టీఆర్‌కి భారతరత్న ఇప్పించాలి అని డిమాండ్ చేశారు.



