
నిండుకుండలా సాగర్ జలాశయం
చరిత్రకు సాక్ష్యం నాగార్జున కొండ
మనసుదోచే ఎత్తిపోతల
విజయపురిసౌత్: నాగార్జున సాగర్‌కు కొత్తనీరు వచ్చి నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరటంతో జలాశయం కొత్త అందాలను సంతరించుకుంది. గత మూడు రోజులుగా సాగర్ ప్రాజెక్టు 26 క్రస్ట్‌గేట్లు నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. అంతేకాకుండా నిండుకుండలా కనపడుతున్న సాగర్‌లో జలాశయం మీదుగా లాంచీలో నాగార్జునకొండకు వెళ్లటం పర్యాటకులకు మరుపురాని అనుభూతిగా మిగిలిపోతుంది. దీంతో నిత్యం రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది పర్యాటకులు తరలివస్తారు. ఈ నేప«థ్యంలో సాగర్ చుట్టుపక్కల సందర్శినీయ స్థలాలపై ప్రత్యేక కథనం..
ప్రధాన జలవిద్యుత్ కేంద్రం
ఇది సాగర్ ప్రధాన డ్యాం దిగువ ప్రాంతంలో ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ఉంటుంది. ఈ జలవిద్యుత్ కేంద్రాన్ని సాగర్ జెన్‌కో ఎస్‌ఈ అనుమతి తీసుకొని సందర్శించాల్సి ఉంటుంది.
చరిత్రకు ప్రతిరూపం నాగార్జునకొండ
నాగార్జునకొండకు వెళ్లాలంటే విజయపురిసౌత్‌లోని లాంచీస్టేషన్ నుంచి 14 కి.మీ.దూరం కృష్ణానదిలో ప్రయాణం చేయాలి. కొండకు చేరుకునేందుకు లాంచీలో 45 నిమిషాల సమయం పడుతుంది. నాగార్జునకొండ ప్రపంచంలోనే రెండవ ఐలాండ్ మ్యూజియం. నాగార్జున సాగర్ పరిధిలోని విజయపురిసౌత్‌లో లాంచీస్టేషన్ నుంచి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు లాంచీలు పర్యాటకులకు అందుబాటులో ఉంటాయి.
పెద్దలకు లాంచీ టిక్కెట్టు ధర రూ.200, పిల్లలకు రూ 150, మ్యూజియం, మాన్యుమెంట్ సందర్శనకు రూ.30, మ్యూజియం సందర్శనకు 15 సంవత్సరాలలోపు చిన్నారులకు ఉచితం. విజ్ఞాన విహార యాత్రకు గ్రూపుగా వచ్చే విద్యార్థులకు లాంచీ టిక్కెట్‌పై 15 శాతం రాయితీ పర్యాటకశాఖ ఇస్తుంది. అలాగే పార్టీలకు, పంక్షన్‌లకు శాంతిసిరి గంటకు రూ.10,000లు, అగస్త్య లాంచీ గంటకు రూ.8,000 చెల్లించాల్సి ఉంటుంది. ఇతర వివరాలకు లాంచీస్టేషన్ ఫోన్ 9705188311 నెంబర్‌ను సంప్రదించవచ్చు.
గత ఆనవాళ్లకు చిరునామా అనుపు
నాగార్జునసాగర్ 7కి.మీ. దూరంలో అనుపు పర్యాటక కేంద్రం ఉంది. ఇక్కడ ఆనాటి నాగార్జున విశ్వ విద్యాలయం, ఇక్షా్వకుల కాలం నాటి యాంపీ స్టేడియం ఆనవాళ్లు ఉన్నాయి. కృష్ణానది లోయలో లభించిన రంగనాథస్వామి దేవాలయాన్ని అదే రాతితో అనుపులోని కృష్ణానది తీరంలో నిర్మించటం విశేషం.
భక్తుల కోర్కెలు తీర్చేసాగర్‌మాత
విజయపురిసౌత్‌లోని కృష్ణానది తీరంలో వేంచేసియున్న సాగర్‌మాత దేవాలయానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తుంటారు. భక్తుల కోర్కెలు తీర్చే చల్లనితల్లిగా సాగర్‌మాతకు విశిష్టమైన పేరు ఉంది. ఇక్కడ నెలకొల్సిన జపమాల క్షేత్రం రాష్ట్రంలోనే ప్రత్యేకతను నెలకొంది.